Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు..ఇంకా ఆ ఆశ‌లు చావ‌లేదా?

By:  Tupaki Desk   |   9 Jan 2018 8:33 AM GMT
ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు..ఇంకా ఆ ఆశ‌లు చావ‌లేదా?
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడ‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఇచ్చి చాలా కాల‌మే అయ్యింది. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలోనూ మిత్ర‌ప‌క్షాలుగా కొన‌సాగుతున్న బీజేపీ - టీడీపీల మ‌ధ్య స‌యోధ్య నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న త‌రుణంలో వీరిద్ద‌రి భేటీపై నీలి నీడ‌లు క‌మ్ముకున్న వైనం నిజంగానే ఆస‌క్తి రేకెత్తించేదే. ఈ క్ర‌మంలోనే 2019 ఎన్ని్క‌ల్లో ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉంటుందా? ఉండ‌దా? అన్న అనుమానాలు కూడా రేకెత్తాయి. మ‌రోవైపు రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర ఇబ్బందుల్లోకి బ‌ల‌వంతంగా నెట్టివేయ‌బ‌డ్డ ఏపీకి కేంద్రం ఎంతో సాయం చేయాల్సి ఉంది. అయితే ఆ సాయం మాట అటుంచితే... అస‌లు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీలు కూడా అమ‌ల‌య్యే దాఖ‌లా క‌నిపించ‌డం లేదు. ప్ర‌త్యేక హోదా - ప్రత్యేక రైల్వే జోన్‌ - పోల‌వ‌రానికి జాప్యం లేని నిధుల విడుద‌ల‌ - ఆర్థిక లోటు భ‌ర్తీ... ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా... కేంద్రం నుంచి బాబు స‌ర్కారుకు మొండి చెయ్యే ఎదుర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో మొన్న ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలంతా కూడ‌ బ‌లుక్కుని ప్ర‌ధానితో భేటీ అయ్యారు. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టారు. ఏపీని ఆదుకోవాల‌ని దాదాపుగా సాగిల‌ప‌డ్డారు. దీంతో అప్ప‌టిదాకా ఏపీ ప‌ట్ల క‌ఠినంగా ఉన్న‌ట్లు క‌నిపించిన మోదీ... కాస్తంత క‌రిగిపోయిన‌ట్లుగా క‌నిపించారు. త్వ‌ర‌లోనే మీ సీఎంతో భేటీ అవుతాన‌ని - ఆ భేటీలో ఏపీకి ఏమేం చేయాలో చ‌ర్చిస్తామ‌ని - ఆ దిశగానే ముందుకు సాగుతామ‌ని కూడా చెప్పార‌ట‌.

ఈ విష‌యాన్ని ప్ర‌ధాని నేరుగా కాకుండా... ప్ర‌ధాని చెప్పిన‌ట్లుగా టీడీపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వైఎస్ చౌద‌రి మీడియాకు వివ‌రించారు. ఈ మాట విన్నంత‌నే బాబు అండ్ కోలో ఆనందం క‌ట్టలు తెంచుకుంద‌నే చెప్పాలి. నేడో - రేపో ప్ర‌ధానితో భేటీ ఉంటుంద‌ని, ఆ భేటీ కోసం చంద్ర‌బాబు ఇప్ప‌టికే స‌మాయ‌త్త‌మ‌య్యార‌ని - ఢిల్లీ నుంచి పిలుపు రావ‌డ‌మే త‌రువాయి... ఏపీ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కారమైన‌ట్టేన‌ని తెలుగు త‌మ్ముళ్లు అడిగినోళ్ల‌తో పాటుగా అడ‌గ‌నోళ్ల‌కు కూడా చెప్పేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా... త్వ‌ర‌లోనే జ‌రుగుతుంద‌ని ప్ర‌చారంలో ఉన్న చంద్ర‌బాబు - మోదీల భేటీపై టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు కూడా ప్ర‌త్యేకంగా దృష్టి సారించార‌ట‌. అస‌లు ఆ భేటీ ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా? అన్న కోణంలోనూ ఆయ‌న ఆస‌క్తి అంత‌కంత‌కూ పెరిగిపోతోంద‌ట‌. అయినా మోదీ - చంద్ర‌బాబు భేటీ అయితే... ఏపీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై చ‌ర్చ‌లు జ‌రుగుతాయి త‌ప్పించి.. తెలంగాణ‌కు ఒరిగేదేముంద‌న్న‌దే ఇప్పుడు అంద‌రి మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌గా వినిపిస్తోంది. ఈ దిశ‌గా కాస్తంత లోతుగా విశ్లేషిస్తే... ఓ ఆస‌క్తికర‌మైన అంశం వెలుగు చూసింది. అదే నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంశం.

2014 ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌తిప‌క్ష‌మ‌న్న‌దే ఉండ‌కూడ‌ద‌న్న కోణంలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు తెర తీసిన కేసీఆర్‌... విప‌క్షాల టికెట్ల‌పై విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల‌ను చాలా మందినే లాగి పారేశారు. ఈ దెబ్బ‌కు తెలంగాణ‌లో టీడీపీ కుదేలు అవ‌గా... ఆ త‌ర్వాత చాలా కాలానికి చంద్ర‌బాబు కూడా కేసీఆర్ బాట‌నే అనుస‌రించారు. ఏపీలో బ‌ల‌మైన విప‌క్షంగా ఉన్న వైసీపీని బ‌ల‌హీనం చేస్తే త‌ప్పించి... వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము గెల‌వ‌లేమ‌ని భావించిన చంద్ర‌బాబు... వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో వీల‌యినంత మందిని లాగేసేందుకు తెర తీశారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు - ఇద్ద‌రు ఎమ్మెల్సీలు టీడీపీ గూటికి చేరారు. ఇప్ప‌టిదాకా బాగానే ఉన్నా... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనే పార్టీ నేత‌ల‌కు స‌రిప‌డిన‌న్ని స్థానాలు లేని కార‌ణంగా ఇటు చంద్ర‌బాబుతో పాటుగా అటు కేసీఆర్ కూడా నానా ఇబ్బందులు ప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగూ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి క‌నుక‌... ఈ ఒక్క‌సారికి అవ‌కాశం రాక‌పోయినా స‌ర్దుకుపోవాల్సిందేన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని పార్టీ నేత‌ల‌కు స‌ర్దిచెప్పి ఎలాగోలా నెట్టుకువ‌చ్చారు.

ఇప్పుడు ఇత‌ర పార్టీల‌కు చెందిన సిట్టింగ్‌ ల‌ను చేర్చుకున్నారు. సో... పాత కాపుల‌ను మ‌రోమారు ప‌క్క‌న‌పెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఇద్ద‌రు చంద్రుళ్ల‌ది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనే సీట్లు స‌రిపోక నానా పాట్లు ప‌డితే.. ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వారికి సీట్లు కేటాయించ‌క త‌ప్ప‌దు. మ‌రి ఏం చేసేది? అందుకే ఇద్ద‌రు చంద్రుళ్లు మొన్న‌టిదాకా సీట్ల సంఖ్య పెంచుకునేందుకు చేయాల్సినదంతా చేశారు. అయితే సీట్ల సంఖ్య పెంపు కార‌ణంగా త‌మ‌కు ఒరిగేదేమీ లేద‌న్న యోచ‌న‌తో ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు మోదీ ఆస‌క్తి చూప‌లేదు. అయితే ఇప్పుడు మోదీతో జ‌ర‌గ‌బోయే భేటీలో చంద్ర‌బాబు మ‌రోమారు ఇదే అంశాన్ని ప్ర‌స్తావించ‌బోతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త చెవిన ప‌డినంత‌నే కేసీఆర్ కూడా మోదీ, బాబు భేటీపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నార‌ని తెలుస్తోంది. అంటే మొత్తానికి సీట్లు పెర‌గ‌వ‌ని ఇప్ప‌టికే తేలిపోయినా... ఇద్ద‌రు చంద్రుళ్ల‌కు మాత్రం ఆ అంశంపై ఆశ మాత్రం చావ‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?