Begin typing your search above and press return to search.

రాజ్ భవనా...!! అదెక్కడుంది?

By:  Tupaki Desk   |   18 Sep 2015 10:50 AM GMT
రాజ్ భవనా...!! అదెక్కడుంది?
X
రాష్ట్రం విడిపోయినా రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కరే గవర్నరుగా వ్యవహరిస్తున్నారు. ఆయనే ఈఎల్ నరసింహన్.... రెండు రాష్ట్రాల గవర్నరు కావడంతో విభజన తరువాత కొద్దికాలం ఆయనకు విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. అదేసమయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాల వల్లా ఆయన అవసరం, ప్రాధాన్యం మరింత పెరిగింది. కానీ, కొద్దికాలంగా గవర్నరును ఎవరూ పట్టించుకోవడం లేదట. ఏపీ, తెలంగాణ సీఎంలైతే రాజ్ భవన్ ఛాయలకే పోవడం లేదట.

ఉమ్మడి గవర్నరు నరసింహన్ ను ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు ఇద్దరూ పట్టించుకోవడం మానేశారని టాక్. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. వాటిని పరిష్కరిస్తారన్న ఆశతో రెండు రాష్ట్రాలూ మొదట్లో గవర్నరుకు మొరపెట్టుకునేవి. ఆయన పరిష్కారం చూపకపోయినా ఇద్దరు ముఖ్యమంత్రులనో... మంత్రులనో, అధికారులనో కూర్చోబెట్టి మాట్లాడేవారు. కానీ, సమస్యలు పరిష్కారమైన దాఖలాలు ఎన్నడూ లేవు. అంతేకాదు.... కర్ర విరగక పాము చావక అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని... న్యాయం చెప్పడం లేదని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం భావిస్తుండేది. ఒక్కోసారి గవర్నరు తమకు కాకుండా ఇంకో రాష్ట్రం తరఫున మాట్లాడుతున్న అభిప్రాయాన్ని ఏపీ, తెలంగాణలు ఎవరికివారు వ్యక్తించేశారు కూడా. ఏపీమంత్రులైతే గవర్నరును దుమ్మెత్తి పోశారు. చివరకు ఆయన కేంద్రానికి మొరపెట్టుకోవడం... చంద్రబాబు జోక్యం చేసుకుని తన మంత్రులను వారించడం వరకు వెళ్లిందది. దీంతో గవర్నరు కూడా ఈ నెత్తి నొప్పులన్నీ తనకెందుకనుకునే పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకీ రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెరిగిపోవడంతో ఆయన కూడా జాగ్రత్తగా తప్పించుకుంటూ కేంద్రం వద్దకు వెళ్లమని సూచించిన సందర్భాలున్నాయి. దాంతో రెండు రాష్ట్రాలు కూడా ఇక గవర్నరు వల్ల అయ్యేపనికాదన్న నిర్ణయానికి వచ్చేశాయి. దీంతో ఏ సమస్య ఉన్నా కోర్టులకో, కేంద్రం వద్దకో వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలోనే గవర్నరు ఒకరు ఉన్నారన్న విషయాన్నే రెండు రాష్ట్రాల సీఎంలు - మంత్రులు - అధికారులు పూర్తిగా మర్చిపోయారట. గవర్నరు కూడా తనకు ఇలాగే బాగుంది అనుకుంటూ హాయిగా గడిపేస్తున్నారట. సీఎంలు ఇద్దరూ అసలు రాజ్ భవన్ ఎక్కడుందో మర్చిపోయారని పొలిటికల్ వర్గాల్లో టాక్... అసలు సెక్రటేరియట్లనే మర్చిపోయిన ముఖ్యమంత్రులు రాజ్ భవన్ ను ఇంకేం గుర్తుంచుకుంటారు అంటున్నారు ఇంకొందరు. మళ్లీ రిపబ్లిక్ డే వచ్చేవరకు గవర్నరుతో పనేలేదని కూడా అంటున్నారు.