Begin typing your search above and press return to search.

బాబు, లోకేష్ పై తమ్ముళ్లకు ఎందుకు అసంతృప్తి?

By:  Tupaki Desk   |   5 May 2016 3:44 PM GMT
బాబు, లోకేష్ పై తమ్ముళ్లకు ఎందుకు అసంతృప్తి?
X
ఆరు నెలలు.. ఏడాది.. రెండేళ్లు.. చూస్తుండగానే గడిచిపోయాయి. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడిన నాయకులకు గుర్తింపు లభిస్తుందని ఆశించారు. ఈ క్రమంలో రెండేళ్లు నిరీక్షించారు. అయినా ఆశించిన స్థాయిలో నామినేటెడ్‌ పదవుల ఊసేలేదు. ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు. దీంతో ఎన్నికల సమయంలో స్వయంగా అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి నాయకుల్లో రగులుతోంది.

ఇప్పటివరకు ఏపీలో మహిళ సహకార ఆర్ధిక సంస్థ చైర్‌ పర్సన్‌ గా పంచుమర్తి అనురాధ - ఎస్సీ సహకార ఆర్ధిక సంస్థ చైర్మన్‌ గా జూపూడి ప్రభాకరరావు - బీసీ సంక్షేమ సహకార ఆర్ధిక సంస్థ బాధ్యతలు పి.రంగనాయకులు - సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గా ఎం.లింగారెడ్డి - కాపు సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ గా చలమల శెట్టి రామానుజయ - వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ కు ఎల్‌ విఎస్‌ ఆర్‌ కె ప్రసాద్‌ - రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ గా వర్ల రామయ్యలు పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ఇవే ద‌క్కాయి. ఇందులో కొంద‌రు పార్టీ మారిన నేత‌లు సైతం ఉన్నారు. మ‌రోవైపు తెలుగుదేశం పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకొంటూ పదవులు తెచ్చుకుంటున్నారు. దీంతో తమ పరిస్థితి ఏమిటని నేతలు మల్లాగుల్లాలు పడుతున్నారు. అసలు పదవులు వస్తాయా.. రావా.. అన్న సందేహం వారిలో కలుగుతోంది.

ఈ క్ర‌మంలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పదవులు మాత్రం రాకపోవడం పట్ల పలువురు తెలుగు త‌మ్ముల్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్‌ పదవుల నియామకాలపై ప్రతిష్టంభన కొనసాగించ‌కుండా వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ప్రతిపాదనలు పంపాలని అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు సూచించినా కార్యాచరణలో మాత్రం అమలు కావడంలేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. గ‌త ఏడాది ఇదే నెల‌లో పార్టీ యువ‌నేత లోకేష్ మాట్లాడుతూ మ‌హానాడు స‌మ‌యంలోగా నామినేటెడ్ పోస్టులు భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే దాదాపు ఏడాది గ‌డుస్తున్నా నామినేటెడ్‌ పదవుల భర్తీ ఒక కొలిక్కిరాలేదు. అధినేత ప్ర‌క‌టించినా...లోకేష్ షెడ్యూల్ చెప్పినా ప‌ద‌వుల పంప‌కం జ‌ర‌గ‌క‌పోవ‌డంపై పలువురు నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప‌రిస్థితి ఉంది. ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర - జిల్లా స్థాయి కార్పొరేషన్‌ పదవులకు పోటీ నెలకొందని అందుకే వీటి నియామకం మరింత జాప్యం జరుగుతోందని తెలుగుదేశంలోని ముఖ్య నేత‌లు చెప్తున్నారు.