Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను కెలికిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   26 Oct 2015 5:33 PM GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను కెలికిన చంద్ర‌బాబు
X
జ‌న‌సేన అధినేత, ప‌వర్‌ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్- ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుల మ‌ధ్య మ‌రోమారు మాట‌ల యుద్ధం న‌డిచే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ప‌క్షాన‌ ప్ర‌శ్నించేందుకే ఉన్నాన‌ని చెప్పిన ప‌వ‌న్‌...ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా స్టేట్‌ మెంట్‌ లు ఇచ్చారు. ముఖ్యంగా ఇది ఆంధ్రుల రాజ‌ధాని అమ‌రావ‌తి భూ సేక‌ర‌ణ కేంద్రంగా జ‌రిగింది. తాజాగా ఇపుడు అదే అంశంలో సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ ల మ‌ధ్య పొరాపొచ్చాలు వచ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

అమ‌రావ‌తి శంకుస్థాప‌న పూర్త‌యిన నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబు రాజ‌ధానికి భూములిచ్చిన రైతుల‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా రైతులు త‌మ అభిప్రాయాల‌ను తెలిపారు. మెజార్టీ రైతులు ప‌రిహారం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేయ‌గా ప‌లువురు రైతులు కౌలు స‌మ‌స్య‌లు, అసైన్డ్‌ భూముల అవ‌స్థ‌ల‌ను వివ‌రించారు. వాట‌న్నింటినీ సానుకూలంగా విన్న చంద్ర‌బాబు 4 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇదే సంద‌ర్భంగా ఆయా కేట‌గిరీల్లోని భూములకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని గుంటూరు కలెక్టర్‌, జేసీలను చంద్రబాబు ఆదేశించారు.

ఉండవల్లి - పెనుమాక రైతులకు ప్యాకేజీ పెంచే యోచనలో ఉన్నామని చంద్రబాబు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. భూముల‌కు ప‌రిహారంగా ఇచ్చే ప్యాకేజీ పెంచినా భూములివ్వడానికి నిరాకరించిన రైతులతో మాట్లాడాలని స్థానిక‌ అధికారులకు సూచించారు. ఎక్కువ ప‌రిహారం ఇచ్చినప్ప‌టికీ భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రాకుంటే త‌ప్పని పరిస్థిత్తుల్లో భూసేకరణ చేస్తామని చంద్రబాబు ప్ర‌క‌టించారు.

భూ సేక‌ర‌ణ చేస్తే ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడుతాన‌ని గ‌తంలోనే ప‌వ‌న్ క‌రాఖండిగా చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా చంద్ర‌బాబు ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌తో రాజ‌ధాని ప్రాంతాల రైతుల్లో భిన్నాభిప్రాయాలు రేకెత్తి అవి నిర‌స‌న రూపం దాల్చే అవ‌కాశం...అందుకు ప‌వ‌న్ సంఘీభావం చెప్ప‌డం కొట్టిపారేయ‌లేమ‌ని ప‌లువురు అంచ‌నావేస్తున్నారు. ​