Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు ఉన్నంత ధైర్యం బాబుకు లేదా?

By:  Tupaki Desk   |   23 July 2016 2:05 PM GMT
కేసీఆర్‌ కు ఉన్నంత ధైర్యం బాబుకు లేదా?
X
తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులుగా ఉన్న నారా చంద్ర‌బాబు నాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుల‌పై కొత్త చ‌ర్చ మొద‌ల‌యింది. త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ముందుండే కేసీఆర్‌ ను ధైర్య‌వంతుడిగా చూపించ‌డం - సౌమ్యుడిగా క‌నిపించే బాబు తెగువ ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నార‌నేది ఈ టాక్ సారాంశం. ఎన్నిక‌లు ఎదుర్కునేందుకు సిద్ధ‌మ‌వ‌డం అనే పాయింట్ మీద ఈ కొత్త చ‌ర్చ పొలిటిక‌ల్ స‌ర్కిల్‌ లో జోరుగా సాగుతోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అయిదు మున్సిపల్‌ కార్పొరేషన్లు - ఒక పురపాలక సంఘం - మరో నగర పంచాయతీలో ప్రత్యేకాధికారుల పాలనను చంద్ర‌బాబు ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. గత నెలాఖరుతో కాకినాడ - గుంటూరు - తిరుపతి - కర్నూలు - ఒంగోలు కార్పొరేషన్లు - కందుకూరు మున్సిపాల్టీ - రాజంపేట నగర పంచాయతీల్లో పత్యేకాధికారుల పాలన ముగిసింది. జులై ఒకటో తేదీ నుంచి డిసెంబర్‌ 31 వరకు వాటికి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగిస్తూ మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్‌ కరికాల వలవెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేకాధికారులు డిసెంబర్‌ 31వ తేదీ వరకు లేదా, కొత్త పాలకవర్గాలు వచ్చేంత వరకు కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్త‌ర్వుల ఆధారంగా ఎన్నిక‌లు జ‌రిగే ప్ర‌క్రియ‌కు బాబు వెన్నుచూపార‌నేది ఇపుడు జ‌రుగుతున్న టాక్‌.

స‌హ‌జంగా అధికార ప‌క్షం అంటే ఏ ఎన్నిక‌లనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి. ప్ర‌తిప‌క్షాల కంటే ఒకింత దూకుడు ప్ర‌ద‌ర్శించాలి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇదే రీతిలో ముందుకు సాగుతున్నారు. మెద‌క్ పార్లమెంటు - వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు స‌హా పాలేరు - నారాయ‌ణ‌పేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో కేసీఆర్ ఇదే రీతిలో దూకుడుగా పోయారు. ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ ను గెలిపించి టీఆర్ ఎస్ స‌త్తాను చాటారు. త‌ద్వారా శ్రేణుల్లో ధైర్యం నింప‌డ‌మే కాకుండా ప్ర‌తిప‌క్షాల‌ను మాన‌సికంగా బ‌ల‌హీన‌ప‌డేలా చేశారు. కానీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో బాబు ఆ తెగువ చూపించ‌లేక‌పోతున్నార‌ని అంటున్నారు. అధికారంలో ఉండి, ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌ని చెప్పుకొంటూ కూడా ప్ర‌త్యేక అధికారుల పాల‌న కొన‌సాగించ‌డం అంటే ఎన్నిక‌ల‌కు వెన్నుచూప‌డ‌మేన‌నే టాక్ న‌డుస్తోంది.