Begin typing your search above and press return to search.

చంద్రుళ్లు.. చ‌మురు బాదుడు ఆప‌రేం?

By:  Tupaki Desk   |   1 Sep 2018 7:06 AM GMT
చంద్రుళ్లు.. చ‌మురు బాదుడు ఆప‌రేం?
X
దొందూ దొందే అన్న‌ట్లుగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్ల తీరు చూస్తుంటే. సంక్షేమ కార్య‌క్ర‌మాల పేరుతో వ‌రాల మీద వ‌రాలు ప్ర‌క‌టించే ఇద్ద‌రు చంద్రుళ్లు సామాన్యుల నుంచి అన్ని వ‌ర్గాల వారికి షాకులిస్తున్న చ‌మురు చ‌ర్నాకోల్ కు చెక్ చెప్పేందుకు మాత్రం ముందుకు రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత‌కంత‌కూ పెరుగుతున్న పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు స‌రికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. గ‌డిచిన మూడు నెల‌లుగా అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడిచ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గిన‌ప్పుడు దాన్ని వినియోగ‌దారుల‌కు బ‌దిలీ చేసే విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టించుకోని చ‌మురు కంపెనీలు.. ప్ర‌భుత్వాలు.. అంత‌ర్జాతీయ మార్కెట్లో ఏ మాత్రం ధ‌ర‌లు పెరిగినా.. ఇట్టే దాని భారాన్ని ప్ర‌జ‌ల మీద‌కు మ‌ళ్లించ‌టం ఒక అల‌వాటుగా మారింది.

అడిగినోళ్ల‌కు అడ‌గ‌నోళ్ల‌కు సైతం వ‌రాలు ఇచ్చేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. అప్పుల కుప్ప‌ల‌గా మారిన రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు త‌న విలాసాల‌ను త‌గ్గించుకోరు. కానీ.. ప్ర‌జ‌ల జీవితాల మీదా.. రోజువారీ కార్య‌క‌లాపాల మీదా తీవ్ర ప్ర‌భావాన్ని చూపించే పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల విష‌యం మీద మాత్రం దృష్టి పెట్ట‌టం లేద‌ని చెప్పాలి.

తాజాగా అమ‌రావ‌తిలో పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌లుస‌రికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.84.84 గా ఉంటే.. డీజిల్ ధ‌ర కాస్తా రూ.77.64కు చేరుకుంది. అమ‌రావ‌తి త‌ర్వాత ధ‌రాభారం ఎక్కువ‌గా ఉన్న న‌గ‌రంగా తెలంగాణ ఉంది. హైద‌రాబాద్‌ లో ప్ర‌స్తుతం పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌లు స‌రికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడిచ‌మురు బ్యారెల్ 77.42 డాల‌ర్లు ప‌లుకుతుంటే.. దేశీయంగా మాత్రం వీటి ధ‌ర‌లు భారీగా ఉంటున్నాయి. దీనికి కార‌ణం కేంద్ర.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెట్రోల్‌.. డీజిల్ మీద వేస్తున్న ప‌న్నుల భార‌మే ఇంత ఎక్కువ ధ‌ర‌ల‌కు కార‌ణంగా చెప్పాలి.

అవ‌స‌రం ఉన్నా లేకున్నా హామీలు గుప్పించి.. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో వేల కోట్లు ఖ‌ర్చు చేసే ప్ర‌భుత్వం.. పెట్రోల్.. డీజిల్ మీద తాము విధించిన అద‌న‌పు ప‌న్ను భారాన్ని త‌గ్గించే విష‌యంలో మాత్రం వెనుక‌డుగు వేయ‌టం క‌నిపిస్తుంది. నాలుగేళ్ల క్రితం ముడిచ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గిన‌ప్పుడు రాష్ట్రాలు త‌మ ఆదాయాన్ని పెంచుకోవ‌టానిక వీలుగా అద‌న‌పు ప‌న్నుల్ని విధించారు. ప్ర‌స్తుతం ధ‌ర‌లు పెరిగిన వేళలోనూ.. పెంచిన అద‌న‌పు ప‌న్నుల్ని వెన‌క్కి తీసుకోకుండా కొన‌సాగిస్తున్నారు. దీంతో.. ఈ భారం రోజురోజుకి పెరుగుతోంది.

అద‌న‌పు ప‌న్నుల విష‌యంలో ఏపీ ముందుంటే.. త‌ర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు ప‌క్క‌నే ఉన్న చెన్నై.. బెంగ‌ళూరుల‌తో పోలిస్తే.. హైద‌రాబాద్‌.. అమ‌రావ‌తిలోనే పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక‌.. ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ ధ‌ర‌ల‌తో పోలిస్తే స‌రాస‌రి పెట్రోల్.. డీజిల్ లీట‌రుకు ఏడు రూపాయిల కంటే ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. సంక్షేమ‌ ప‌థ‌కాల పేరుతో ప్ర‌చారాన్ని హోరెత్తించే ఇద్ద‌రు చంద్రుళ్లు.. చ‌మురు చ‌ర్నాకోలుతో సామాన్యులు.. మ‌ధ్య‌త‌ర‌గతి జీవుల ఆర్థిక ప‌రిస్థితిపై వాత‌లు ప‌డేలా చేస్తున్నారెందుకు?