Begin typing your search above and press return to search.

బాబుకు ఏమైంది.. దీనంతటికీ జగనే కారణమా?

By:  Tupaki Desk   |   31 Jan 2019 3:55 PM GMT
బాబుకు ఏమైంది.. దీనంతటికీ జగనే కారణమా?
X
ఏపీలో రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ అధికారమే లక్ష్యంగా ప్రతిపక్ష వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అందుకు అంది వచ్చే ఏ అవకాశాన్ని ఆయన వదులుకోదల్చుకోవడం లేదు. బీజేపీపై పోరాటం అంటూ బయటకు చెబుతూ తమతో కలిసి రావాలంటూ జనసేనకు బాబు పరోక్ష సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. కారణమేంటో తెలియదు గానీ జనసేన అధినేత పవన్ చంద్రబాబు ఆహ్వానం పై స్పందించలేదు. పైగా.. తన పయనం ఈసారి ఎర్రన్నలతో అని తేల్చి చెప్పారు. అయితే... రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక అంచనాకు రావడం కష్టం కనుక రాష్ట్ర ప్రయోజనాల కోసమని చెప్పి జనసేన మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే.. ప్రస్తుతం పవన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చంద్రబాబు ఇక మళ్లీ పదవి దక్కాలంటే పథకాలే దిక్కని భావిస్తున్నారు. అందుకే వరుసగా ఏపీ ఎన్నికల్లో గెలుపే థ్యేయంగా వరాల జల్లును కురిపిస్తున్నారు. నిరుద్యోగ భృతితో మొదలైన ఈ పథకాల పరంపర వృద్ధాప్య ఫించన్లు - డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పథకం కింద పది వేలు, తాజాగా నిరుద్యోగ భృతిని రెండు వేలకు పెంచడం వరకూ సాగింది. ఇంతటితో ఆగుతుందని కూడా చెప్పలేం.

చంద్రబాబు తీసుకుంటున్న ఈ నిర్ణయాలను గమనిస్తే ఓ విషయం మాత్రం స్పష్టమవుతోంది. వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత సానుకూలత వచ్చిందని - ఆ సానుకూలతను తగ్గించి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే వైఎస్ జగన్ ప్రకటించిన హామీలకు అతి దగ్గరగా ఉన్న హామీలను బాబు ప్రకటించినట్లు సమాచారం. పైగా.. పథకాల ప్రకటనలో కూడా బాబు రాజకీయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పెంచిన వృద్ధాప్య ఫించన్లను ప్రతీనెల మాదిరిగా మామూలుగా ఇవ్వరట. భోజనం పెట్టి మరీ ఇస్తారట. ఇంత హడావుడి చేయడం వెనుక కారణం లేకపోలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఫించన్లు పొందేవారంతా తమకు చంద్రబాబు భోజనం పెట్టి మరీ ఫించన్లు ఇచ్చాడనే ఓ సానుకూల అభిప్రాయానికి రావడమే దీని ఉద్దేశంగా తెలుస్తోంది. డ్వాక్రా మహిళలకు ప్రకటించిన పసుపు-కుంకుమ పథకంలో కూడా చంద్రబాబు రాజకీయం స్పష్టంగా తెలుస్తుందనే వాదనా ఉంది. ఈ పథకంలో భాగంగా ప్రకటించిన పది వేల రూపాయలను ఒకే విడతలో ఇస్తే ఎన్నికల నాటికి అంత ప్రభావం ఉండదని.. అదే మూడు విడతలుగా ఇస్తే.. మూడో విడత చెక్కు తీసుకునే సమయానికి ఎన్నికలు అతి త్వరలో జరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఆ చెక్కులు తీసుకున్న మహిళలు ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేస్తారన్న వ్యూహంలో భాగంగానే మూడు విడతల్లో చెక్కులను పంపిణీ చేయనున్నట్లు సమాచారం.

తాజాగా నిరుద్యోగ యువత ఓటు బ్యాంకే లక్ష్యంగా చంద్రబాబు నిరుద్యోగ భృతిని పెంచారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భృతి రూ.2 వేలకు పెంచాలని బాబు నిర్ణయించడం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా జగన్ చేసిన పాదయాత్ర.. తద్వారా వచ్చిన మైలేజ్ చంద్రబాబులో అభద్రతా భావానికి కారణమయిందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. అందుకే చివరి అస్త్రంగా పథకాలను ప్రయోగించి తద్వారా రాజకీయంగా జగన్‌ను దెబ్బ కొట్టొచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్‌ పార్టీకి సానుకూలత వచ్చి ఉండకపోతే చంద్రబాబు ఇంత హడావుడిగా ఇన్ని ప్రయోగాలు చేసి ఉండరనే వాదన కూడా వినిపిస్తోంది. చంద్రబాబు ప్రధానంగా వృద్ధులు, మహిళలు, నిరుద్యోగ యువత ఓటు బ్యాంకునే లక్ష్యంగా చేసుకుని సంధించిన ఈ పథకాస్త్రాలు ఎంతవరకూ ఓట్లు రాల్చుతాయో చూడాలి. అయితే.. జగన్ పార్టీ మాత్రం ప్రజలు చంద్రబాబు రాజకీయ ప్రయోజనం కోసం పడుతున్న ఉబలాటాన్ని గమనిస్తున్నారని.. ఆయనను నమ్మరని వాదిస్తున్నారు. ఈ పరిణామాలని గమనిస్తున్న సామాన్య జనం మాత్రం ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయ ప్రయోగాలు ముందు ముందు ఇంకెన్ని చూడాలోనని నిట్టూరుస్తున్నారు.