Begin typing your search above and press return to search.

బాబు చెబుతున్నట్లుగా ఏపీలో రూ.500 కోట్ల స్కాం జరిగిందా?

By:  Tupaki Desk   |   20 Aug 2020 4:45 AM GMT
బాబు చెబుతున్నట్లుగా ఏపీలో రూ.500 కోట్ల స్కాం జరిగిందా?
X
ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తెగ ట్రై చేస్తున్న ఏపీ విపక్ష నేత చంద్రబాబు.. తాజాగా జగన్ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి భారీ కుంభకోణం చోటు చేసుకున్నట్లుగా బాబు ఆరోపిస్తున్నారు. నివాసానికి ఏ మాత్రం అనువుకాని ప్రాంతాల్లోని భూముల్ని ఎక్కువ ధరలకు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ వ్యవహారంలో వందల కోట్ల రూపాయిల కుంభకోణం జరిగినట్లుగా చెబుతున్నారు.

పేదలకు ఇస్తామని చెబుతున్న ఇళ్ల స్థలాల్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. అలా కొనుగోలు చేసిన భూములు తాజాగా వచ్చిన వరదల్లో మునిగినట్లుగా విమర్శించారు. ఈ మేరకు సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. పేదలకు కేటాయించేందుకు ప్రభుత్వం సేకరించిన భూముల్లో చిత్తడి నేలలు.. తరి భూములు.. లోతట్టుప్రాంతాలు.. మడ అడవుల్ని చట్టవిరుద్ధంగా సేకరించినట్లుగా ఆరోపిస్తున్నారు.

ఇళ్ల నిర్మాణానికి ఏ మాత్రం అనువు కాని చోట ఎక్కువ ధరలకు భూముల్ని కొనుగోలు చేసి.. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన ఆరోపణలకు నిదర్శనంగా తూర్పుగోదావరి జిల్లాలో సేకరించిన భూముల్ని ఉదాహరణలుగా చూపిస్తున్నారు.

ఆ జిల్లాలోని కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలకు 600 ఎకరాల్ని ప్రభుత్వం సమీకరించిందని.. అవన్నీ చిత్తడి నేతలుగా చెబుతున్నారు. ఇలాంటి భూముల్ని ఎకరా రూ.45 లక్షల చొప్పున రూ.270 కోట్లను ఖర్చు చేసినట్ులగా చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో మట్టి పోసి మళ్లీ ఎత్తుకు పెంచి.. ఇళ్లను నిర్మించుకోవటానికి అనువుగా తయారు చేసుకోవాలంటే మరో రూ.250 కోట్లు అవుసరమవుతాయని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం సేకరించిన భూముల్లో చాలావరకు గోదావరిలో మునిగిపోయినట్లుగా ఆరోపించిన బాబు ఆరోపణలపై సీఎం జగన్ స్పందించి సమాధానం చెబితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.