Begin typing your search above and press return to search.

బాబు గారు మహా ఆలస్యం !

By:  Tupaki Desk   |   10 Dec 2015 5:10 AM GMT
బాబు గారు మహా ఆలస్యం !
X
ఆకలితో ఉన్నప్పుడు గంజినీళ్లు ఇచ్చినా పరమాన్నంగా తాగుతారు. కానీ.. ఆకలి తీరాక పరమాన్నం ఇచ్చినా పెద్దగా పట్టించుకోరు. ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టేవాడ్ని ఎప్పటికి మర్చిపోరు. ఈ చిన్న విషయాన్ని గుర్తించటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పొరబడ్డారు. రాష్ట్రానికి పక్కనే ఉన్న చెన్నై మహానగరం భారీ వర్షాలు.. వరదల కారణంగా అతలాకుతలమైన నేపథ్యంలో.. వెను వెంటనే సాయం ప్రకటిస్తే సబబుగా ఉండేది.

అక్కడెక్కడో ఉన్న బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి సాయం ప్రకటిస్తే.. పక్కనే ఉన్న చంద్రబాబు మాత్రం పట్టనట్లుగా ఉండిపోయారు. తాజాగా.. ఏపీ సాయం రూ.10కోట్లు అంటూ ప్రకటించారు. విపత్తు విరుచుకుపడినప్పుడు పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో బాబుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. సమయానికి స్పందించటంలో బాబు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.

వరద తీవ్రత పూర్తిగా తగ్గిపోయి.. చెన్నైకి సాయం చేసేందుకు క్యూ కడుతున్న వేళ.. తీరుబడిగా రూ.10కోట్లు సాయం ప్రకటించినా పెద్ద ఫలితం ఉండదన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు గుర్తించలేదో అర్థం కాదు. సాయం చేయాలన్న ఆలోచన ఉంటే.. వెనుకా ముందు ఆలోచించకుండా.. నష్టం జరిగిన వెంటనే సాయాన్ని ప్రకటించి ఉంటే బాగుండేది. అదే జరిగి ఉంటే.. పలువురికి స్ఫూర్తిదాతగా నిలవటంతో పాటు.. ఆర్థిక కష్టంలో ఉన్నా.. అండగా నిలిచిన బాబు వైఖరిని ప్రశసంనీయంగా ఉండేది.

కానీ.. ఎక్కడెక్కడో ఉన్న వారంతా స్పందించిన తర్వాత.. తీరిగ్గా రూ.10కోట్ల సాయం ప్రకటించినందు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం బాబు అర్థం చేసుకుంటే మంచిది. ఇవ్వాలని అనుకున్నప్పుడు.. ఆలస్యం చేయకుండా భారీ నష్టం వాటిల్లిన వెంటనే ప్రకటించి ఉంటే.. ఎంతో బాగుండేది. ఒక ప్రైవేటు సంస్థ వందలాది కోట్ల రూపాయిలు సాయంగా అందిస్తున్న వేళ.. రూ.10కోట్ల మొత్తం పెద్దగా ప్రభావితం చేయదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.