Begin typing your search above and press return to search.

బంద్ కు చంద్ర‌బాబు మ‌ద్ద‌తు వెనుక స్కెచ్!

By:  Tupaki Desk   |   10 Sep 2018 2:36 PM GMT
బంద్ కు చంద్ర‌బాబు మ‌ద్ద‌తు వెనుక స్కెచ్!
X
రోజురోజుకీ పెట్రోల్ - డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోతోన్నందుకు నిర‌స‌న‌గా కాంగ్రెస్ నేడు భార‌త్ బంద్ కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ బంద్ కు వామ‌ప‌క్షాలు - జ‌న‌సేన‌ల‌తో పాటు అధికార టీడీపీ కూడా మ‌ద్ద‌తిచ్చింది. కాక‌పోతే, వామ‌ప‌క్షాలు - జ‌న‌సేన క‌లిసి నిర‌స‌న తెలిపితే....టీడీపీ మాత్రం ప్ర‌త్యేకంగా నిర‌స‌న తెలిపింది. అయితే, అస‌లు బంద్ లంటే గిట్ట‌ని చంద్ర‌బాబు....ఏదోలా నిర‌స‌నకు ఓకే చెప్ప‌డం ఇపుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌తంలో హోదా కోసం వైసీపీ ఇచ్చిన బంద్ ల‌ను భ‌గ్నం చేయ‌డానికి నానా తిప్ప‌లు ప‌డ్డ చంద్ర‌బాబులో హ‌ఠాత్తుగా ఈ మార్పు ఏమిట‌ని తెలుగు త‌మ్ముళ్లు కూడా ఆశ్చ‌ర్య‌పోతోన్న వైనం. అస‌లు బంద్ ల వ‌ల్ల ఏమీ ఒర‌గ‌దు....అన‌వ‌స‌రంగా షాపులు మూయ‌డం వల్ల జ‌నాలు ఇబ్బందిప‌డ‌తారు అనేంత ఉదాత్త హృద‌యం ఉన్న చంద్ర‌బాబు....హ‌ఠాత్తుగా ఈ బంద్ కు మ‌ద్ద‌తివ్వ‌డం వెనుక అస‌లు మ‌త‌ల‌బు ఏమిటని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే, కాంగ్రెస్ తో భ‌విష్య‌త్తులో పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉన్న చంద్ర‌బాబు...ఆ ప్ర‌కార‌మే నేడు బంద్ కు మ‌ద్ద‌తు తెలిపార‌ని పుకార్లు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ పిలుపు ప్ర‌కారం....ఆ పార్టీ క‌థ - స్క్రీన్ ప్లే....ద‌ర్శ‌క‌త్వంలోనే చంద్ర‌బాబు నేటి బంద్ ను ర‌క్తి క‌ట్టించార‌ని టాక్ వ‌స్తోంది. అంతేకాదండోయ్, ఏపీలో ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు....పెట్రోధరల నుంచి ఊరట క‌లిగించేలా బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఇచ్చారు. పెట్రోల్‌ - డీజిల్‌ పై వ్యాట్ ని 2 రూపాయల వ‌ర‌కు తగ్గిస్తున్నట్లు అసెంబ్లీలో ప్ర‌కటించిన చంద్ర‌బాబు...త‌న పొలిటిక్ మైలేజీని పెంచుకునే ప‌నిలో ప‌డ్డారు. అయితే, పొరుగు రాష్ట్రాలక‌న్నా ఏపీలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఎక్కువేన‌న్న సంగ‌తిని బాబుగారు మ‌రిచార‌న్న‌ది వేరేవిష‌యం. అయితే, ఏపీలో ధరలు తగ్గడంతో.. తెలంగాణలో కూడా తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరలు తగ్గించ‌క‌పోవ‌చ్చ‌నే టాక్ ఉంది. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే....ఏపీలో పెట్రోల్‌ - డీజిల్‌ ధరలు తగ్గించి....కాంగ్రెస్ తో పొత్తును పొడిపించేందుకు చంద్రబాబు స్కెచ్‌ వేశారని అర్థ‌మ‌వుతోంది. అయితే, ఈ త‌ర‌హా చంద్ర‌న్న జిమ్మిక్కులు చూసీ చూసీ...ఏపీ ప్ర‌జ‌లు విసిగిపోయార‌న్న‌ది బాబుగారు గ్ర‌హిస్తే మంచిది!