Begin typing your search above and press return to search.

లాజిక్ మిస్ అయి ర‌చ్చ చేసుకున్న బాబు బ్యాచ్‌?

By:  Tupaki Desk   |   8 Aug 2017 5:14 AM GMT
లాజిక్ మిస్ అయి ర‌చ్చ చేసుకున్న బాబు బ్యాచ్‌?
X
కొన్ని విష‌యాల్ని కెల‌కకూడ‌దు. ఒక‌వేళ కెల‌కాల్సి వ‌స్తే.. వైరిప‌క్షం దిమ్మ తిరిగిపోవాలి. కానీ.. ఆ పాయింట్‌ను మిస్ అయి అభాసు పాల‌య్యారు బాబు బ్యాచ్‌. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన నంద్యాల ఉప ఎన్నిక‌ల విష‌యంలో ఏదో ఒక‌టి చేసి విజ‌యం సాధించాల‌న్న‌దే బాబు బ్యాచ్ ల‌క్ష్యంగా మారింది. అందుకే.. ప్ర‌తి చిన్న విష‌యాన్ని ఏదోలా తెర మీద‌కు తీసుకొచ్చి.. విప‌క్షం మీద బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఆ ప్ర‌య‌త్నంలో త‌మ తీరు ప్ర‌జ‌ల్లో వెగ‌ట పుట్టిస్తుంద‌న్న విష‌యాన్ని వారు మ‌ర్చిపోతున్నారు. తాజాగా తెర‌పైకి వ‌చ్చిన జ‌గ‌న్ పార్టీ అభ్య‌ర్థి శిల్పా నామినేష‌న్ అన‌ర్హ‌త వ్య‌వ‌హారం కూడా ఇదే కోవ‌కు చెందుతుంద‌ని చెప్పాలి. సోమ‌వారం మ‌ధ్యాహ్నం మూడున్న‌ర‌.. నాలుగు గంట‌ల వేళ‌లో టీవీల్లో వ‌రుస బ్రేకింగ్ న్యూస్ లు మొద‌ల‌య్యాయి. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న శిల్పా మోహ‌న్ రెడ్డి నామినేష‌న్ లో లోపాలు ఉన్నాయ‌ని.. ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వీల్లేద‌ని.. ఆయ‌న నామినేష‌న్ ను తిర‌స్క‌రించాల‌ని కోరుతూ అధికార‌ప‌క్షం ఆరోపించ‌టం ఒక్క‌సారి ఉలిక్కిప‌డేలా చేసింది.

రాఖీ పండ‌గ జోష్ లో ఉన్న వారంతా.. ఉన్న‌ట్లుండి ఏమైందంటూ ఆరాలు తీయ‌టం మొద‌లు పెట్టారు. నిజానికి శిల్పా మోహ‌న్ రెడ్డి నిన్న కాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వ్య‌క్తి ఏం కాదు. గ‌తంలో ఎమ్మెల్యేగా.. మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. అలాంటి వ్య‌క్తి నామినేష‌న్ ప‌త్రాలు ఎలా దాఖ‌లు చేయాలో తెలీనంత అమాయ‌కంగా ఉంటార‌నుకోవ‌ట‌మే పెద్ద త‌ప్పు.

ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తెలుగుదేశం పార్టీ నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌టం.. అంత మాత్రానికే శిల్పా నామినేష‌న్ ను తిర‌స్క‌రించేస్తుంద‌న్న‌ట్లుగా హ‌డావుడి చేయ‌టం మొద‌లైంది. అయితే.. టీ క‌ప్పులో తుఫాను మాదిరి టీడీపీ నేత‌లు చేసిన ఫిర్యాదులో ప‌స లేద‌ని తేలిపోయింది. ఒకరిపై ఫిర్యాదు చేసే వేళ‌లో.. వారు త‌ప్పు చేశార‌న్న మాట‌ను ఎత్తి చూపే ముందు.. తాము చేస్తున్న వాద‌న‌లో ప‌స ఉందా? లేదా? అన్న పాయింట్ ను మిస్ కాకూడ‌దు.

దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన ఏపీ అధికార‌పక్షం.. అన‌వ‌స‌ర గంద‌ర‌గోళానికి దారి తీసేలా ప్ర‌య‌త్నం చేయ‌టం. ఇంత‌కూ టీడీపీ నేత‌లు చేసిన ఫిర్యాదు ఏమిటి? వారు మిస్ అయిన పాయింట్ ఏమిట‌న్న‌ది చూస్తే ఆస‌క్తిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.. ఈ చిన్న విష‌యాన్ని అధికార‌ప‌క్షానికి చెప్పే నాథుడు లేడా? అన్న సందేహం రాక మాన‌దు.

శిల్పా అఫిడ‌విట్ పై సంత‌కం పెట్టిన న్యాయ‌వాదికి నోట‌రీ అనుమ‌తి లేద‌ని.. జిల్లా రిజిస్ట్రార్ నుంచి తెచ్చిన లేఖ‌ను విడుద‌ల చేయ‌టం.. అనుబంధ నామినేష‌న్ కు స‌రైన స్టాంపు పేప‌ర్లు జ‌త చేయ‌లేదంటూ.. ఎన్నిక‌ల సంఘం అధికారికి ఫిర్యాదు చేశారు. ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు కంప్లైంట్ చేసినంత‌నే.. కొన్ని మీడియా సంస్థ‌లు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. అధికార‌పక్షం ఆరోపిస్తున్న దాన్లో ప‌స ఎంత ఉంద‌న్న విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా.. ఏదో జ‌రిగిపోతుంద‌న్నట్లుగా హ‌డావుడి చేశారు. అయితే.. ఇది జ‌రిగిన కొద్ది గంట‌ల అనంత‌రం.. శిల్పా నామినేష‌న్ లో ఎలాంటి లోపాలు లేవ‌ని తేల్చారు.

ఏం లేని దానికి ఏదో దారుణం జ‌రిగిపోయిన‌ట్లుగా టీడీపీ నేత‌లు ఎందుకు హ‌డావుడి చేశార‌న్న‌ది చూస్తే.. విప‌క్షంలో ఏదో లోపం ఉంద‌న్న భ్రాంతి క‌లిగించ‌టం.. ఓట‌ర్ల‌లో గంద‌ర‌గోళం సృష్టించ‌టం లాంటివ‌న్న విమ‌ర్శ ఉంది. ఇంత‌కీ.. శిల్పా నామినేష‌న్లో ఏదో త‌ప్పు జ‌రిగింద‌న్న మాట విష‌యంలోకి లోతుగా వెళితే తెలుగు త‌మ్ముళ్ల హ‌డావుడి.. ప‌స లేని వాద‌న స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి.

2013 త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం రిజిస్ట్రేష‌న్ల శాఖ ద్వారా ఉత్త‌ర్వులు ఇచ్చి ఏ నోట‌రీ కాలాన్ని పొడిగించ‌లేదు. దీంతో కొద్దిమంది న్యాయ‌వాదులు హైకోర్టును ఆశ్ర‌యించి త‌మ నోట‌రీ కాలాన్ని పొడిగించుకున్నారు. ఇంకొంత మంది త‌మ నోట‌రీని పొడిగించాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి అప్లికేష‌న్ పెట్టుకున్నారు.

నోట‌రీ చ‌ట్టం ప్ర‌కారం ఒక నోట‌రీ కాల ప‌రిమితి ముగిసిన‌ప్ప‌టికీ రెన్యువ‌ల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే స‌ద‌రు లాయర్ నోట‌రీ అమ‌ల్లోకి ఉన్న‌ట్లేన‌ని చెబుతోంది. దీని ప్ర‌కారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నోట‌రీగా సంత‌కాలు చేసిన న్యాయ‌వాది తుల‌సిరెడ్డి నోట‌రీగా కొన‌సాగుతున్న‌ట్లే.

అయితే.. నోట‌రీగా తుల‌సిరెడ్డికి ఉన్న కాల‌ప‌రిమితి ముగిసిన విష‌యాన్ని మాత్ర‌మే ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ఏపీ అధికార ప‌క్ష నేత‌లు.. చ‌ట్టాన్ని పూర్తి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఫిర్యాదు చేయ‌టం షురూ చేశారు. ఎన్నిక‌ల సంఘం రూల్ బుక్ లోని సెక్ష‌న్ 6.10 ప్ర‌కారం అభ్య‌ర్థి నామినేష‌న్ ఏ కార‌ణాల వ‌ల్ల తిర‌స్క‌రించే అంశాన్ని ప‌ట్టించుకోకుండా హ‌డావుడి చేసిన‌ తెలుగు త‌మ్ముళ్లు పుణ్య‌మా అని కాసేపు ర‌చ్చ జ‌రిగిన‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల రిటర్నింగ్ అధికారి శిల్పా నిమినేష‌న్ ను తిర‌స్క‌రించేలా త‌ప్పులు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో.. తెలుగు త‌మ్ముళ్లు ఏదో జ‌రిగిపోతుంద‌న్న‌ట్లుగా చేసిన ప్ర‌చారానికి చెక్ ప‌డింది. ప‌స లేని వాద‌న‌ను వినిపించే త‌మ్ముళ్ల తీరు మ‌రోసారి తెలుగు ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా అర్థ‌మైంది.