Begin typing your search above and press return to search.

వారు చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం!

By:  Tupaki Desk   |   19 July 2017 4:18 AM GMT
వారు చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం!
X
తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు ఈ సామెత చందంగానే ఉంది. ఒకే పని తాము చేస్తే.. అది ఒప్పు... తమకు గిట్టనివారు, తమను ఇరుకున పెట్టేవారు, తమ వైఫల్యాన్ని ఎత్తిచూపేవారు ఎవరు చేసినా.. అది తప్పు... అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. తాజాగా ముద్రగడ పద్మనాభం పిలుపు ఇచ్చిన ఛలో అమరావతి పాదయాత్ర.. ప్రభుత్వ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్న సంగతిని అందరూ గుర్తిస్తూనే ఉన్నారు. అయితే నేరుగా ముద్రగడ పేరును ప్రస్తావించకుండా.. కొందరు కులాల పేరుతో విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారంటూ.. ఏకంగా మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం, అలా కులాల పేరుతో సమాజంలో విభజన గీతలు గీసి విభేదాలు సృష్టించేవారిని ఉపేక్షించేది లేదని... హెచ్చరించడం చిత్రంగా కనిపిస్తోంది.

ఎందుకంటే.. ప్రశాంతంగా ఉన్న సామాజిక వాతావరణంలో కులాల పేరిట చిచ్చుకు బీజం వేసింది పాలకపక్షమే. కులాల వారీగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ... ఆయా కులాల పట్ల ఇతరుల్లో ద్వేషం ప్రబలేలా రెచ్చగొడుతున్నది ప్రభుత్వమే. మంజునాధ కమిషన్ జిల్లాల్లో పర్యటించినప్పుడు కులాల వారీగా ప్రజలు కొట్టుకుంటూ ఉంటే చోద్యం చూస్తూ కూర్చున్నది కూడా ఈ చంద్రబాబు ప్రభుత్వమే.

అయితే ‘‘కులాల పేరిట విభజన’’ అనే ముసుగు వేసి.. అణగారిపోతున్న ఏ వర్గమూ కూడా కనీసం కలసికట్టుగా తమ డిమాండ్లు ఏమిటో, తమ సమస్యలు ఏమిటో నివేదించుకునే అవకాశం కూడా లేకుండా చంద్రబాబు సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. కులాల ఆధ్వర్యంలో ఏ చిన్న సమావేశం, కార్యక్రమం ప్లాన్ చేసినా సరే.. ఆ వర్గం తమను తిట్టిపోస్తుందని, దానివలన రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గానికి చెందిన ప్రజల్లో తమ ప్రభుత్వం చేతగానితనం బయటపడిపోతుందని చంద్రబాబు సర్కారు జడుసుకుంటున్నట్లుగా ఉంది.

ముద్రగడ పద్మనాభం తొలినుంచి కాపుల ఉద్యమాలకు చేస్తున్న ప్రతిప్రయత్నాన్నీ ఎలా అణచివేస్తూ వచ్చారో అందరికీ తెలుసు. మొన్నటికి మొన్న మాదిగల సభను కూడా అలాగే పోలీసు పాదాల కింద అణిచేశారు. అనుమతులు అడిగితే ఇస్తాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న వీరే.. మాదిగల సభకు అడిగినా.. అనుమతి ఇవ్వలేదు. ముద్రగడ అడగలేదు గనుక.. అలా నెపం చెబుతున్నారు. చంద్రబాబునాయుడు సర్కారు తీరును గమనిస్తోంటే.. ‘‘అసలు తమ పాలనలో.. ప్రజలెవ్వరూ గొంతెత్తి మాట్లాడరాదు.. తమ బాధలివీ అని చెప్పరాదు, తమ కోర్కెలు ఇవీ అని అనరాదు.. బాబుగారు ఏం కరుణిస్తే.. అదే మహాప్రసాదం అనుకుంటూ జీవితం వెళ్లదీసేయాలంతే.. ’’ అనే నియంతృత్వ పోకడలతో చెలరేగుతున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఈ వైఖరికి వారు ఫుల్‌ స్టాప్ పెట్టకపోతే గనుక.. ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుందని జనం అనుకుంటున్నారు.