Begin typing your search above and press return to search.

నేతల మేకపోతు గాంభీర్యం

By:  Tupaki Desk   |   25 Aug 2018 6:26 AM GMT
నేతల మేకపోతు గాంభీర్యం
X
గెలవాలి... నిలవాలి...ఏం చేసైనా అధికారంలోకి రావాలి.... ఎలా... కింకర్తవ్యం. ప్రజల్లో వ్యతిరేక పనవాలు. ప్రతిపక్షాల దాడులు. పొత్తులతో ఎత్తులు. ఎత్తులలో ఎదుటి వారిని చిత్తు చేయాలనే వ్యూహాలు. ఇన్ని చేస్తున్నా అధికార నాయకులకు మాత్రం గుండెల్లో గుబులు ప్రారంభమైంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తామని పైకి చెబుతున్నా... అదంతా మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్ధితి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... జాతీయ స్ధాయిలో కూడా ఉంది. తెలంగాణలో ముందస్తు సమరానికి తెలంగాణ ముఖ్యమంత్రి - తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెర తీసారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై రెండు గంటలకు పైగా సమాలోచనలు జరిపారు. ముందస్తు రావచ్చునన్న సంకేతాలూ ఇచ్చారు. పార్టీ విజయాన్ని తనకు వదిలిపెట్టాలని - క్షేత్రస్ధాయిలో పార్టీని పటిష్టం చేయాలంటూ పిలుపిచ్చారు. ఇన్ని చేసినా .... ఇంత భరోసా ఇచ్చినా ఆయనలో మాత్రం లోలోపల ఓటమి భయం వెంటాడుతోందని అంటున్నారు. ఇంతకు ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు.... ఈ సమావేశంలో మాట్లాడిన కెసీఆర్ కు మాధ్య చాలా తేడా వచ్చిందని పార్టీశ్రేణులే అంటున్నాయి. ఇంతకు ముందు సమాలోచనల్లో పార్టీ నాయకుల మాట వినే వారని - ఆయన చెప్పినట్లు చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అనే వారని - ఈసారి మాత్రం ఎవరినీ మాట్లాడనీయకుండా అన్నీ తానే చూసుకుంటానని చెప్పడం తొలిసారేనని అంటున్నారు. దీని వెనుక ఓటమి భయం ఉందని - లోలోపల భయపడుతున్న వారే తమ మీద తమకు ఎక్కువ నమ్మకం ఉన్నట్లుగా ప్రవర్తిస్తారని అంటున్నారు.

మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ లో కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది ఏ నిర్ణయాన్ని అయినా సమష్టిగా తీసుకుని అమలు చేద్దామనే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొత్తుపై మాత్రం ఒక్కరే నిర్ణయించారని - అందుకే సీనియర్ మంత్రులు - నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని అంటున్నారు. దీనికి కారణం కూడా తన పట్ల - తన నాయకత్వం పట్ల పార్టీలో వ్యతిరేకత వస్తోందన్న భావన చంద్రబాబు నాయుడిలో పెరిగిందని - ఇలాంటి సమయంలోనే ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. పైకి మాత్రం మనం గెలుస్తాం... నేను చూసుకుంటాను అనే మాటలు చెబుతున్నారని పార్టీ నాయకులే అంటున్నారు. ఇక జాతీయ స్ధాయిలో కూడా ప్రధాని నరేంద్రమోదీ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉందంటున్నారు. ఆయన కూడా పార్టీ ముఖ్యులను కలిసినప్పుడు మనం గెలుస్తాం... మీకు కంగారు పడకండి అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోనూ - జాతీయ స్థాయిలోనూ కూడా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.