Begin typing your search above and press return to search.

బాబు.. దేవాన్ష్ పాల బ్రాండ్ చెప్పిన బ్రాహ్మ‌ణి

By:  Tupaki Desk   |   2 Jun 2017 4:43 AM GMT
బాబు.. దేవాన్ష్ పాల బ్రాండ్ చెప్పిన బ్రాహ్మ‌ణి
X
హెరిటేజ్ వ్యాపారాన్ని చాలా సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లుగా కనిపిస్తోంది చంద్ర‌బాబు కోడ‌లు బ్రాహ్మ‌ణి. భ‌ర్త లోకేశ్ ఏపీ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి.. ఫుల్ టైం బిజీబిజీగా మారిపోయిన వేళ‌.. హెరిటేజ్ ను మ‌రోస్థాయికి తీసుకెళ్లే స‌వాలును బ్రాహ్మ‌ణి స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఆమె వేగంగా అడుగులు వేస్తున్నారు.

గ‌తంలో మీడియాకు కాస్త దూరంగా ఉండే బ్రాహ్మ‌ణి.. తాజాగా మాత్రం హెరిటేజ్ బ్రాండ్ ను ప్ర‌మోట్ చేసేందుకు య‌మా స్పీడ్‌ తో దూసుకెళుతున్నారు. రానున్న ఐదేళ్ల వ్య‌వ‌ధిలో రూ.6వేల కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధించాల‌న్న ల‌క్ష్యంతో ప‌ని చేస్తున్న బ్రాహ్మ‌ణి.. హెరిటేజ్ కు స‌రికొత్త ఇమేజ్ తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే కంపెనీ లోగోను ఛేంజ్ చేయ‌టంతో పాటు.. ప‌లు కొత్త ఉత్ప‌త్తుల్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. కంపెనీని అంత‌కంత‌కూ విస్త‌రిస్తూ.. ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాలో ఆ వివ‌రాల్ని స్వ‌యంగా వెల్ల‌డిస్తూ.. మ‌రింత ప్ర‌చారాన్ని తెచ్చే ప‌నిలో ఉన్నారు.

తాజాగా పెట్ బాటిల్స్ లో హెరిటేజ్ పానీయాల్ని విడుద‌ల చేసే కార్య‌క్ర‌మం చెన్నైలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన బ్రాహ్మ‌ణి.. ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని చెప్పుకొచ్చారు. హెరిటేజ్ పాల‌లో క‌ల్తీకి తావు లేద‌ని తేల్చిన ఆమె.. త‌మ ఉత్ప‌త్తుల నాణ్య‌త విష‌యంలో పెద్ద‌పీట వేస్తున్నామ‌న్నారు. ఎక్కువ‌కాలం పాలు నిల్వ ఉంచేందుకు ర‌సాయ‌నాలు వాడుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల్ని కొట్టిపారేసిన ఆమె.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా త‌న రెండేళ్ల కుమారుడు దేవాన్ష్ సైతం హెరిటేజ్ పాల‌నే వాడుతున్న‌ట్లు చెప్పారు. త‌మ కుటుంబం మొత్తం హెరిటేజ్ పాల‌నే వినియోగిస్తున్న‌ట్లుగా బ్రాహ్మ‌ణి పేర్కొన్నారు.

అంతేకాదు.. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్రబాబు నాయుడు.. అర‌వైళ్ల వ‌య‌సులో చేసిన సుదీర్ఘ పాద‌యాత్ర‌లోనూ హెరిటేజ్ పాలు.. హెరిటేజ్ ఉత్ప‌త్తుల్నే వినియోగించారని.. బాబు ఆరోగ్యానికి హెరిటేజ్ ఉత్ప‌త్తులు కార‌ణంగా చెప్పారు. 2700 కిలోమీట‌ర్ల చంద్ర‌బాబు పాద‌యాత్ర సంద‌ర్భంగా రోజూ హెరిటేజ్ పాలే తీసుకునేవారంటూ బ్రాహ్మ‌ణి చెప్పారు. పాల సేక‌ర‌ణ‌కు స్టెయిన్ లెస్ క్యాన్ల‌నే వాడుతున్న‌ట్లుగా చెప్పిన ఆమె.. ప‌శువుల కొనుగోలు కోసం సంస్థ అందించే రుణాల కోసం రూ.100 కోట్ల‌ను కేటాయించిన‌ట్లుగా వెల్ల‌డించారు.

మొత్తానికి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ గా నారా బ్రాహ్మ‌ణి త‌న పాత్ర‌కు నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తున్నారు. చాలామంది పారిశ్రామిక‌వేత్త‌లు ఉన్నా.. ఎవ‌రూ కూడా త‌మ ప్రొడ‌క్ట్స్‌ను త‌మ ఇంటిల్లిపాది వాడుతున్న‌ట్లుగా రికార్డెడ్ గా చెప్పింది లేదు. బ్రాహ్మ‌ణి చెప్పిన దాని ప్ర‌కారం.. బాబు ఆరోగ్యానికి.. శ‌క్తికి సీక్రెట్ హెరిటేజ్ పాల‌న్నట్లుగా చెప్పిన వైనం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/