Begin typing your search above and press return to search.

కేసీఆర్ 'మొక్కు'కు చంద్ర‌బాబు 'తోడు'

By:  Tupaki Desk   |   7 Sep 2017 7:20 AM GMT
కేసీఆర్ మొక్కుకు చంద్ర‌బాబు తోడు
X
ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కంటి శ‌స్త్ర‌చికిత్స పూర్తి అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రెస్ట్ తీసుకుంటున్న ఆయ‌న రెండు.. మూడు రోజుల్లో హైద‌రాబాద్‌ కు వ‌చ్చేస్తార‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే వివిధ దేవాల‌యాల‌కు మొక్కులు చెల్లిస్తాన‌ని పేర్కొన‌టం తెలిసిందే.

ఉద్య‌మ స‌మ‌యంలో మొక్కుకున్న మొక్కుల్ని తీర్చుకునేందుకు ప్ర‌జాసొమ్మును ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడ‌ని కేసీఆర్.. విడ‌త‌ల వారీగా మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక‌.. మిగిలింది బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మకు బంగారు ముక్కుపుడ‌కను స‌మ‌ర్పించ‌ట‌మే.

నిజానికి గ‌త ఏడాది ఈ మొక్కును తీర్చుకుంటార‌ని అనుకున్నా ఆయ‌న‌కు కుద‌ర్లేదు. ఎట్ట‌కేల‌కు ఈ నెల 27న బెజ‌వాడ‌కు కుటుంబ స‌మేతంగా వెళ్లి మొక్కు చెల్లించుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం విశ్రాంతిలో ఉన్న కేసీఆర్‌.. ఈ నెలాఖ‌రులో బెజ‌వాడ‌కు వెళ్లి క‌న‌క‌దుర్గ‌మ్మ మొక్కు తీర్చుకోనున్నారు. ఈ మొక్కు తీర్చుకునే స‌మ‌యంలో ఒక ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకోనుంద‌ని చెబుతున్నారు.

బెజ‌వాడ‌కు వెళ్లే కేసీఆర్ ను ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌లుస్తార‌ని.. ఇరువురు చంద్రుళ్లు క‌లిసి దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం చేసుకుంటార‌ని స‌మాచారం. అదే జ‌రిగితే.. విభ‌జ‌న కోసం కేసీఆర్ మొక్కుకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌హ‌కారం కూడా ఉన్న‌ట్లుగా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు. విభ‌జ‌న స‌మ‌యంలో రెండు క‌ళ్ల సిద్ధాంతాన్ని చెప్పిన చంద్ర‌బాబు.. ఈరోజు ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు అయిన నేప‌థ్యంలో త‌న పాత‌ మొక్కును తీర్చుకోవ‌టం కోసం కేసీఆర్ బెజ‌వాడ‌కు వ‌స్తుంటే.. కేసీఆర్‌ కు వెంట ఉండి మ‌రీ మొక్కు తీరుస్తున్న వైనం స‌మైక్య రాష్ట్రాన్ని కోరుకున్న వారంద‌రికి ఇబ్బంది క‌లిగించ‌టం ఖాయం.