Begin typing your search above and press return to search.

ఏపీ మిత్రుల మధ్య మొదలైన క్రెడిట్ చిచ్చు

By:  Tupaki Desk   |   18 March 2017 6:14 AM GMT
ఏపీ మిత్రుల మధ్య మొదలైన క్రెడిట్ చిచ్చు
X
విభజన నేపథ్యంలో ఏపీకి జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదాతో భర్తీ చేయనున్నట్లుగా నాటి యూపీఏ సర్కారు పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చింది. నాటి దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదేళ్ల పాటు ప్రత్యేకహోదాను ఏపీకి ఇవ్వనున్నట్లుగా చెప్పారు. ఐదేళ్లు ఏంటి? పదేళ్లు ఇస్తామంటూ బీజేపీ నేతలు చెప్పటం... సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ స్వయంగా హామీ ఇవ్వటం చరిత్ర.

వర్తమానంలోకి వస్తే.. హోదాను గాలికి వదిలేసిన మోడీ అండ్ బాబు బ్యాచ్.. కంటితుడుపు ప్యాకేజీని ప్రకటించటం తెలిసిందే. ఈ ప్యాకేజీని ప్రకటించిన ఇన్నాళ్ల తర్వాత కేంద్ర క్యాబినెట్ ఈ అంశంపై తీసుకున్న నిర్ణయం కారణంగా ప్యాకేజీకి చట్టబద్ధత లభించింది. అంతేకాదు..పోలవరం ప్రాజెక్టుకు నిధుల్ని కేటాయించేందుకు కేంద్రం తీసుకున్నచర్యలు నేపథ్యంలో.. ఏపీకి ఏంతో మేలు జరిగిపోయిందన్న క్రెడిట్ రేస్ ఏపీ మిత్రుల మధ్య మొదలైంది.

వరాలు ఇచ్చింది కేంద్రమే అయినా.. అదంతా తాను చేసిన కృషి వల్లనేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకోవటం షురూ చేశారు. ఓపక్క తాను హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను వదిలేసి.. ప్రత్యేక ప్యాకేజీ తన గొప్పతనమేనని ప్రచారం చేసుకోవటం ఎంతోకొంత నష్టం వాటిల్లేలా చేస్తుందన్న విషయాన్ని వదిలేసిన చంద్రబాబు ప్యాకేజీ గొప్పలు చెప్పుకోవటం షురూ చేశారు. ప్యాకేజీలో కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధుల్ని సమకూర్చటం తన గొప్పతనంగా బాబు చెప్పుకోవటం మొదలైంది.

అయితే.. ఈ తరహా ప్రచారాన్నిఏపీ బీజేపీ నేతలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మిత్రపక్షంగా సాధించిన విజయాల్ని ఇరువురు ఖాతాల్లో వేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన బుల్ డోజింగ్ తీరుతో.. తమకు దక్కాల్సిన మైలేజీని తమకు దక్కకుండా చేస్తున్నాడని.. ఇది తమ పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని ఏపీ కమలనాథులు వాపోతున్నారు.

ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టుకు నిదులు సాధించే విషయంలో కమలనాథుల మీద ఒత్తిడి తెచ్చింది తానేనని.. పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలాలంటే తెలంగాణ పరిధిలోని ఏడు మండలాల్ని ఏపీలో కలపాల్సి ఉందన్న విషయాన్ని మోడీ సర్కారు దృష్టికి తీసుకెళ్లటమే కాదు.. ఆ పని పూర్తి చేసిన తర్వాతే తాను ప్రమాణస్వీకారం చేస్తానన్న లింకుతో.. హుటాహుటిన రియాక్ట్ అయిన మోడీ.. ఏడు మండలాల్ని ఏపీకి విలీనం చేస్తూ.. ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ విషయాల్నిగుర్తు చేస్తున్న టీడీపీ నేతలు.. పోలవరం గురించి మొదటి నుంచి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి..పనులు పూర్తయ్యే విషయంపై తాను చేస్తున్న కృషే కీలకంగా బాబు చెబుతున్నారు. ప్రతి సోమవారం పోలవరంపనుల్ని సమీక్షించటమే కాదు.. మండే అంటే పోలవరం డే అన్నట్లుగా తయారు చేసి.. అధికారుల్ని పరుగులు తీయిస్తున్నట్లుగా బాబు గొప్పతనాన్ని కీర్తిస్తున్న టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ బీజేపీ నేతల వాదన మరోలా ఉంది.

చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా..కేంద్రం కానీ పాజిటివ్ గా రియాక్ట్ కాకుంటే పనులు పూర్తి అయ్యేవా?అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. చట్టబద్దత కల్పించిన ప్యాకేజీ..అందులోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన క్రెడిట్ మొత్తం తమదేనని.. ఆ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తున్నారు. హోదా అంశాన్ని ఏపీ ప్రజలు లైట్ తీసుకునేందుకు వీలుగా.. కేంద్రం ఓకే చేసిన ప్రత్యేక ప్యాకేజీ అంతా తమ గొప్పేనన్న విషయాన్ని భారీగా ప్రచారం చేసుకునేందుకు ఏపీ అధికారపక్షం సిద్ధమవుతోంది.

దీన్ని సమర్థంగా అడ్డుకోవాలన్నది ఏపీ బీజేపీ నేత లక్ష్యంగా మారింది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు.. ఎమ్మెల్సీ సోము వీర్రాజు అప్పుడే తన వాదనను వినిపిస్తున్నారు. ఏపీ తమ పార్టీకి ప్రత్యేకమని..ఇప్పటివరకూ తామేం చేశామన్న విషయాన్నిప్రచారం చేసుకోనున్న విషయాన్ని ఆయన సూచనప్రాయంగా సంకేతాలు ఇచ్చేశారు. ప్రత్యేక ప్యాకేజీ..పోలవరం క్రెడిట్ ను తమ ఖాతాల్లోకి వేసుకోవాలని తహతహలాడుతున్న ఏపీ టీడీపీ నేతలకు.. బీజేపీ నేత వీర్రాజు అండ్ కో తీరు ఇప్పుడు కొరకరానికొయ్యిలా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/