Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు చంద్రుళ్లు రెండో వ‌రుస‌లోనే..

By:  Tupaki Desk   |   23 Jun 2017 8:46 AM GMT
ఇద్ద‌రు చంద్రుళ్లు రెండో వ‌రుస‌లోనే..
X
రాష్ట్రప‌తి ఎన్నిక‌కు సంబంధించి కీల‌క‌మైన నామినేష‌న్ కార్య‌క్ర‌మం పూర్తి అయ్యింది. రాష్ట్రప‌తి ప‌ద‌వికి ఎన్డీయే అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్న రామ్ నాథ్ కోవింద్ నామినేష‌న్ కార్య‌క్ర‌మం ఆస‌క్తిక‌రంగా సాగింది. ప్ర‌ధాని మోడీతో పాటు.. బీజేపీ ప‌రివారం మొత్తం నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైంది. ఎన్డీయే ప‌క్షానికి చెందిన అధినేత‌ల‌తో పాటు.. బీజేపీ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. మిత్ర‌ప‌క్షాల‌కు చెందిన అధినేత‌లు నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

మొత్తం నాలుగు సెట్ల నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయ‌గా.. ఇందులో మొద‌టి సెట్ మీద ప్ర‌ధాని మోడీ సంత‌కం చేశారు. రెండో సెట్ మీద ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంత‌కం చేయ‌గా.. మూడో సెట్ మీద బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా సంత‌కం పెట్టారు. ఇక‌.. నాలుగో సెట్ మీద పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ సంత‌కం చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ నామినేష‌న్ సంద‌ర్భంగా రెండో వ‌రుస‌కే ప‌రిమిత‌మ‌య్యారు. నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాగా.. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి ఎదుట ఏర్పాటు చేసిన కుర్చీల‌లో మొద‌టి వ‌రుస‌లో ప్ర‌ధాని మోడీ.. బీజేపీ భీష్మాచార్యుడు అద్వానీ.. సీనియ‌ర్ నేత ముర‌ళీ మనోహ‌ర్ జోషి..బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. కేంద్ర‌మంత్రి సుష్మా స్వ‌రాజ్‌.. పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి బాద‌ల్‌.. తంబి దురైలు కూర్చోగా.. రెండో వ‌రుస‌లో తెలుగు రాష్ట్రాల ఇద్ద‌రు చంద్రుళ్లు కూర్చున్నారు. అద్వానీ వెనుక కేసీఆర్ కూర్చోగా.. బాద‌ల్ వెనుక చంద్ర‌బాబు కూర్చున్నారు.

నామినేష‌న్ సెట్ల మీద బాబు సంత‌కం పెడుతున్నా.. కూర్చునే సీటు విష‌యంలో మాత్రం ఆయ‌న‌కు రెండో వ‌రుస‌లోనే సీటు ల‌భించ‌టం గ‌మ‌నార్హం. ఏమైనా.. రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్ల‌కు మొద‌టి వ‌రుస‌లో స్థానం ద‌క్క‌క‌పోవ‌టం చూస్తే.. ఇద్ద‌రిని ప్ర‌ధాని మోడీ ఒకేలా చూస్తున్నార‌న్న అభిప్రాయం క‌ల‌గ‌క మాన‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/