Begin typing your search above and press return to search.

పవన్ తో.. : మెత్తగా ఒకరు! కొత్తగా ఒకరు!!

By:  Tupaki Desk   |   15 Feb 2018 9:45 AM GMT
పవన్ తో.. : మెత్తగా ఒకరు! కొత్తగా ఒకరు!!
X
పవన్ కల్యాణ్ తో అంత త్వరగా సున్నం పెట్టుకోవడానికి - ఆయనతో విభేదించి కయ్యానికి దిగడానికి ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అంత త్వరగా మొగ్గు చూపించకపోవచ్చు. ఎందుకంటే పవన్ కల్యాణ్ కు యువతరంలో ఉన్న క్రేజ్ అలాంటిది. పవన్ కల్యాణ్ పోరుబాటను అనుసరించడం లేదు గానీ.. ఆయన పోరాటానికి పిలుపు ఇస్తే.. ఎలాంటి పరిణామాలు ఉంటాయో పాలకులకు తెలుసు. అయితే ముందు నిజానిజాలు తేల్చుకున్న తర్వాతే.. కార్యక్షేత్రంలోకి దిగాలని ఒక స్కెచ్ ప్రకారం వెళుతున్న పవన్ కల్యాణ్.. వివిధ అంశాలను స్టడీ చేసి - బేరీజు వేయడానికి నిధుల వివరాలను సమగ్రంగా అందించాలని అటు కేంద్రం - ఇటు రాష్ట్రాలను కోరారు. 15వ తేదీ (గురువారం)లోగా ఈ వివరాలు తనకు పంపితే.. జెఎఫ్‌ సి అద్యయనం చేస్తుందని ఆయన అన్నారు. అయితే ఆయనకు వివరాలు అంటూ అందలేదు గానీ.. ఆయన మద్దతు ఇవ్వగా - అధికారంలోకి రావడానికి ఆయన సహకారాన్ని ఇతోధికంగా వాడుకున్న రెండు పార్టీలు మాత్రం రెండు రకాలుగా స్పందించడం విశేషం.

ఎవ్వరూ ఆయన వినతిని గౌరవించలేదు గానీ.. ఒక్కొక్కరు ఒక్కోరీతిగా స్పందించారు. పవన్ మనకు మిత్రుడే అంటూ.. ఎప్పటికీ ఘాటుగా స్పందించడానికి వీల్లేదని పార్టీ శ్రేణులకు కూడా పురమాయిస్తూ చంద్రబాబునాయుడు చాలా మెత్తగా స్పందించారు. అదే సమయంలో భాజపా తరఫున కొత్తగా సుధీష్ రాంభొట్ల అనే నాయకుడు తెరమీదకు వచ్చి పవన్ కల్యాణ్ వైఖరి పై మాటలు రువ్వారు.

ఒక రకంగా చూసినప్పుడు- పవన్ కల్యాణ్ అడిగిన వివరాలు సమగ్రంగా ఇప్పటికే జేపీ వద్ద ఉన్నాయని ఉండవిల్లి అరుణ్ కుమార్ కూడా ప్రకటించారు. కాకపోతే.. ఆయన అడిగినందుకైనా ప్రభుత్వాలు స్పందించడం బాధ్యత. అయితే వారు మాత్రం పట్టించుకోలేదు.

పవన్ వెబ్ సైట్ ద్వారా అన్ని వివరాలను పరిశీలించుకోవచ్చునన్న చంద్రబాబునాయుడు.. శ్వేతపత్రం అడగాల్సింది మమ్మల్ని కాదు కేంద్రాన్ని అంటూ పవన్ కల్యాణ్ కే సలహా ఇవ్వడం విశేషం. డబ్బులు ఇచ్చే వాళ్ల దగ్గర శ్వేతపత్రం అడగాలా - ఖర్చు పెట్టేవాళ్ల దగ్గర అడగాలా అనేది ఇప్పుడు మీమాంస. అలాగే.. పవన్ ఏం అడిగినా సరే సున్నితంగానే సమాధానం ఇవ్వాలి తప్ప ఘాటుగా స్పందించవద్దని చంద్రబాబు పార్టీ వారికి సూచిస్తున్నారు. పవన్ జెఎఫ్‌ సితో మనకు మేలే అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

అయితే ఏపీ వ్యవహారాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ భాజపా నేత సుధీష్ రాంభొట్ల మాత్రం సీరియస్ గానే రెస్పాండ్ అవుతున్నారు. పవన్ కు వివరాలు కావలిస్తే సమాచార హక్కు ద్వారా అడగాలే తప్ప.. ప్రెస్ మీట్ పెడితే వివరాలు ఎలా వస్తాయని అడుగుతున్నారు. అసలు పవన్ ఫిలాసఫీ ఏంటో తనకు అర్థం కావడం లేదంటూ ఆయన సెటైర్లు వేయడం విశేషం. వాదన ఓకే గానీ.. ఏపీ వ్యవహారాల్లోకి ఈ తెలంగాణ కమలనాయకుడు ఎందుకు తలదూర్చాడనేదే అర్థం కావడం లేదు.