Begin typing your search above and press return to search.

బాబు నేర్చుకుంటున్న‌ కేసీఆర్ ముంద‌స్తు పాఠాలు

By:  Tupaki Desk   |   25 Nov 2018 1:30 AM GMT
బాబు నేర్చుకుంటున్న‌ కేసీఆర్ ముంద‌స్తు పాఠాలు
X
ఈ జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు అన్నాడో మహాకవి. ఆ అనుభవాలు మనవైనా సరే...ఎదుటివారివైనా సరే... వాటి నుంచి మాత్రం మనం చాలా నేర్చుకోవచ్చు. అదే పంథాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నారు. ఇక విషయానికి వస్తే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఎన్నికలలో తమని గెలిపించమనో లేక తమ పార్టీకి ఓటు వేయమని తమ నియోజకవర్గాలలో ప్రజలను అడగటానికి వెళుతున్న అభ్యర్దులను ప్రజలు నిలదీన్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.

నాలుగు సంవత్సరాలుగా తమ నియోజకవర్గాన్ని గాని తమ మండలాన్ని గాని పట్టించుకోవడానికి సమయం లేని మీకు ఓట్లు అడగడానికి ఏం ముఖం పెట్టుకుని వచ్చారంటూ తెలంగాణలో నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికల ప్రచారానికని వెళ్లిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరులపై ఆ నియోజకవర్గ ప్రజలు చెప్పులతో దాడి చేసారు. లంబాడిలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడరంటూ ఆయన్ని ప్రజలు నిలదీశారు. ఈ తరుణంలో టీఆర్‌ ఎస్ నాయకులు వారికి సమాధానం చెప్పలేక - ప్రచారం మధ్యలో ఆపలేక ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.
ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ ఎమ్మెల్యేలను - ఎంపీలను అప్రమత్తం చేశారు.

తెలంగాణలో నిలదీతల పర్వం ఆంధ్రప్రదేశ్‌ లో రిపీట్ కాకూడదని - చంద్రబాబు నాయుడు అన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలకు ఇంకా ఆరు నెలల పైనే గడువు ఉండటంతో తెలుగుదేశం నాయకులు - తమ తమ నియోజకవర్గాలలో తిరిగి ప్రజలు సమస్యలను తెలుసుకోవాలని బాబు ఆదేశించినట్టు సమాచారం. సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా పనులు చేపట్టాలని అన్నట్లు తెలుస్తోంది.

గత సంవత్సరం " ఇంటింటికీ తెలుగుదేశం" పేరుతో కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయితే చాలా గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర సమితి విఫలమయ్యిందని - అందుకే ప్రజలు నిలదీస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ‎చంద్రబాబు నాయుడు చేసిన కర్తవ్య బోధతో తమ నియోజకవర్గాలలో ఇంకా తిరగని ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అని ప్రజాప్రతినిధులు ఆలోచనలో పడ్డారట. ఇదే మరి తెలంగాణ నాయకుల అనుభవాలు - ఆంధ్రప్రదేశ్ లోని నాయకులకు పాఠాలు నేర్పడమంటే.!