Begin typing your search above and press return to search.

బాబు బాధ: ‘పుట్టా’లో వేలెడితే చీమకుట్టింది!

By:  Tupaki Desk   |   14 Jan 2018 8:30 AM GMT
బాబు బాధ: ‘పుట్టా’లో వేలెడితే చీమకుట్టింది!
X
వెనకటికి రాజుగారి ఏడుగురు కొడుకులు- ఏడుచేపల కథ తెలుసుకుదా.. అందులో క్లయిమాక్స్ డైలాగ్ ఏంటో గుర్తుందా? చివరగా వెళ్లి చీమను ఎంక్వయిరీ చేసినప్పుడు ‘‘నా బంగారు పుట్టలో వేలెడితే కుట్టనా’’ అందిట! కథ మొత్తం మనకు అనవసరంగానీ.. ఈ డైలాగు ఒక్కటీ చాలు!

ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు. ‘పుట్టా’ లో వేలు పెట్టినందుకు చీమ కుట్టినట్లుగా అయిపోయింది ఆయన పరిస్థితి.

టీటీడీ బోర్డు ఏర్పాటు వ్యవహారం రాను రాను పీటముడిగా మారుతోంది. చంద్రబాబు నాయుడు టీటీడీ ఛైర్మన్ పదవిని పుట్టా సుధాకర యాదవ్ చేతుల్లో పెట్టడానికి డిసైడ్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. పుట్టా అంటే.. గత బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి స్వయానా వియ్యంకుడు. ఆయనకు ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత చంద్రబాబుకు అసలు ఇబ్బందులు మొదలైనట్లుగా తెలుస్తోంది.

పుట్టా సుధాకర్ యాదవ్ మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఆయన క్రైస్తవ మత ప్రచార సభల్లో పాల్గొన్నారని, మత ప్రచారానికి సహకరించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆయన బోర్డు సభ్యుడిగా ఉండగానే అవన్నీ హోరెత్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో అన్యమత ప్రచారం విషయంలో చాలా కఠినంగా ఉంటారు. టీటీడీ ఉద్యోగుల ద్వారా తిరుమలలో అలాంటి పని జరగరాదనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తిరునామం ధరించి విధులకు వచ్చే నిబంధన లాంటివి కూడా పెట్టారు. అలాంటి టీటీడీ పరిపాలన అధికారానని, తిరుమల వేంకటేశ్వరుని మీద అధికారాల్ని అన్యమత ప్రచారాలకు సహకరించే ఒక వ్యక్తి చేతిలో పెట్టేస్తారా...? అనే సందేహంతో పలువురు చంద్రబాబునాయుడు ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్నారట.

గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాంటి తప్పు చేశారని గుర్తు చేస్తున్నారట. పుట్టా సుధాకర్ యాదవ్.. ప్రస్తుతానికి తనకేమీ క్రైస్తవ సంబంధాలు లేవన్నట్లుగా చెప్పుకుంటున్నారు గానీ.. రాబోయే ఏడాది వ్యవధిలో అలాంటి ఆరోపణలు నిజమని తేలిందంటే.. గనుక.. అప్పుడు వచ్చే ఎన్నికలపై ఇలాంటి తప్పుడు నిర్ణయం ప్రభావం తప్పకుండా ఉంటుదని కూడా కొందరు చంద్రబాబును భయపెడుతున్నారట. ఇలాంటి సంక్లిష్టత నేపథ్యంలో బోర్డు విషయంలో ఆయన తటాల్న ఒక తుది నిర్ణయానికి రాలేకపోతున్నారని సమాచారం.

దానికి తోడు పుట్టాకు ససేమిరా ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షం భాజపా- వారి సోదర సంస్థ ఆరెస్సెస్ కూడా డిమాండ్ చేస్తున్నాయని సమాచారం. మంత్రిత్వ శాఖే వారి చేతిలో ఉన్న నేపథ్యంలో.. వారి వాదనను కూడా ఏకపక్షంగా తోసిపుచ్చలేని పరిస్థితి.

అందుకే.. పాత బోర్డు పదవికాలం ముగిసి చాలాకాలం అయినా.. కొత్త బోర్డు జాబితాలు పలుమార్లు సిద్ధం అయినా.. ఇంకా ప్రకటన రాలేదని అంటున్నారు. ‘పుట్టా’ లో వేలుపెట్టినందుకు చంద్రబాబును చీమ బాగానే కుట్టిందని అంతా అనుకుటున్నారు.