Begin typing your search above and press return to search.

రాక్షస మాటలు..బాబుకు జ్ఞానోదయం..

By:  Tupaki Desk   |   31 Oct 2018 10:37 AM IST
రాక్షస మాటలు..బాబుకు జ్ఞానోదయం..
X
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.? నయా బాబూ రాజకీయం అలానే ఉంది మరీ..ఏపీ ప్రతిపక్ష మీద హత్యాయత్నం జరిగితే ఖండించడం పోయి వెకిలి మాటలతో అపహాస్యం చేసిన తీరు సభ్యసమాజానికి మాయని మచ్చగా మిగిలిపోయింది. జగన్ అభిమానే హత్యాయత్నం చేశాడని.. ఎలాంటి నిర్ధారణ లేకుండా.. కనీసం నిందితుడిని విచారించకుండానే గంటలోపే ఏపీ డీజీపీ ప్రకటించడం ద్వారా తనకు చిలకజోస్యం తెలుసు అని చెప్పకనే చెప్పాడు. ఇక ఏపీ ప్రభుత్వ అధినేత చంద్రబాబు ఏకంగా ముసిముసి నవ్వులతో జగన్ ది డ్రామా అంటూ వెకిలి నవ్వులు నవ్వాడు..

ఏపీ సీఎం అలా మాట్లాడేసరికి భజన మంత్రులు ఊరుకుంటారా.? తామంతా బురద పూసుకొని ప్రతి పక్ష నాయకుడికి కూడా పూసే ప్రయత్నాలు బాగానే చేశారు. ఎంత మాట్లాడితే అధినేత వద్ద అంత పరపతి సంపాదించవచ్చని కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతూ జగన్ పై ఆడిపోసుకున్నారు. నీచ నికృష్ట మాటలు మాట్లాడేశారు. ఇక టీడీపీ నామినేటెడ్ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అయితే మరీ దిగజారుడు మాటలు మాట్లాడి క్రెడిట్ కొట్టేద్దామని చూశాడు. కానీ అవిప్పుడు బూమరాంగ్ అయ్యాయి.

రాజేంద్రప్రసాద్ మాటలు ఎంత గలీజుగా ఉన్నాయంటే అవి అధినేత చంద్రబాబుకే ఆగ్రహం తెప్పించాయట.. దీంతో అంతటా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో బాబు ఈ డ్యామేజ్ ను కవర్ చేయాలని కొత్త నాటకానికి తెరదీశారు.. రాజేంద్ర ప్రసాద్ తీరును ఖండించేశాడట.. ఈ మేరకు తన అనుకూల పత్రికల్లో లీకులు ఇచ్చి బాబు గొప్ప పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాడని పెద్ద కలరింగ్ ఇచ్చేశాడు. హుందాగా ఉండాలని కోరుకున్నాడట..

అయితే ఏపీ సీఎం చంద్రబాబు జగన్ హత్యాయత్నంపై మొదట అవాకులు చెవాకులు మాట్లాడారు. అలాంటప్పుడు ఆయన అనుచరగణం ఊరుకుంటుందా? మరింత రెచ్చిపోయారు. ఇప్పుడు బట్టకాల్చి మీదేసాక.. అయ్యో పాపం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. మరీ రాక్షసుల్లా మాట్లాడుతున్న ఏపీ టీడీపీ నేతల తీరు బాబుకు ఇప్పుడు అర్థమైందా.? రాజేంద్రప్రసాద్ పై పత్రికా ముఖంగా ఆగ్రహమేనా.? లేక ఇది కూడా సానుభూతి డ్రామాలో భాగమేనా.? అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.