Begin typing your search above and press return to search.

బాబుకు చేతకానిది.. కేసీఆర్ కు చేతనైంది ఇదే..

By:  Tupaki Desk   |   25 Dec 2016 11:30 AM GMT
బాబుకు చేతకానిది.. కేసీఆర్ కు చేతనైంది ఇదే..
X
స్నేహితుడు అంటే ఎలా ఉండాలి? అంతా బాగున్నప్పుడు నవ్వుతూ మాట్లాడటం? పార్టీలతో ఎంజాయ్ చేయటం.. కులాసాగా కబుర్లు చెప్పుకోవటం మాత్రమే కాదు.. లెక్క తేడా వచ్చినప్పుడు నేను నీకు ఉన్నానన్న భరోసాను ఇవ్వాలి. ధీమాను ఇవ్వాలి. అందరూ వేలెత్తి చూపిస్తున్నా.. మావాడు అలాంటోడు కానే కాదంటూ బలంగా మాట్లాడటమే కాదు.. వేలెత్తి చూపిస్తున్నోళ్లదే తప్పనట్లుగా వ్యవహరించాలి. అదే మిత్రధర్మం.

ఇలాంటివి ఫ్రెండ్ షిష్ లో ఎంత ముఖ్యమో.. రాజకీయ స్నేహంలోనూ ఇలాంటివి తప్పనిసరి. కష్టాలు వచ్చినప్పుడు.. సవాళ్లు ఎదురైనప్పుడు అండగా నిలబడకుండా.. అందరిమాదిరే నాలుగు మాటలు అనేస్తే.. స్నేహితుడు అవుతాడా? ఇప్పుడు ఇలాంటి డౌటే వస్తోంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చూస్తుంటే.

పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయం వెలువరించినప్పుడు.. దేశ వ్యాప్తంగా ప్రజలు సానుకూలంగా స్పందించారు. అంతే.. ఇలాంటి తెలివైన పనిని తానే చేయమని తరచూ సలహాలు ఇస్తూ ఉంటానని.. ఇలాంటి నిర్ణయం కోసమే పలు దఫాలు లేఖలు రాసినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. కానీ.. నోట్ల కష్టాలు మొదలై.. ఏటీఎంల దగ్గరా.. బ్యాంకుల దగ్గరా జనాలు పడుతున్న ఇబ్బందులతో మోడీ నిర్ణయంపై తన గొప్పల్ని తగ్గించుకొని.. మిగిలిన రాజకీయ పార్టీలంత కాకున్నా.. కొంతమేర విమర్శలు చేయటం కనిపిస్తుంది.

మిత్రుడిగా ఉన్న చంద్రబాబు నోటి నుంచి ఈ తరహా మాటల్ని జీర్ణించుకోలేని వారు చాలామందే ఉన్నారు. అసలుసిసలైన మిత్రుడి మాదిరి వ్యవహించటంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారన్న మాట ఇప్పుడు వినిపించే పరిస్థితి. నోట్ల రద్దు నిర్ణయంపై మొదట మైలేజీ కోసం ఎంతలా పాకులాడారో.. అదే తరహాలో ఇప్పటికి నిలబడి ఉంటే బాగుండేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి దీనికి పూర్తి భిన్నం. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెల్లడించిన ప్రధాని మోడీపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్.. పలువురు నిపుణులు.. ఆర్ బీఐ మాజీ గవర్నర్లతో భేటీ అయి..ఒక నివేదిక తయారు చేసి ప్రధాని మోడీని కలిశారు. ఆయన భేటీ అనంతరం నుంచి నేటి వరకూ ఎవరెన్ని మాటలు అన్నా.. నోట్ల రద్దు నిర్ణయం శభాష్ అంటూ కీర్తించటమే కాదు.. సమస్యల్ని లేవనెత్తే వారి నోరు మూయించేందుకు ఆయన కాస్తంత ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

దేశంలో అన్నిచోట్ల ఉన్నట్లే నోట్ల కష్టాలు ఉన్నాయని.. వాటిని సానుకూలంగా అర్థం చేసుకోవాలే కానీ.. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయంటూ ప్రచారం చేయటం ఏ మాత్రం బాగోలేదంటూ కేసీఆర్ తేల్చి చెబుతున్నారు. ఇక.. నోట్ల రద్దు నిర్ణయంపై ఎవరెన్ని విమర్శలు చేసినా.. కేసీఆర్ మాత్రం తన వైఖరిని మార్చుకోకపోగా.. మరింత బలంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించటం గమనార్హం. క్రెడిట్ కోసం పాకులాడిన చంద్రబాబు.. లెక్క తేడా అనిపించిన వెంటనే పక్కకు తప్పుకోవాలని ప్రయత్నిస్తే.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా ఒక్కసారి ఫిక్స్ అయితే అంతేనన్న వైనాన్ని ప్రదర్శించి.. ప్రధాని మోడీ మనసునే కాదు.. పలువురి మనసుల్ని దోచుకున్నారని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/