Begin typing your search above and press return to search.

కేంద్రం, బాబు క‌లిసినా రాజ‌ధానికి ద‌క్కింది శూన్య‌మే

By:  Tupaki Desk   |   4 July 2016 4:36 PM GMT
కేంద్రం, బాబు క‌లిసినా రాజ‌ధానికి ద‌క్కింది శూన్య‌మే
X
రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిన కేంద్రప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. విభజన చట్టం ప్రకారం రాజధానిలో నిర్మించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లో కీలకమైన వాటిని కేంద్రమే నిధులు సమకూర్చాలి. రాజధానిలో కీలకమైన సచివాలయం - అసెంబ్లీ - శాసనసమండలి - హైకోర్టు - రాజ్‌ భవన్ లాంటి భవనాల నిర్మాణానికి కేంద్రమే నిధులు సమకూర్చాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే, ఇప్పటికే కేంద్రం రూ. 1500 కోట్లు విడుదల చేసిందని మిగిలిన రూ. 1000 కోట్లను కూడా విడుదల చేస్తుందని ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుతో సమావేశమైన సందర్భంగా కేంద్ర ఆర్థిక‌ మంత్రి అరుణ్‌ జైట్లీ చల్లగా చెప్పారు.

రాజ‌ధాని నిర్మాణానికి మొత్తం నిధులు సమకూర్చాల్సిన కేంద్రప్రభుత్వం కేవలం రూ. 2500 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పటం, అందులోనూ గుంటూరు - విజయవాడలకు వివిధ రూపాల్లో ఇప్పటికే ఇచ్చిన రూ. 1500 కోట్లు కలిసి ఉందని చెప్పటాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారు. అయితే, రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల విషయంలో చంద్రబాబు కూడా ఏనాడు కేంద్రప్రభుత్వంపై ఆధారపడినట్లు కనబడలేదు. రాజధాని అంటే రాజ్‌ భవన్ - సచివాలయం - శాసనమండలి - ముఖ్యమంత్రి నివాసం - హైకోర్టు అని కేంద్రం కూడా గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. అయినా ఎప్పుడూ చంద్రబాబు ఆ విషయమై పట్టించుకోలేదు. ఎంతసేపూ ప్రపంచస్ధాయి రాజధాని - ఐకానిక్ భవనాల నిర్మాణానికి ప్రపంచ స్ధాయి ఆర్కిటెక్టుల ఎంపిక అనే చెబుతూవచ్చారు. పైగా రాజధాని నిర్మాణానికి ఒకసారి సింగపూర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెబుతారు. మరోసారి రాజధాని నిర్మాణంలో జపాన్‌ను భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా కోరుతారు. చైనాకు వెళ్ళినపుడు రాజధాని నిర్మాణంలో భాగస్ధులు అవ్వాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేస్తారు. ఇలా ఏ దేశం వెళితే ఆ దేశాన్ని - ఆ దేశంలోని ప్రముఖ సంస్ధలను రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవాల్సిందిగా కోరుతుంటారు. దాంతో అమరావతి నిర్మాణంపై అందరిలోనూ చులకనభావం ఏర్పడింది. అందులోనూ రాజధాని ఈ విధంగా ఉంటుందంటూ ఒకసారి సింగపూర్ ఆర్కిటెక్టులు ఇచ్చిన ప్లాన్లను విడుదల చేసారు. మరోసారి జపాన్ ఆర్కిటెక్ట్ అందించిన ప్లాన్లను ప్రజల ముందు ఉంచారు. చివరకు రెండు ప్లాన్లపైనా ప్రజల్లో పెద్ద ఎత్తున విమర్శలు మొదలవ్వటంతో రెండింటినీ కాదనుకున్నారు.

ప్రతీసారీ ఆర్కిటెక్టుల ఎంపికకే పెద్ద ప్రహసనం మొదలుపెట్టటం, చివరకు నెలలు గడిచిన త‌ర్వాత సదరు ప్రహసనాన్ని రద్దు చేయటం పరిపాటిగా మారిపోయింది. మాస్టర్‌ ప్లాన్ ఇవ్వటానికే రెండు దేశాల్లోని ఆర్కిటెక్టులకు ఇప్పటికే ప్రభుత్వం కోట్ల రూపాయలు చెల్లించింది. దానికితోడు రాజధాని నిర్మాణం విషయంలోనే చంద్రబాబు పెద్ద బృందంతో సింగపూర్‌కు పలుమార్లు వెళ్ళివచ్చారు. ఇక చైనా - మలేషియా - బ్రిటన్ - జపాన్ తదితర దేశాలకైతే లెక్కేలేదు. రాజధాని నిర్మాణం విషయంలో ఈ విధంగా ప్రపంచదేశాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు కేంద్రం మీద మాత్రం ఒత్తిడి తేలకపోవటం గమనార్హం. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో మౌళిక సదుపాయాల కల్పనకు గతంలో కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పలేదు. ఎందుకంటే, కేంద్రం ఇచ్చిన నిధులు ఒకందుకైతే, రాష్ట్ర ప్రభుత్వం మరోకందుకు వ్యయం చేసిందనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. దానికి ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. దాంతో కేంద్రం కూడా రాజధాని నిర్మాణానికి నిధుల మంజూరు విషయంలో పెద్దగా శ్రద్ద చూపటం మానేసింద‌ని అంటున్నారు. మొత్తంగా రాజ‌ధాని నిర్మాణంపై నీలినీడలు క‌మ్ముకున్నాయంటున్నారు.