Begin typing your search above and press return to search.

అమ్మ పెట్టదు... సామెతలా ఉంది బాబు తీరు

By:  Tupaki Desk   |   25 Jan 2017 7:05 AM GMT
అమ్మ పెట్టదు... సామెతలా ఉంది బాబు తీరు
X
తెలుగులో అందరికి తెలిసిన సామెత ఒకటి ఉంది. అమ్మ పెట్టదు.. అడుక్కు తిననీయదు అని. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుచూస్తుంటే సరిగ్గా ఇదే తీరులో ఉంది. ప్రత్యేక హోదా సాధన విషయంలో తనకున్న పరిమితులు బాబుకు బాగానే తెలుసు. తాను తేలేనన్న విషయం తెలిసిన తర్వాత.. అన్ని మూసుకొని కూర్చుంటే బాగుండేది. కానీ.. అలాంటిదేమీ లేకుండా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఆంక్షల విధిస్తూ.. లేనిపోని ఉద్రిక్తతను పెంచేలా తీసుకుంటున్న నిర్ణయాలపై ఆంధ్రోళ్లు చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు.

రెండు కళ్ల సిద్దాంతమని చెప్పి.. విభజనకు కీలకంగా వ్యవహరించినప్పటికీ.. నమ్మి ఓట్లువేసిన పాపానికి.. హోదా విషయంలోనూ బాబు చేతులెత్తేశారంటూ విరుచుకుపడేటోళ్లు లేకపోలేరు. ప్రజల ఆకాంక్షల కంటే కూడా.. తన రాజకీయ ప్రయోజనాల మీదనే చంద్రబాబు దృష్టి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి హోదా మీద ఆంధ్రోళ్లలో ఆగ్రహం చాలానే ఉన్నా.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

అనుకోనివిధంగా జల్లికట్టు ఉదంతం తెర మీదకు రావటం.. మెరీనా బీచ్ లో తమిళ యువత పోటెత్తిన వైనం.. వారి ఉద్యమ తీరు.. పోరాటపటిమ ఆంధ్రోళ్లకు స్ఫూర్తిగా మారింది. దీంతో.. హోదా విషయం మీద శాంతియుత మార్గంలో విశాఖ ఆర్కే బీచ్ లో మౌన దీక్ష చేయాలన్న ఆలోచన వచ్చింది. ఇలాంటివి జరిగినప్పుడు.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని.. ప్రజల ఆకాంక్షలు ప్రపంచానికి తెలిసేలా చేస్తే.. అక్కడెక్కడో ఉన్న మోడీకి ఆంధ్రోళ్లు ఏం కోరుకుంటారో తెలిసే వీలుంది. అదే జరిగినప్పుడు.. ఇప్పటికిప్పుడు కాకున్నా.. ఏదో ఒక రోజు న్యాయమైన హోదా ఏపీకి దక్కే వీలుంది.

కానీ.. ఇలాంటివేమీ ఆలోచించకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్న బాబు తీరుపై విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. హోదా మీద ఏపీ యువత ఆకాంక్ష ప్రపంచానికి తెలియాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వాటిని అడ్డుకోవటం ద్వారా ఇమేజ్ కంటే బాబుకు డ్యామేజే ఎక్కువని చెబుతున్నారు. ఆర్కే బీచ్ లో జరిగే మౌన దీక్షను కానీ తనకున్న అధికారంతో బాబు అడ్డుకున్న పక్షంలో.. మొదట చెప్పిన సామెతకు బాబు నూటికి నూరు శాతం అర్హుడవుతారని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/