Begin typing your search above and press return to search.

సినిమా వాళ్ల‌ను కెలికి క్లాస్ పీకించుకున్నాడా?

By:  Tupaki Desk   |   22 March 2018 7:21 AM GMT
సినిమా వాళ్ల‌ను కెలికి  క్లాస్ పీకించుకున్నాడా?
X
ప్ర‌తి ఒక్క‌రికి హ‌ద్దులు ఉంటాయి. వాటిని తెలుసుకొని జాగ్ర‌త్త‌గా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. అలా కాకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా.. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడితే తిప్ప‌లు త‌ప్ప‌వు. తాజాగా.. అలాంటి అనుభ‌వ‌మే ఏపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు అవ‌గ‌త‌మై ఉంటుంది. హోదా విష‌యంలో దూసుకెళ్లాల‌ని.. మిగిలిన త‌మ్ముళ్ల కంటే తాను ఎక్కువ ఫోక‌స్ కావాల‌న్న ఆశ పెట్టుకున్నారో ఏమో కానీ.. ఎప్పుడూ లేని రీతిలో తెలుగు సినీ న‌టులపై చేసిన విమ‌ర్శ‌లు ఇప్పుడు ఆయ‌న‌కు కొత్త క‌ష్టాల్ని తెచ్చి పెట్టాయి.

టీవీ చ‌ర్చ‌ల్లో అంతో ఇంతో అర్థ‌వంతంగా త‌న అభిప్రాయాల్ని చెప్పే రాజేంద్ర‌ప్ర‌సాద్.. ఎప్పుడూ లేని రీతిలో అన‌వ‌స‌ర‌మైన అంశాన్ని ట‌చ్ చేశారు. కేవ‌లం ఉద్య‌మ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లుమాత్ర‌మే చేయాల్సిన విమ‌ర్శ‌ల్ని ఆయ‌న చేసి అంద‌రూ వేలెత్తి చూపించేలా చేయ‌ట‌మే కాదు.. పార్టీకి.. అధినేత‌కు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చి పెట్టారు. సినిమా న‌టులు హోదా ఉద్య‌మంలో పాలు పంచుకోవ‌టం లేద‌ని.. అవార్డులు రాన‌ప్పుడు నానా యాగీ చేసే వారు.. రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతుంటే ఎందుకు నోరు తెర‌వ‌టం లేద‌న్న ప్ర‌శ్న‌ను ఆయ‌న సంధించారు.

దీనిపై ఇప్ప‌టికే పోసాని రియాక్ట్ కావ‌టం.. టీడీపీని మొత్తంగా క‌డిగిపారేయ‌టం.. బాబు చేసిన త‌ప్పుల్ని ఎత్తి చూపించిన తీరు.. హోదా మీద నిజంగా మీకు కాని క‌మిట్ మెంట్ ఉంటే ఏం చేయాలో చెప్ప‌టం ద్వారా.. కొత్త స‌మ‌స్య‌ను తెచ్చి పెట్టిన ప‌రిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. విభ‌జ‌న నేప‌థ్యంలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మీద ఏపీ పాల‌కుల‌కు ప‌ట్టు పోయింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. వారిని అక్కున చేర్చుకోవాల్సిన అధికార‌ప‌క్షం.. దారుణంగా తిట్ట‌టంపై ప‌లువురు న‌టులు కినుకుతో ఉన్నారు.

ఈ విష‌యాన్ని టాలీవుడ్ పెద్దోళ్ల‌లో ఒక‌రు.. రాజ‌మండ్రిఎంపీ ముర‌ళీమోహ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. హోదాపై కేంద్రం మీద పోరాడుతున్న వేళ‌..రోజుకు క‌నీసం మూడు.. నాలుగు టెలీ కాన్ఫ‌రెన్స్ లు నిర్వ‌హిస్తున్న చంద్ర‌బాబు.. బుధ‌వారం రాత్రి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ముర‌ళీమోహ‌న్ లైన్లోకి వెళ్లి.. అధినేత‌కు ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసిన విమ‌ర్శ‌ల గురించి ఫిర్యాదు చేయ‌టంతోపాటు.. ఆయ‌న మాట‌ల‌తో పార్టీకి జ‌రిగే న‌ష్టాన్ని వివ‌రించిన‌ట్లుగా తెలుస్తోంది.

ముర‌ళీమోహ‌న్ మాట‌ల‌తో ఏకీభవించిన చంద్ర‌బాబు.. తాను రాజేంద్ర‌ప్ర‌సాద్ తో మాట్లాడ‌తాన‌ని చెప్పిన‌ట్లుగా స‌మాచారం. ముర‌ళీమోహ‌న్ ఫిర్యాదుతో పాటు.. పోసాని వ్యాఖ్య‌లు బాబుకు ఆగ్ర‌హాన్ని తెప్పించాయ‌ని తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్రకారం.. అన‌వ‌స‌ర‌మైన మాట‌లు మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏమిటంటూ రాజేంద్ర‌ప్ర‌సాద్‌ కు చంద్ర‌బాబు క్లాస్ పీకిన‌ట్లుగా తెలుస్తోంది. త‌ప్పు చేసిన‌ప్పుడు శిక్ష త‌ప్ప‌దు క‌దా. బాబుకున్న అనుచ‌ర గ‌ణంలో రాజేంద్ర‌ప్ర‌సాద్ లాంటి నేత ఎంత‌?