Begin typing your search above and press return to search.

హామీ కాదు అమ‌లు!... బాబు - మోదీ మంత్రమిదే!

By:  Tupaki Desk   |   1 Feb 2019 5:30 PM GMT
హామీ కాదు అమ‌లు!... బాబు - మోదీ మంత్రమిదే!
X
ఎన్నిక‌ల్లో గెలవాలంటే... ఏం చేయాలి? అమ‌లు సంగ‌తి దేవుడెరుగు... ముందు హామీలు ఇచ్చేయాల్సిందే. ఆ హామీలు అమ‌లు సాధ్య‌మా? కాదా? అన్న‌ది ఎంత‌మాత్రం చూసుకోవాల్సిన ప‌ని లేదు. ముందుగా హామీలిచ్చేసి... ఆ హామీలతోనే ప్ర‌జ‌ల‌తో ఓట్లేయించుకుని, తద్వారా అధికారం చేజిక్కించుకున్నాక అమ‌లు సంగ‌తి చూద్దాం అన్న‌ది మ‌న రాజ‌కీయ నేత‌ల భావ‌న‌. ఈ భావ‌న‌కు ఇప్పుడు కాలం చెల్లింది. ఇప్పుడంతా న‌యా మంత్రం. అదే ఇప్ప‌టికిప్పుడే అమ‌లు. అయితే ఇది విప‌క్షంలో పార్టీల‌కు సాధ్యం కాదు. అదే ఇప్ప‌టికే అధికారంలో ఉన్న పార్టీల‌కు అయితే చాలా ఈజీ. నిజ‌మే... ఈ త‌రహా కొత్త మంత్రానినికి తెర తీసిన ఘ‌న‌త టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకే ద‌క్కుతుంద‌ని చెప్పాలి. కొత్త రాష్ట్రం తెలంగాణ‌లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌... మ‌లి ద‌ఫా కూడా అధికారాన్ని చేప‌ట్టాల్సిందేన‌ని గ‌ట్టిగా అనుకున్నారు. ఆ క్ర‌మంలోనే రైతు బంధు ప‌థ‌కం ఆయ‌న మ‌దిలో మెదిలింది. అనుకున్న‌దే త‌డ‌వుగా ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగా ప‌థ‌కాన్ని ప్రారంభించేసిన కేసీఆర్‌.... తొలి విడ‌త నిధుల‌ను ఓ ద‌ఫా రైతుల ఖాతాల్లో వేసేసి... స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందుగా మ‌లి ద‌ఫా నిధుల‌ను జ‌మ చేసేశారు. ఇంకేముంది... విప‌క్షాల‌న్నీ ఏక‌మైనా... ప్ర‌జ‌లంతా గులాబీ గుర్తుకే మ ఓట్లు వేసేశారు. ఫ‌లితంగా రెండో ద‌ఫా కూడా కేసీఆర్ బంప‌ర్ మెజారిటీతో గెలిచేశారు.

అయితే అప్ప‌టిదాకా ఈ త‌ర‌హా కొత్త మంత్రం తెలియ‌ని నేతలంతా ఇప్పుడు ఇదే బాట ప‌డుతున్నారు. ఈ కోవ‌లో ఇప్ప‌టికే టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు చేరిపోతే... ఇప్పుడు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ కూడా చేరిపోయారు. మొత్తంగా ఎన్నిక‌ల మంత్రం హామీలివ్వడం కాద‌ని, అమ‌లు చేసి పారేయ‌డ‌మేన‌ని తేటతెల్ల‌మ‌వుతోంది. 2014 ఎన్నిక‌ల్లో వెంట్రుక వాసిలో అధికారానికి చాలా ద‌గ్గ‌ర‌గానే నిలిచిపోయిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా చాలా ప‌క‌డ్బందీ ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే... వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తామ‌న్న విష‌యాన్ని చెబుతూ... న‌వ‌రత్నాల‌ను వ‌దిలారు. వీటిని త‌న సుదీర్ఘ పాద‌యాత్ర‌లో ప‌దే ప‌దే చెబుతూ ముందుకు సాగారు. జ‌గ‌న్ యాత్ర‌ను చాలా ఆస‌క్తిగా ప‌రిశీలిస్తున్న చంద్ర‌బాబు... తిరిగి ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే... ఎలాగూ తాను అధికారంలో ఉన్నాను కాబ‌ట్టి... జ‌గ‌న్ ఇచ్చిన హామీల్లో ప్ర‌ధాన‌మైన వాటిని అమ‌లు చేస్తే స‌రిపోలా? అని భావించారు. అంతేకాకుండా తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌న‌కు త‌గిలిన దెబ్బ‌కు కార‌ణాలు కూడా విశ్లేషించుకున్న చంద్ర‌బాబు... కేసీఆర్ న‌యా మంత్రాన్ని అవ‌గ‌తం చేసుకుని హామీ ఇవ్వ‌డం కంటే కూడా అమ‌లు చేసేయ‌డ‌మే బెట‌ర‌ని భావించారు.

ఇంకేముంది... జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల్లోని రూ.2 పింఛ‌న్‌ను తీసుకున్న చంద్ర‌బాబు... ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఓ మూడు నెల‌ల ముందు అప్ప‌టిదాకా ఇస్తున్న రూ.1,000 పింఛ‌న్‌ ను ఏకంగా రూ.2,000 ల‌కు పెంచేశారు. ఈ పెంచిన పింఛ‌న్ ను ఈ నెల నుంచే అమ‌ల్లోకి తేనున్నారు. అదే విధంగా న‌వ‌ర‌త్నాల్లోని మిగిలిన హామీల‌ను కూడా అమ‌లు చేసే దిశ‌గా చంద్ర‌బాబు ప‌య‌నిస్తున్నార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇదే కోణంలో ఆలోచించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా హామీ కంటే కూడా అమ‌లును న‌మ్ముతున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నంగానే నేటి బ‌డ్జెట్ లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు వ‌రాల జ‌ల్లును ప్ర‌క‌టించారు. ఆదాయ‌ప‌న్ను ప‌రిమితి పెంపు - రైతు బంధు మాదిరి రైతుల‌కు నేరుగా పెట్టుబ‌డి త‌దిత‌ర వరాల‌ను ప్ర‌క‌టించ‌నున్న మోదీ... అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామ‌న్న దాని కంటే కూడా ఎన్నిక‌ల‌కు ముందుగానే వాటిని అమ‌లు చేసి ల‌బ్ధి పొందేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి ఈ న‌యా మంత్రం ఏ మేర‌కు వ‌ర్క‌వుట‌వుతుందో చూడాలి.