Begin typing your search above and press return to search.

రైతుబంధు ప‌థ‌కంలో ల‌బ్థిదారులు..పీకే..బాబు!

By:  Tupaki Desk   |   18 May 2018 5:02 AM GMT
రైతుబంధు ప‌థ‌కంలో ల‌బ్థిదారులు..పీకే..బాబు!
X
నారా చంద్ర‌బాబు నాయుడు.. కొణిదెల ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఇలా చెప్పుకుంటూ పోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త‌మ ప్ర‌భావం చూపించే ఎంద‌రో ప్ర‌ముఖులు ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన రైతుబంధు ప‌థ‌కంలో ల‌బ్థిదారులు అయిన‌ట్లే. తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ భూమి ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ రైతుబంధు ప‌థ‌కం కింద ప్ర‌భుత్వ సాయానికి అర్హులే.

వాళ్లు.. వీళ్లు.. అన్న తేడా లేకుండా భూమి ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి పంట సాయం కింద త‌డ‌వ‌కు రూ.4వేలు ఇస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం. రైతుబంధు ప‌థ‌కంలో భాగంగా తొలివిడ‌త‌లో ఎక‌రానికి రూ.4వేల చొప్పున ప్ర‌భుత్వ సాయాన్ని అందిస్తున్న క్ర‌మంలో.. కొంద‌రు ప్ర‌ముఖులు త‌మ‌కు అందిన ప్ర‌భుత్వ సాయాన్ని తిరిగి ప్ర‌భుత్వానికి ఇచ్చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వ్య‌వ‌సాయ భూములు ఉన్న విష‌యం తెలిసిందే.

మ‌రి.. వీరికి కూడా ప్ర‌భుత్వం నుంచి అందాల్సిన రైతుబంధు ల‌బ్థి అందే ఉంటుంది. టాలీవుడ్ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ త‌న‌కు రైతుబంధు ప‌థ‌కం కింద అందిన మొత్తాన్ని తెలంగాణ ప్ర‌భుత్వానికి తిరిగి ఇచ్చారు. మ‌రి.. తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ‌ భూములు ఉన్న టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌కు ఎంత మొత్తం రైతుబంధు ప‌థ‌కం కింద వ‌చ్చింది?. వాటిని వారేం చేశార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఏమైనా ఒక రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం.. మ‌రో రాష్ట్ర ముఖ్య‌మంత్రి ల‌బ్థిదారుగా మారిన వైనం రైతుబంధు ప‌థ‌కంతోనే సాధ్య‌మ‌వుతుందేమో?