Begin typing your search above and press return to search.

గ్రేటర్ లో బిగ్ ఫైట్ చంద్రుళ్ల మధ్యేనా?

By:  Tupaki Desk   |   28 Jan 2016 4:22 AM GMT
గ్రేటర్ లో బిగ్ ఫైట్ చంద్రుళ్ల మధ్యేనా?
X
గ్రేటర్ ఎన్నికల ప్రచారం మొదలై.. విమర్శలు.. ప్రతి విమర్శలు - సవాళ్లు.. ప్రతి సవాళ్లు - ఆరోపణలు.. ప్రత్యారోపణలు ఎన్ని చేసుకున్నా ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకున్నట్లుగా కనిపించలేదు. దీనికి కారణం అత్యున్నత స్థాయి అధినేతల మధ్య మాటల యుద్ధం మొదలు కాకపోవటమే దీనికి కారణం. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి మొదటి నుంచి దూరంగా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. గ్రేటర్ ఎన్నికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఎన్నికల ప్రచార గోదాలోకి దిగకపోవటంతో గ్రేటర్ బిగ్ ఫైట్ సో సోగానే నడుస్తున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారన్న వార్త.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు గ్రేటర్ ప్రచారంలో పాల్గొంటారన్న సమాచారంతో వాతావరణం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో.. కేసీఆర్ మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని చేపడతారన్న సమాచారంతో అధినేతల మధ్య మాటల యుద్ధం షురూ కావటానికి ముహుర్తం డిసైడ్ అయిపోయింది.

ఆ మధ్య ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లలో.. నువ్వెంత అంటే నువ్వెంత అన్నంత వరకూ ఇద్దరు చంద్రుళ్ల మధ్య మాటలు వెళ్లటం తెలిసిందే. తర్వాత అమరావతి శంకుస్థాపన ముందు నుంచి ఇద్దరు చంద్రుళ్ల మధ్య సంబంధాలు మర్యాదపూర్వకంగా మొదలయ్యాయి. అలా మొదలైన సఖ్యత నేటి వరకూ కొనసాగుతోంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిది అధిపత్య పోరాటమైతే.. మరొకరిది ఉనికి పోరాటంగా మారటంతో గ్రేటర్ ప్రచారం మర్యాదపూర్వకంగా సాగే అవకాశం లేదు.

దీంతో.. ఇద్దరు అధినేత మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్ లో ఉంటుందన్న అంచనాలు భారీగా వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ ప్రచారంలో అసలుసిసలైన బిగ్ ఫైట్ ఇప్పుడే మొదలైందని.. మరి ఇద్దరుచంద్రుళ్లల మధ్య మాటల తూటాలు ఏ రేంజ్ లో పేలుతాయన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంట వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఇద్దరుచంద్రుళ్ల మధ్య మాటలు మంటలు పుట్టించటం ఖాయమని.. మర్యాదగా నొప్పించక.. నొవ్వనట్లుగా సాగే అవకాశమే లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. మాటల యుద్ధాన్ని ఎవరు షురూ చేస్తారన్నది ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.