Begin typing your search above and press return to search.

చిత్తూరు త‌మ్ముళ్ల‌కు బాబు ఘాటు క్లాస్‌

By:  Tupaki Desk   |   11 Aug 2016 5:04 AM GMT
చిత్తూరు త‌మ్ముళ్ల‌కు బాబు ఘాటు క్లాస్‌
X
సొంత జిల్లా చిత్తూరుకు చెందిన త‌మ్ముళ్ల‌పై ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. - జిల్లా పరిషత్‌లోని పరిణామాలపై ముఖ్యమంత్రికి కొందరు నాయకులు ఫిర్యాదు చేయబోగా.. ఆయ‌న ఫైర‌య్యారు. ''జిల్లాలో అభివృద్ధి పెద్దఎత్తున చేపట్టాం. ఇంకా చేస్తాం. ఇలాంటి సమయంలో అందర్నీ కలుపుకునివెళ్లాలి. ముఖ్యంగా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. అలాకాకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలా.? అందరూ అవసరమే. ముందు శాసనసభ్యులతో పరస్పర స్నేహపూరిత సంబంధాలు కొనసాగించండి. ఇక కలెక్టర్‌ విషయం నేను చూసుకుంటా. ఆయన గురించి నాకు తెలుసు''అంటూ బాబు స్పందించారు.

కొంతకాలంగా జిల్లా పరిషత్‌లో నెలకొన్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. రెండ్రోజుల జిల్లా పర్యటనను ముగించుకుని బయల్దేరే ముందు కుప్పంలో హెలిప్యాడ్‌ వద్ద మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు తలారి ఆదిత్య, అమర్‌నాథరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గీర్వాణీ, ఆమె భర్త చంద్రప్రకాశ్‌ సహా జిల్లా నేతలతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. కుప్పం పర్యటన బాగా సాగిందంటూ కితాబిచ్చారు. అంతలోనే.. హెలికాప్టర్‌ ఎక్కబోయే ముందు జడ్పీ ఛైర్‌పర్సన్‌ భర్త చంద్రప్రకాశ్‌ జడ్పీ తరఫున చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందజేశారు. తగు చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. కొద్దికాలంగా అభివృద్ధి పనులకు నిధుల విడుదలలో జాప్యం అవుతోందని.. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలని చెప్పారు.

దీనిపై చంద్ర‌బాబు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంతలో.. ‘నాదేమీ లేదు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని వస్తే.. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతా సజావుగా సాగుతుంది. అభివృద్ధి చేయొచ్చ’ని అక్కడే ఉన్న కలెక్టర్‌ సిద్దార్థజైన్‌ చెప్పినట్లు తెలిసింది. దీంతో ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ముందు మీరు పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకుని వెళ్లండి.. ఒక్క జడ్పీటీసీలతోనే కాదు. అందరూ కావాలి. అందరితో బాగుండాలి. పరస్పర అవగాహన, సమన్వయం, సహకారం ఉండాలి. అప్పుడే పనులవుతాయ్‌’ అంటూ చంద్రప్రకాశ్‌ను ఉద్దేశించి పేర్కొన్నట్లు తెలిసింది. ‘అధికారుల విషయం నాకు తెలుసు. జిల్లాలో ఎక్కడేం జరుగుతుందో అన్నీ గమనిస్తున్నా.. నాకు అన్నీ తెలుసు.. ఇవన్నీ వదిలేయండి.. అందర్నీ సమన్వయం చేసుకుని చక్కగా కలుపుకుని వెళ్లండి.. అభివృద్ధే ధ్యేయంగా ఎవరి పనులు వారు చేయండి’అని ముఖ్య నేతలకు హితబోధ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.