Begin typing your search above and press return to search.

బాబుది అఖిల ప‌క్షం కాదు!..ఏకాకి ప‌క్ష‌మే!

By:  Tupaki Desk   |   30 Jan 2019 5:25 PM GMT
బాబుది అఖిల ప‌క్షం కాదు!..ఏకాకి ప‌క్ష‌మే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం చేప‌ట్టాల్సిన ఉద్య‌మ రూప‌క‌ల్ప‌న కోస‌మంటూ అధికార టీడీపీ ప్ర‌భుత్వం ఈ రోజు నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష స‌మావేశం అట్ట‌ర్ ప్లాఫ‌ల‌కే అట్ట‌ర్ ప్లాఫ్‌ గా నిలిచింది. రాష్ట్రంలో అధికార టీడీపీతో పాటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, జ‌న‌సేన‌. వామ‌ఫ‌క్ష పార్టీలు సీపీఎం - సీపీఐ - కొత్త‌గా ఎంట్రీ ఇచ్చిన ప్ర‌జా శాంతి పార్టీ... ఇలా చాలా పార్టీలే ఉన్నాయి. విజ‌య‌వాడ కేంద్రంగా నేటి సాయంత్రం జ‌రిగిన ఈ స‌మావేశానికి టీడీపీ మిన‌హా ఒక్క రాజ‌కీయ పార్టీ కూడా రాలేదు. వెర‌సి అఖిల పక్ష స‌మావేశంగా టీడీపీ ప్ర‌క‌టించిన ఈ బేటీ ఏకాకి ప‌క్ష భేటీగా మారిపోయింద‌ని చెప్పాలి. రాజ‌కీయ పార్టీలు దూరంగా ఉన్న ఈ స‌మావేశానికి ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి త‌ర‌ఫున చ‌ల‌సాని శ్రీ‌నివాస్ తో పాటు ప‌లు ప్ర‌జా సంఘాల ప్ర‌తినిధులు మాత్రం హాజ‌ర‌య్యారు. అఖిల ప‌క్ష భేటీ అనుకుంటే... ఏకాకి ప‌క్ష భేటీగా మారిన ఈ స‌మావేశంలో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఎప్ప‌టిమాదిరే త‌న స్వోత్క‌ర్ష‌కే ప్రాధాన్యం ఇచ్చేసి త‌న‌దైన శైలి ప్ర‌సంగం చేసి స‌మావేశం జ‌రిగింద‌నిపించారు.

రాష్ట్ర విభ‌జ‌న‌తో తీవ్ర ఆర్థిక లోటుతో కొత్త ప్ర‌యాణం ప్రారంభించిన న‌వ్యాంధ్ర త్వ‌రిత‌గ‌తిన కోలుకోవాలంటే త‌న‌లాంటి పాల‌నాద‌క్షుడికే పాల‌నా ప‌గ్గాలు ఇవ్వాల‌ని గ‌డ‌చిన ఎన్నికల్లో చెప్పుకున్న చంద్ర‌బాబు... ఎలాగోలా పాల‌నా ప‌గ్గాలు ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత ఏపీ పాల‌న‌ను గాలికొదిలేసి కేంద్రంలో అధికారంలో బీజేపీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసమంటూ లెక్క‌లలేన‌న్ని సార్లు స్పెష‌ల్ ఫ్లైట్ల‌లో చ‌క్క‌ర్లు కొట్టిన చంద్ర‌బాబు... ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ అని కొత్త రాగం అందుకున్నారు. అంతేనా... ఇక‌పై ప్ర‌త్యేక హోదా అంటే కేసులు న‌మోదు చేయ‌డంతో పాటు ఏకంగా జైలుకు పంపిస్తాన‌ని వార్నింగిచ్చేశారు. అయితే నాలుగేళ్ల పాటు బీజేపీతో కొన‌సాగిన చంద్రబాబు.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కీల‌క త‌రుణంలో బీజేపీతో స్నేహానికి వీడ్కోలు ప‌లికారు. ఆ వెంట‌నే ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని నెత్తికెత్తుకున్నారు. ప్ర‌జా ధ‌నంతో ధ‌ర్నాలు నిర్వ‌హించ‌డం మొద‌లెట్టారు. అస‌లు ప్ర‌త్యేక హోదా కోసం తొలి నినాదం చేసింది తానేన‌ని కూడా చాలా ఈజీగానే బొంకేశారు. ఈ మొత్తం ప‌రిణామాల‌న్నింటినీ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్న జంకు ఏమాత్రం లేకుండానే బాబు త‌నదైన మార్కు వ్య‌వ‌హారాన్ని న‌డిపారు.

ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు గ‌డువు మ‌రింత ద‌గ్గ‌ర‌ప‌డిన స‌మ‌యంలో ప్రత్యేక హోదా ఉద్య‌మాన్ని ఉధృతం చేద్దామంటూ చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. ఓటర్ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకునే ప‌నిలో భాగంగా చాలా ప‌క‌డ్బందీగా హోదాపై ఉద్య‌మ నిర్మాణం కోసం ఏకంగా అఖిల‌ప‌క్ష స‌మావేశానికి పిలుపు ఇచ్చేశారు. ఎలాగూ తాను నిర్వ‌హించే అఖిల‌ప‌క్ష స‌మావేశానికి వైసీపీ హాజ‌రు కాద‌ని - దీనిని త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌చ్చ‌ని కూడా బాబు యోచించారు. అయితే బాబు ప్లానంతా రివ‌ర్సైపోయింది. ఈ భేటీకి వైసీపీతో పాటు ఏ ఒక్క రాజ‌కీయ పార్టీ కూడా రాలేదు క‌దా. తిరిగి టీడీపీపైనే పంచ్‌లు సంధించాయి. ప్ర‌త్యేక హోదా వ‌ద్దని చెప్పిన నోటితోనే ఇప్పుడు ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంపై చ‌ర్చిద్దాం ర‌మ్మంటే... తామేమీ వెర్రి వాళ్లం కాద‌న్న వామ‌ప‌క్షాలు... ఈ స‌మావేశాన్ని పూర్తిగా బ‌హిష్క‌రిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించాయి. ఇంకోవైపున అస‌లు అఖిల ప‌క్ష భేటీ అంటూ.. రేపు జ‌రిగే స‌మావేశానికి రావాలంటూ ఈ రోజు ఆహ్వానాలు పంప‌డ‌మేంటీ? ఈ హ‌డావిడి ఆహ్వానాల్లోనూ హోదా పోరుపై టీడీపీకి ఏ మేర చిత్త‌శుద్ధి ఉందో తెలిసిపోయింద‌ని బాబు పాత‌మిత్రుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌... బాబు అస‌లు రంగును బ‌య‌ట‌పెట్టేశారు.

ఇక మొన్న‌టి తెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీకి వ‌చ్చేసరికి చంద్ర‌బాబుకు హ్యాండిచ్చేసి అఖిల ప‌క్ష భేటీకి దూరంగా జ‌రిగింది. ఇక బీజేపీ ఎలాగూ ఈ భేటీకి రాద‌న్న విశ్లేష‌ణ‌ల‌ను నిజం చేస్తూ ఆ పార్టీ ఈ భేటీ వైపు క‌నీసం క‌న్నెత్తి చూడ‌లేదు క‌దా... ఆ పార్టీ నేత జీవీఎల్ న‌ర‌సింహారావు ఈ భేటీపై త‌న‌దైన శైలి కామెంట్లు సంధించారు. ఇక ఏపీకి ప్ర‌త్యేక హోదా డిమాండ్ ఇప్ప‌టికీ స‌జీవంగా ఉండ‌టానికి కార‌ణం తానేన‌న్న వాద‌న‌ను బ‌లంగా వినిపించిన వైసీపీ... బాబు అఖిల‌ప‌క్ష భేటీకి దూరంగానే ఉండిపోయింది. అస‌లు ఈ భేటీ నిర్వ‌హించే హ‌క్కు చంద్ర‌బాబుకు ఉందా? అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ... బాబు మార్కు వ్య‌వ‌హారాన్ని తూర్పార‌బ‌ట్టారు. మొత్తంగా అఖిల ప‌క్ష భేటీ అంటూ చంద్ర‌బాబు పిలుపునిచ్చిన ఈ భేటీ.. చివ‌రికి ఏకాకి ప‌క్ష భేటీగా మారిపోయింద‌ని చెప్పాలి.