Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి భూసేక‌ర‌ణ‌...అసలు రూప‌మిదేన‌ట‌!

By:  Tupaki Desk   |   8 April 2017 6:48 PM IST
అమ‌రావ‌తి భూసేక‌ర‌ణ‌...అసలు రూప‌మిదేన‌ట‌!
X
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి భూముల‌ను సేక‌రిస్తున్నామంటూ చెప్పుకుంటూ వ‌స్తున్న ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు స‌ర్కారు అస‌లు రూపం ఇప్పుడు పట్టాలెక్కేసింద‌నే చెప్పాలి. ఎందుకంటే.. గుంటూరు జిల్లా ప‌రిధిలోని మంగ‌ళ‌గిరి ప‌రిధిలోని గ్రామాల్లోని వ్య‌వ‌సాయ భూముల‌ను రాజ‌ధాని నిర్మాణానికి ఇచ్చేయాల్సిందేన‌ని అక్క‌డి రైత‌న్న‌ల‌కు టీడీపీ స‌ర్కారు ఎప్పుడో ఆదేశాలు జారీ చేసేసింది. భూముల‌నే జీవ‌నాధారంగా చేసుకున్న రైత‌న్న‌లు త‌మ‌కు ఇష్టం లేక‌పోయినా... త‌మ భూముల‌ను ప్ర‌భుత్వానికి ఇచ్చినా... జీవ‌నాధారం దొరుకుతుందో, లేదో తెలియ‌కున్నా కూడా భూముల‌ను ఇవ్వాల్సిందేన‌ని నాడు ప్ర‌భుత్వం త‌న‌దైన ద‌మ‌న నీతిని బ‌య‌ట‌పెట్టుకుంది.

అయితే త‌న అస‌లు రూపాన్ని బ‌య‌ట‌పెట్టుకోకుండా... త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను రంగంలోకి దించేసి... రైతుల‌కు మాయ మాట‌లు చెప్పి... త‌మ మాట విన్న రైతుల‌కు తాయిలాలు.. విన‌ని రైతుల‌కు బెదిరింపులు జారీ చేసిన ప్ర‌భుత్వం అనుకున్న మేర భూముల‌ను సేకరించేసింది. అయితే ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అస‌లు మంత్రాంగాన్ని గ్ర‌హించిన కొంద‌రు రైతులు టీడీపీ నేత‌ల బెదిరింపుల‌కు ఏమాత్రం బెడిసిపోలేదు. త‌మ భూముల‌ను ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పారు. ఇలా రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురైన భూములు 320 ఎక‌రాల మేర ఉన్నాయి. ఈ భూముల‌న్నీ కూడా రాజ‌ధానికి సెంట‌ర్‌ గా నిల‌వ‌నున్న రాయ‌పూడి - తుళ్లూరు ప‌రిధిలో ఉన్నాయి. వీటిలో రాయ‌పూడిలో 224 ఎక‌రాలుంటే... తుళ్లూరులో 96 ఎక‌రాలున్నాయి.

ఇప్ప‌టికే 33 వేల ఎక‌రాల‌కు భూముల‌ను పైగా ఎలాగోలా సేక‌రించిన ప్ర‌భుత్వం... తాజాగా ఈ 320 ఎక‌రాల‌ను కూడా చేజిక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసేసింది. తాత్కాలిక తాయిలాలు, బెదిరింపుల‌కు లొంగ‌ని స‌ద‌రు భూముల రైతుల‌ను త‌న దారికి తెచ్చుకునేందుకు ప‌క్కా ప‌థ‌కం ర‌చించిని టీడీపీ స‌ర్కారు... ఇప్పుడు భూ సేక‌ర‌ణ చ‌ట్టాన్ని త‌న‌కు అస్త్రంగా మ‌లచుకుంది. అనుకున్న‌దే త‌డువుగా నిన్న రాత్రే దీనికి సంబంధించి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న జారీ చేసింది. గుంటూరు క‌లెక్ట‌ర్ కాంతిలాల్ దండే పేరిట విడుద‌లైన ఈ ప్ర‌క‌ట‌న సారాంశం చూస్తే... అవాక్క‌వ్వ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... ప్ర‌భుత్వం సేక‌రించాల‌ని భావిస్తున్న ఈ భూముల‌కు సంబంధించి ఎలాంటి క్ర‌య విక్ర‌యాలు చెల్ల‌వ‌ని, ఈ భూముల‌కు సంబంధించి ఎలాంటి వ్య‌వ‌హారాలైనా... భూ య‌జ‌మానులుగా ఉన్న రైతుల‌ను కాకుండా జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఉన్న కాంతిలాల్ దండేను మాత్ర‌మే సంప్ర‌దించాల‌ని కూడా నిన్న‌టి ప్ర‌క‌ట‌న‌లో తేల్చి చెప్పింద‌.

వెర‌సి త‌న దారికి రాని రైతులపై ఎలాంటి అస్త్రాన్ని ప్ర‌యోగించ‌నున్నామో... టీడీపీ స‌ర్కారు చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లైంది. అంతేకాకుండా నిన్న జారీ అయిన భూసేక‌ర‌ణ ప్ర‌క‌ట‌న‌పై ఎవ‌రికైనా అభ్యంత‌రాలుంటే... ప్ర‌క‌ట‌న వెలువ‌డిన రోజు నుంచి 60 రోజుల్లోగా అభ్యంత‌రాల‌ను తెలపాల‌ని కూడా ప్ర‌భుత్వం కాస్తంత గ‌ట్టిగానే చెప్పేసింది. అంటే... ఈ భూముల‌ను వాటి య‌జ‌మానులుగా ఉన్న రైతులు త‌మ‌కు ఇష్టం లేక‌పోయినా కూడా ప్ర‌భుత్వం చెప్పిన ధ‌ర‌కే ఇచ్చేయాల్సిందేన‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/