Begin typing your search above and press return to search.

బాబు – థాక్రే ల్లో ఎవరు స్పష్టంగా ఉన్నట్టు?

By:  Tupaki Desk   |   10 March 2018 10:55 AM GMT
బాబు – థాక్రే ల్లో ఎవరు స్పష్టంగా ఉన్నట్టు?
X

శివసేన పార్టీ ఒక రకంగా ధైర్యం ఉన్న పార్టీ అని చెప్పుకోవాలి. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి భాజపాతో కలిసి పోటీచేయబోయేది లేదని ఆ పార్టీ తెగేసి ప్రకటించింది. కటీఫ్ చెప్పడం అంటే.. అదీ! కానీ.. మంత్రుల్ని ఉపసంహరించినా, కేంద్రం మీద విరుచుకుపడుతున్నా.. కేంద్రంనుంచి ఇక మన రాష్ట్రానికి ఏమీ దక్కదు అని అర్థమైపోతున్నా.. తెలుగుదేశం అధినేత మాత్రం.. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ భాజపాతో కలిసి పోటీ చేయదు అనే మాట చెప్పలేకపోతున్నారు. ఇంతకూ ఎవరు స్పష్టంగా ఉన్నట్టు. ఎవరు పారదర్శకతతో రాజీకీయాలు నడుపుతున్నట్లు?

ఇప్పుడు సమకాలీన రాజకీయాలలో ఈ చర్చ చాలా ఎక్కువగా వినిపిస్తుంది. చంద్రబాబు అనుకూల మీడియా ఆయన గురించి భారతీయ జనతాపార్టీతో మంత్రులను ఉపసంహరించడం గురించి విపరీతమైన ప్రచారం చేస్తున్నది. మీడియాను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని చాలామంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు చంద్రబాబు అనుకూల మీడియా ఆయన తీసుకున్న నిర్ణయం గురించి విపరీతంగా ప్రచారం చేయడంలో అత్యుత్సాహంతో తలమునకలై గడుపుతూ ఉంది.

మంత్రులతో రాజీనామాలు చేయించి అందుకే చంద్రబాబు చాలా గొప్ప హీరో అని వారు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి నుంచి తెలుగుదేశం పక్కకు తప్పుకోలేదని ఇంకా ఎన్డీఏలో కొనసాగుతున్నదని ప్రజలకు కలిగే సందేహాలను ఈ మీడియా దాచిపెడుతుంది. మొట్టమొదటగా మోదీ సర్కారు దిక్కరించిన హీరో చంద్రబాబు అంటూ భజన చేయడానికి వారు మోజుపడుతున్నారు. మరయితే శివసేన పార్టీ చేసిన ఏమిటి? వారు ఇంతకంటే స్పష్టంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఒకవైపు భారతీయ జనతా పార్టీని తిడుతూనే, మరొకవైపు ఎన్డీయేలో కొనసాగుతూ వారితో పొత్తులు లేకుండా వచ్చే ఎన్నికల్లో వెలుతున్నాం అనే మాట చెప్పలేక పోతున్నారు. మరి ఎవరు స్పష్టంగా ఉన్నట్టు?

చంద్రబాబు నాయుడు వ్యవహారం మొత్తం ఒక నాటకం అని, అని ప్రజలు గుర్తించకుండా వుండేందుకు మీడియా మసిపూసి మారేడుకాయ చేస్తున్నదని ఒక వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.