Begin typing your search above and press return to search.

నంద్యాల ఎన్నిక వాయిదా ప‌డేలా చేస్తున్న వైసీపీ!

By:  Tupaki Desk   |   17 Aug 2017 5:55 PM GMT
నంద్యాల ఎన్నిక వాయిదా ప‌డేలా చేస్తున్న వైసీపీ!
X
తెలుగు రాష్ర్టాల‌ చూపును త‌న‌వైపు తిప్పుకొన్న నంద్యాల ఉప ఎన్నిక విషయంలో తెలుగుదేవం పార్టీ అధినేత‌ - సీఎం చంద్రబాబునాయుడు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తిలో పార్టీ ముఖ్యనేతలు - సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్ర‌తిప‌క్ష వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. నంద్యాల ఉప‌ ఎన్నిక వాయిదా వేయించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్ర‌బాబు ఆరోపించారు. ఓటమి భయంతో వైసీపీ శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు ప్ర‌యత్నిస్తోందన్నారు.

నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో కులం - మతం ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని వైసీపీ నేత‌లు చూస్తున్నారని పార్టీ నేత‌ల‌తో చంద్ర‌బాబు అన్నారు. వైకాపా తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ విష‌జ్ఞంలో పార్టీ నేత‌లు చైత‌న్యం క‌లిగించాల‌ని కోరారు. అభివృద్ది - సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని సీఎం చంద్ర‌బాబు ధీమా వ్య‌క్తం  చేశారు. అభివృద్ది కావాలో.. అరాచక పాలన కావాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. క్షేత్ర‌స్థాయిలో శ్రేణుల‌ను సమ‌న్వ‌యం చేసేలా పార్టీ నేత‌లు ముందుకు సాగాల‌ని సీఎం చంద్ర‌బాబు కోరారు.

కాగా, మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ నంద్యాలలో ఓటమి భయంతోనే వైసీపీ వికృత చేష్టలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయించాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. గంగుల ప్రతాప్‌ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత వైసీపీ జెండా పీకేస్తుందని విమర్శించారు. వైసీపీ కుట్రలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

అయితే ఎన్నిక వాయిదా కోసం వైసీపీ ప్ర‌య‌త్నం చేస్తోంద‌నే తెలుగుదేశం పార్టీ వాద‌న స‌రికాద‌ని ప‌లువురు అంటున్నారు. నంద్యాల ఎన్నిక‌ను వైసీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. అధికార తెలుగుదేశం పార్టీ పాల‌న‌కు రెఫ‌రెండంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మ‌యిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వాయిదా ప‌డాల‌ని వైసీపీ కోరుకోద‌ని అదే స‌య‌మంలో ఎన్నిక వాయిదాప‌డితే తెలుగుదేశం పార్టీకే లాభమని  అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వ్య‌తిరేక‌త‌ను చాటిచెప్ప‌డానికి ఈ వ్య‌తిరేక‌త ఉప‌యోగ‌ప‌డుతుంది కాబ‌ట్టి వాయిదా ప‌డ‌టం వ‌ల్ల టీడీపీ ఆ గండాన్ని త‌ప్పించుకోవ‌చ్చున‌ని వాయిదా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని విశ్లేషిస్తున్నారు.