Begin typing your search above and press return to search.

అవకాశం కేసీఆర్ ది.. ఆందోళన బాబుది..

By:  Tupaki Desk   |   9 July 2018 5:01 AM GMT
అవకాశం కేసీఆర్ ది.. ఆందోళన బాబుది..
X
ఎవరీ స్ట్రాటజీ వారిది.. ముందస్తు ఎన్నికల అంచనాలతో అన్ని రాజకీయ పార్టీల్లో ఆందోళన నెలకొంది. మోడీ వేసిన ఈ ప్లాన్ ప్రస్తుతం సంప్రదింపుల దశలో ఉంది. భారత న్యాయ కమిషన్ అధ్యక్షుడు బీఎస్ చౌహాన్ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. కొందరు ఔను అంటున్నారు.. కొందరు కాదు అంటున్నారు.. తెలుగు రాష్ట్రాల విషయంలోనూ జమిలి ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరిలో కేసీఆర్ జమిలి ఎన్నికలకు సై అంటుండగా.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం నై అంటున్నారు.ముందస్తు ఎన్నికలు వద్దే వద్దు అంటున్నారు. జమిలీతో ప్రాంతీయ పార్టీలను అస్థిరపరిచే కుట్ర అంటూ తప్పించుకుంటున్నారు. లోక్ సభకు ఓకే కానీ.. అసెంబ్లీ ఎన్నికలను కలుపవద్దంటూ జడుసుకుంటున్నారు. ఈ మేరకు లా కమిషన్ కు స్పష్టం చేశారు..

పరిస్థితులను బట్టే ముఖ్యమంత్రులు ఇప్పుడు ఎన్నికలపై అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ కు సానుకూల పవనాలు వీస్తున్నాయి. రైతుబంధు - రైతు బీమా - ఉచిత కరెంట్ - పింఛన్లు - అభివృద్ధి కార్యక్రమాలతో ఆయన ప్రజల్లోకి దూసుకెళ్లారు. దేశాన్ని ఆకర్సించిన తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలను ఆకట్టుకోలేకుండా ఉంటాయా.? ప్రజలంతా పాజిటివ్ గానే ఉన్నారు. ఈ మోకలోనే ఎన్నికలకు వెళితే విజయం తథ్యం అని ఎన్నో సర్వేల్లో తేలింది. కొంత మంది ఎమ్మెల్యేలను మారిస్తే కేసీఆర్ ఈజీగా 80-100 సీట్లు గెలుచుకోవచ్చని సర్వేలు తేల్చాయి. అందుకే అన్నీ ఆలోచించే కేసీఆర్ ముందస్తుకు సై అన్నారు..

ఇక బాబుకు మాత్రం ఒకటే ఆందోళన.. 6 నెలల అధికారాన్ని కూడా ఎందుకు కోల్పోవాలనే భయం వెంటాడుతోంది. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పటికే ఉన్న ప్రజాగ్రహం పెచ్చరిల్లి ఎక్కడ ఓడిపోతామోనన్న భయం టీడీపీని వెంటాడుతోంది. జగన్ పాదయాత్రకు వస్తున్న రెస్పాన్స్ - వైసీపీ గాలి వీస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలోనే ముందస్తుకు నై అంటున్నారు. జమిలి ఎన్నికలతో కేంద్రంలో - రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలొస్తే ఒకవేళ పొత్తుల చిత్తుల్లో టీడీపీ ఓడిపోతుందనే భయం టీడీపీని వెంటాడుతోంది. సర్వేలు - ఇతర అన్ని మార్గాల్లో సర్వే చేయించుకున్న చంద్రబాబు ముందస్తు ఎన్నికలను వద్దంటున్నారు. జమిలి ఎన్నికల వస్తే ఊపుమీదున్న జగన్ ఊపేస్తాడన్న భయం చంద్రబాబును వేధిస్తోంది. అందుకే ముందస్తు వద్దు అంటూ నో చెప్పాడు. 6 నెలల్లో ఏదైనా మ్యాజిక్ చేసి ప్రజల్లో సానుభూతి పొందేందుకు అడుగులు వేస్తున్నాడు.