Begin typing your search above and press return to search.

కేసీఆర్ లో ఎటకారం.. బాబులో భావోద్వేగం

By:  Tupaki Desk   |   25 July 2015 5:11 AM GMT
కేసీఆర్ లో ఎటకారం.. బాబులో భావోద్వేగం
X
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చంద్రుళ్ల తీరుకు అస్సలు పోలికే ఉండదు. సూర్య చంద్రుళ్ల మాదిరి ఉండే వీరిద్దరి పేర్లు మాత్రమే కలుస్తాయి తప్పించి.. మిగిలినవేమీ అస్సలు కలవవు.

ప్రసంగాల దగ్గర నుంచి.. వారి పరిపాలన విధానం వరకూ ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు విప్పితే.. ఎవరైనా సరే మంత్రముగ్ధులు కావాల్సిందే. ఆయన మాటల ధాటికి ఆయన ప్రత్యర్థులు బేజారెత్తిపోవాల్సిందే. భావోద్వేగాన్ని స్పృశించేలా మాట్లాడి ఆకట్టుకుంటారు. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయన ఏం మాట్లాడినా నిస్సారంగా ఉంటుంది.

ఎలాంటి కదలికా కనిపించదు. ఆయనేదో మాట్లాడతారని భావించటం.. ఆశగా ఎదురుచూడటం.. కదిలించలేని మాటలతో తన ప్రసంగాన్ని పూర్తి చేస్తారు. ఆయన మాటల కోసం ఎంతో ఉత్సాహంగా చూసే వారు సైతం.. నీరసించి పోయే పరిస్థితి. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు తన ప్రసంగం చేసే విధానాన్ని పెద్దగా మార్చుకున్నది లేదనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ఒక విషయంలో వీరిద్దరిలో తేడా వచ్చింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. యువరాజుగా పిలుచుకునే రాహుల్ గాంధీ మేలో తెలంగాణలో పర్యటిస్తే.. తాజాగా ఏపీలో పర్యటించారు. ఆత్మహత్యలు చేసుకున్న తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన.. తన పాదయాత్రలో రెండు అధికారపక్షాలపై కాస్తంత చురుకులు వేసిన పరిస్థితి.

అదే సమయంలో తమ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీనికి ఉద్దేశించి ఇద్దరు చంద్రుళ్లు స్పందించారు. రాహుల్ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఎంతోమంది గాంధీ వచ్చి పోతుంటారని.. వాటి గురించి పట్టించుకోలేమని.. సింఫుల్ గా తేల్చేశారు. ఆయన మాటల్లో ఎటకారంపై పలువురు విమర్శలు సంధించారు. కేసీఆర్ చేసిన విమర్శ ఏమాత్రం బాగోలేదని.. మరికాస్త బాగా స్పందించి ఉంటే బాగుంటుందన్న మాట వినిపించింది.

తాజాగా ఏపీలో రాహుల్ గాంధీ పర్యటించటం తెలిసిందే. ఆయన పర్యటనపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాస్తంత భావోద్వేగాన్ని రంగరించి వ్యాఖ్యలు చేయటం విశేషం. సమయం.. సందర్భం లేకుండా రాష్ట్ర పర్యటన చేశారన్న చంద్రబాబు.. విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన గాయం మానక ముందే.. మరోసారి అలాంటి ప్రయత్నమే చేశారంటూ వ్యాఖ్యానించారు.

రాహుల్ పర్యటనపై ఇద్దరి చంద్రుళ్ల వ్యాఖ్యలు చూసినప్పుడు.. కేసీఆర్ వ్యాఖ్యలో అధికార దర్పం కనిపిస్తే.. చంద్రబాబు మాటల్లో భావోద్వేగంతో పాటు.. రాహుల్ పర్యటనను వ్యూహాత్మకంగా తప్పు పట్టినట్లుగా ఉండటం గమనార్హం. నిజానికి ఇలాంటి భావోద్వేగాల్ని తట్టిలేపేలా వ్యాఖ్యలు చేయటంలో సిద్ధహస్తులైన కేసీఆర్.. రాహుల్ పర్యటన సందర్భంగా మాత్రం ఆకట్టుకునేలా మాట్లాడకపోవటం గమనించదగ్గ అంశంగా చెబుతున్నారు.