Begin typing your search above and press return to search.

బాబు పిలక జగన్ కు అప్పగించిన మంత్రులు

By:  Tupaki Desk   |   30 March 2017 11:34 AM GMT
బాబు పిలక జగన్ కు అప్పగించిన మంత్రులు
X
ఆ ఇద్ద‌రు మంత్రుల్ని ముఖ్య‌మంత్రి చాలా న‌మ్మారు. వారికి పూర్తిస్థాయి స్వేచ్చ‌ను ఇచ్చారు. టీడీపీలోని మిగతా నేతలంతా అసూయపడేలా వారిని నెత్తికెక్కించుకున్నారు. ఆ ఛాన్సును ఇద్దరూ బాగానే వినియోగించుకున్నారు.. అది వారికి సద్వినియోగం.. చంద్రబాబు లెక్క ప్రకారం దుర్వినియోగం. అందుకే ఇద్దరినీ పిలిచిన తానిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారంటూ చెడామడా తిట్టేశారట. ఆ ఇద్ద‌రు చేసిన వ్య‌వ‌హారాలు ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పులు తెచ్చేలా చేశాయ‌ని చంద్ర‌బాబు సీరియ‌స్ అవుతున్నారు. ఇద్ద‌రు మంత్రుల్లో ఒక‌రు వ్య‌వ‌సాయ శాఖామంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు కాగా, మ‌రొక‌రు పుర‌పాల‌క శాఖామంత్రి నారాయ‌ణ. ఇద్దరు రెండు వివాదాల్లో చిక్కుకుని విపక్షాలకు అవకాశమిచ్చారు. దీంతో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో వీరిని బయటకు పంపించాలని చంద్రబాబు డిసైడైనట్లుగా తెలుస్తోంది.

ప్ర‌త్తిపాటి అగ్రిగోల్డు ఆస్తుల కొనుగోళ్ల‌లో చిక్కుకుపోయి వివాదంలో ఆయ‌న ఇరుక్కుపోవ‌డ‌మే కాకుండా, ముఖ్య‌మంత్రినీ, మంత్రివ‌ర్గాన్నీ ఇరికించేశారు. అదే విధంగా మంత్రినారాయ‌ణ టెన్త్ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీలో నారాయ‌ణ విద్యాసంస్థ‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఈ అంశం కూడా ప్ర‌భుత్వాన్ని తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. ఈరెండు విష‌యాలు ప్ర‌తిప‌క్షం చేతికి మంత్రులే అందించి, అసెంబ్లీలో పెద్ద చ‌ర్చ జరిగేలా చేశారు. ఫ‌లితంగా ముఖ్య‌మంత్రి సైతం ఈరెండు అంశాల‌పై స్వ‌యంగా స్పందించాల్సి వ‌చ్చింది.

మంత్రులు డిఫెన్సులో ప‌డిపోయే స‌రికి ముఖ్య‌మంత్రి వారిని కాపాడేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌చ్చింది.కానీ అసెంబ్లీలో జ‌రిగే చ‌ర్చ‌ను రాష్ర్ట‌ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తోన్న నేప‌థ్యంలో జ‌రుగుతోన్న వ్య‌వ‌హారాల‌న్నీ వారికి తెలిసి పోతున్నాయి. అధికార ప‌క్షం ఎలా వ్య‌వ‌హరిస్తోంది, ప్ర‌తిపక్షం ఏవిధంగా న‌డుచుకుంటుంది అనేది ప్ర‌జ‌లు అంచ‌నా వేసుకోగ‌లుగుతున్నారు. ఈరెండు సంఘ‌ట‌న‌లు అధికార ప‌క్షానికి ఇబ్బందిని క‌లుగ‌జేసేవి కావ‌డంతో ముఖ్య‌మంత్రి ఇద్ద‌రు మంత్రుల‌పై సీరియ‌స్ అయ్యారు. మంత్రి నారాయ‌ణ‌ ముఖ్య‌మంత్రికి చాలా ఇష్ట‌మైన వ్య‌క్తి. పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు నారాయ‌ణ చంద్ర‌బాబుకు అండ‌గా నిలిచారు. అన్నిర‌కాల స‌హాయ‌ - స‌హ‌కారాలు అందించారు. ఆ విశ్వాసంతోనే నారాయ‌ణ‌కు మంత్రి ప‌ద‌విని ఇచ్చి గౌర‌వించారు. రాజ‌ధాని నిర్మాణం వంటి బృహ‌త్త‌ర బాధ్య‌త‌ను కూడా నారాయ‌ణ‌కే అప్ప‌గించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లో టెన్త్ ప్ర‌శ్నాపత్రాలు లీకేజీ వ్య‌వ‌హారం నారాయ‌ణ‌పై ముఖ్య‌మంత్రికి కోపం వ‌చ్చేలా చేశాయి. ప్ర‌భుత్వాన్నే ఇర‌కాటంలో పెట్టేంత‌గా ప‌రిస్థితులు మారే స‌రికి ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేయాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

ప్ర‌తిపాటి పుల్లారావు విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఎంతోముఖ్య‌మైన వ్య‌వ‌సాయ శాఖ‌ను కావాల‌నే ముఖ్య‌మంత్రి పుల్లారావుకు అప్ప‌గించారు. గ‌తంలో ఎన్నో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. పార్టీకి ఇబ్బంది క‌లిగేలా చేశాయి కూడా. కానీ అప్ప‌ట్లో ముఖ్య‌మంత్రి పుల్ల‌రావును పన్నెత్తి మాట అన‌లేదు. కానీ ఈసారి అగ్రిగోల్డు ఆస్తుల విష‌యంలో పుల్లారావుపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల వ‌ల్ల ప్ర‌భుత్వానికి మ‌చ్చ వ‌చ్చేలా చేశాయి. ముఖ్య‌మంత్రి ఈవిష‌యాన్ని మాత్రం చాలా సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఇద్దరినీ మంత్రి పదవుల నుంచి తప్పించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/