Begin typing your search above and press return to search.

ఢిల్లీలో ఢీ:రావు గారు వర్సెస్ నాయుడు గారు

By:  Tupaki Desk   |   21 Sep 2016 5:30 AM GMT
ఢిల్లీలో ఢీ:రావు గారు వర్సెస్ నాయుడు గారు
X
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల జ‌గ‌డాల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌నున‌న్న అపెక్స్ కౌన్సిల్ భేటీ నేడు జ‌ర‌గ‌నుంది. ఏపీ - తెలంగాణ ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబునాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావులు స్వ‌యంగా హాజ‌ర‌వుతున్న ఈ స‌మావేశం నేటి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు నేటి ఉద‌యం విజ‌య‌వాడ నుంచి చంద్ర‌బాబు - హైద‌రాబాదు నుంచి కేసీఆర్ బ‌య‌లుదేర‌నున్నారు. అత్యంత కీల‌కంగా భావిస్తున్న ఈ భేటీలో త‌మ త‌మ వాద‌న‌ల‌ను కాస్తంత గ‌ట్టిగానే వినిపించేందుకు ఇద్ద‌రు సీఎంలు ఇప్ప‌టికే పూర్తి స్థాయి క‌స‌ర‌త్తు చేశారు. జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు - ఆ మంత్రిత్వ శాఖ కీల‌క అధికారులతో చంద్ర‌బాబు సుదీర్ఘ మంత‌నాలు సాగించి త‌మ వాద‌న‌కు అనుగుణంగా స‌మ‌గ్ర నివేదిక సిద్ధం చేసుకున్నారు. జ‌ల‌వ‌న‌రుల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి శ‌శిభూష‌ణ్ కుమార్ ఈ నివేదిక రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క భూమిక పోషించారు. దేవినేని - శ‌శిభూష‌ణ్ ల‌తో పాటు ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి ఎస్పీ ట‌క్క‌ర్ ను కూడా వెంట‌బెట్టుకుని చంద్ర‌బాబు ఢిల్లీ ప‌య‌న‌మ‌వుతున్నారు.

ఇక తెలంగాణ స‌ర్కారు కూడా అపెక్స్ కౌన్సిల్ భేటీలో త‌మ వాద‌న‌ను మ‌రింత గ‌ట్టిగా వినిపించేందుకు స‌న్న‌ద్ధ‌మైంది. ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుతో పాటు ఆ శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి జోషి - ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్ శ‌ర్మ‌ - సాగు నీటి రంగ నిపుణులతో కేసీఆర్ విడ‌త‌ల వారీగా చ‌ర్చ‌లు నిర్వ‌హించారు. ప్ర‌ధానంగా పోతిరెడ్డిపాడు రెగ్యులేట‌ర్ నుంచి ఏపీ నీటి చౌర్యానికి పాల్పుడుతోంద‌న్న కోణంలో వాద‌న‌లు వినిపించేందుకు తెలంగాణ స‌ర్కారు స‌న్న‌ద్ధ‌మైంది. అంతేకాకుండా పాల‌మూరు జిల్లాలో నిర్మించ‌నున్న పాల‌మూరు-రంగారెడ్డి - డిండి ప్రాజెక్టులు కొత్త‌వేమీ కావ‌ని - ఉమ్మ‌డి రాష్ట్రంలోనే వాటికి అనుమ‌తులు వ‌చ్చాయ‌ని వాదించ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఏపీ ప‌రిధిలోని ప‌ట్టిసీమ ప్రాజెక్టుపైనా అభ్యంత‌రాలు తెలిపేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. తెలంగాణ వాద‌న‌లో హ‌రీశ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే... మిగులు జ‌లాల‌ను ఆధారం చేసుకుని నిర్మంచుకున్న పోతిరెడ్డిపాడు - ప‌ట్టిసీమ ప్రాజెక్టుల విష‌యంలో తెలంగాణ‌కు అభ్యంత‌రాలెందుక‌ని ప్ర‌శ్నించేందుకు చంద్ర‌బాబు భారీ క‌స‌ర‌త్తే చేశారు. ఎగువ ప్రాంతంలో పాల‌మూరు - డిండి ప్రాజెక్టులు క‌డితే... రాయ‌ల‌సీమ ఎడారిగా మారే ప్ర‌మాదం ఉందన్న విషయాన్ని ఆయ‌న గ‌ట్టిగా వాదించ‌నున్నారు. ఉమ్మ‌డి ఏపీలో పాల‌మూరు - డిండి ప్రాజెక్టుల‌కు అనుమ‌తులే రాలేద‌న్న విష‌యాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించ‌నున్నారు. తెలంగాణ‌కు ఎగువ‌న ఉన్న మ‌హారాష్ట్ర‌ - క‌ర్ణాట‌క‌లు చేస్తున్న జ‌ల చౌర్యాన్ని వ‌దిలేసి... దిగువ‌న ఉన్న త‌మ‌పై తెలంగాణ విరుచుకుప‌డ‌టం ఏమీ బాగాలేద‌ని కూడా చంద్ర‌బాబు కాస్తంత కటువుగానే వాద‌న‌లు వినిపించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఇరు రాష్ట్రాలు త‌మ త‌మ వాద‌న‌ల‌కే క‌ట్టుబ‌డి ఉన్న నేప‌థ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ వాడీవేడీ గానే జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.