Begin typing your search above and press return to search.

తెలంగాణ భ్రాంతి వ‌ద‌ల‌దా బాబు?

By:  Tupaki Desk   |   1 Jun 2019 12:40 PM GMT
తెలంగాణ భ్రాంతి వ‌ద‌ల‌దా బాబు?
X
ఈ న‌గ‌రానికి ఏమైందంటూ సినిమా ఆరంభంలో వ‌చ్చే యాడ్ కు త‌గ్గ‌ట్లే.. ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్లు ప‌లువురు ఈ బాబుకు ఏమైంద‌న్న ప్ర‌శ్న‌ను వేసుకుంటున్నారు. వాస్త‌వాల్ని గుర్తించ‌టంలో అంత‌కంత‌కూ వెన‌కకుపోతున్న చంద్ర‌బాబు తీరు చూసిన వారు షాక్ తింటున్నారు. తెలంగాణ‌లో త‌న‌ను త‌న పార్టీని దారుణంగా రిజెక్ట్ చేయ‌ట‌మే కాదు.. త‌న కార‌ణంగా తెలంగాణ‌లో అన్నో ఇన్నో సీట్లు సాధించాల్సిన కాంగ్రెస్ కు సైతం భారీ న‌ష్టం వాటిల్లింద‌న్న నిజం బాబుకు అర్థం కాలేదా? అంటే.. కాలేద‌నే చెప్పాలి.

తాజాగా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు చూస్తే.. బాబుకు తెలంగాణ భ్రాంతి వ‌ద‌ల‌దా? అన్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు. హైద‌రాబాద్ కు వ‌చ్చిన బాబును తెలంగాణ‌కు చెందిన కొంద‌రు నేత‌లు క‌ల‌వ‌టం.. ఇటీవ‌ల వెల్ల‌డైన ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి చ‌ర్చ రావ‌టం జ‌రిగింది. ప‌నిలో ప‌నిగా తెలంగాణ‌లోపార్టీని యాక్టివ్ చేయాల‌న్న మాట వ‌ర‌స మాట‌కు బాబు రియాక్ట్ కావ‌టం షాకింగ్ గా మారింది.

ఆ మ‌ధ్య‌న జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న విషయాన్ని బాబు ఎలా మ‌ర్చిపోతార‌న్న‌ది ప్ర‌శ్న‌. అన్నింటికి మించి తెలంగాణ‌లో కేసీఆర్ మీద ఉన్న వ్య‌తిరేక‌త‌.. బాబు ఎప్పుడైతే తెలంగాణ‌లో అడుగు పెట్టారో అప్ప‌టి నుంచి గులాబీ బాస్ కు అనుకూలంగా మారింద‌న్న విష‌యాన్ని గ‌ర్తించ‌న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉన్నాయి. ఇక నుంచి వారంలో రెండు రోజులు తెలంగాణ పార్టీ అంశాలకు కేటాయిస్తాన‌ని చెబుతున్న బాబు తీరు చూస్తే.. తెలంగాణ మీద ఆయ‌న ఇంకా భ్రాంతిలోనే ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

ఎప్పుడైతే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిపోయిందో.. అప్పుడే తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి నూక‌లు చెల్లాయ‌న్నది నిజం. కానీ.. ఆ వాస్త‌వాన్ని గుర్తించ‌క త‌ప్పు చేసిన బాబు.. తెలంగాణ‌లో మ‌రోసారి కేసీఆర్ అధికారానికి వ‌చ్చేలా చేశార‌న్న వాద‌న ఉంది. కేసీఆర్ కు రెండోసారి ప‌వ‌ర్లోకి రాకుండా చేసే అవ‌కాశం లేద‌నే అనుకున్నా.. ఇప్ప‌టిమాదిరి తిరుగులేని రీతిలో అధిక్య‌త ఉండే అవ‌కాశం ఏ మాత్రం ఉండేది కాద‌నటంలో సందేహం లేదు. త‌న కార‌ణంగా త‌న ప్ర‌త్య‌ర్థులు బ‌ల‌ప‌డేలా చేస్తున్న బాబు తీరు.. తాజాగా ఆయ‌న తెలంగాణ మీద మ‌రింత దృష్టి పెడ‌తార‌న్న మాట‌.. కేసీఆర్ అండ్ కోకు పండ‌గ చేసుకునే మాటగా చెప్ప‌క త‌ప్ప‌దు.