Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు కా‘సాయం’ కావాలట!

By:  Tupaki Desk   |   31 July 2019 1:00 PM GMT
చంద్రబాబుకు కా‘సాయం’ కావాలట!
X
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకోవడంతో పాటు బీజేపీకి - నరేంద్రమోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ తో జట్టుకట్టి దేశవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు మోదీకి విరోధిగా మారడమే కాకుండా ఏపీలో అధికారాన్నీ కోల్పోయారు. అధికారం పోయిన తరువాత టీడీపీ రోజురోజుకీ మరింత బలహీనపడుతోంది. నాయకులను కాపాడుకోవడం కూడా చంద్రబాబుకు కష్టమవుతోంది. మరోవైపు జగన్ ప్రభుత్వం చంద్రబాబు - ఆయన కుమారుడు లోకేశ్‌ ల చుట్టూ కేసులు బిగించే ప్రయత్నాల్లో ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. ఇదే జరిగితే చంద్రబాబు జైలు కెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలంటే తన ముందున్న ఏకైక మార్గం సాహో నరేంద్ర మోదీ అనడం. ఇప్పుడు చంద్రబాబు అదే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాషాయ సాయం లేకుంటే జగన్‌ ను ఎదుర్కోవడం కష్టమని.. రాజకీయంగా కంటే కూడా వ్యక్తిగతంగా తాను ఇబ్బందుల్లో పడడం ఖాయమని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారట.

కేంద్రంలోని బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందనడానికి పార్లమెంటులో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రస్తుత పార్లమెంటు సెషన్సులో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు పరోక్షంగా - ప్రత్యక్షంగా టిడిపి మద్దతు పలకటంతో టీడీపీ ఉద్దేశాలు మారుతున్నాయన్న సంకేతాలు అందుతున్నాయి.

ఎన్నికల ముందు వరకు టీడీపీ అనుసరించిన పద్ధతి ప్రకారమైతే తాజాగా మోదీ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన త్రిపుల్ తలాక్ బిల్లును టీడీపీ వ్యతిరేకించాలి. కానీ త్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో జరిగిన చర్చ తర్వాత ఓటింగ్ నుండి టిడిపి గైర్హాజరయ్యింది. గైర్హాజరవ్వటం అంటే పరోక్షంగా మోడికి సహకరించినట్లే. ఇదే బిల్లును వైసీపీ వ్యతిరేకించినప్పటికీ బీజేపీని వ్యతిరేకించే టీడీపీ సహకరించడం విశేషం. అయితే.. ఇదంతా చంద్రబాబు బీజేపీలోకి పంపించిన సుజనా చౌదరి - సీఎం రమేశ్ ప్లాను ప్రకారం జరిగిందంటున్నారు. చంద్రబాబును మళ్లీ బీజేపీకి దగ్గర చేసేందుకు వారిద్దరూ గట్టిగానే ప్రయత్నిస్తున్నారని దిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది.