Begin typing your search above and press return to search.

నిరుద్యోగ భృతి ఇస్తామంటున్న బాబు

By:  Tupaki Desk   |   27 Feb 2017 8:09 AM GMT
నిరుద్యోగ భృతి ఇస్తామంటున్న బాబు
X
బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టారు ఎన్నికలకు ముందు. బాబు వచ్చాడు కానీ జాబు మాత్రం రాలేదు.. ఇంతలో మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఎన్నికలొస్తే ప్రజల ముందుకు వెళ్లాలి.. అప్పుడు మా జాబేదీ అని నిరుద్యోగులు ప్రశ్నిస్తే చెప్పడానికి బాబు వద్ద సమాధానమే లేదు. అందుకే ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే బాబు కొత్త గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. దీనికోసం ఆయన పాత పాటనే కొత్తగా ఎత్తుకుంటున్నారు.

2014 నాటి ఎన్నికల సమయంలో చంద్రబాబు కొత్త ఉద్యోగాల సృష్టి తో పాటు నిరుద్యోగ భృతి ఇస్తామనీ హామీ ఇచ్చారు. తాజాగా మరోసారి నిరుద్యోగ భృతి అంశం తెరపైకి తెస్తున్నారు. ఆదివారం నాడు జ‌రిగిన టీడీపీ పాలిట్‌ బ్యూరో స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. దీనిలో తీసుకున్న ప్ర‌ధాన‌మైన నిర్ణ‌యాల్లో నిరుద్యోగుల‌కు ఇచ్చే భృతి ఒక‌టి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంద‌రికీ నెల‌కు 2000 రూపాయ‌ల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చంద్ర‌బాబు త‌న ఎన్నిక‌ల మానిఫేస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు కావ‌స్తున్నా దానిపై ఇంత‌వ‌రకూ ఎపుడూ చ‌ర్చించ‌డం గానీ, స‌మీక్షించ‌డం గానీ చేయ‌లేదు. అస‌లు నిరుద్యోగుల గురించే ఎపుడూ మాట్లాడ‌లేదు. కొత్త ఉద్యోగాలు కాదు క‌దా,ఉన్న ఉద్యోగాలకే నమ్మకం లేని పరిస్థితి. అన్నింటా ఔట్‌సోర్సింగ్‌పేరిట కాంట్రాక్టుకు ఇచ్చేయ‌డం,కోట్లాది రూపాయ‌లు ప్రైవేటు సంస్థ‌ల‌కు దారాద‌త్తం చేయ‌డం కనిపిస్తోంది. దాదాపు అన్ని శాఖ‌ల్లోనూ ఉద్యోగాల ఖాళీలు ఏర్ప‌డ్డాయి. అన్నిశాఖ‌ల్లోనూ ఖాళీలు ఏర్ప‌డుతున్నాయే త‌ప్ప భ‌ర్తీ మాత్రం జ‌ర‌గ‌డం లేదు. దీంతో నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ మాయ చేసేందుకు రెడీ అవుతోంది.

2019 ఎన్నిక‌ల నాటికి ఓటుహ‌క్కు ఎక్కువ‌గా వినియోగించుకునేది యువ‌కులే. యువత అంటే అధిక శాతం నిరుద్యోగులే. దీంతో వారిని మ‌రోసారి మాయ‌చేయ‌డానికి వ్యూహం రూపొందించారు. అందుకే మూల‌న ప‌డేసిన అస్త్రాన్ని మ‌ళ్లీ తీస్తున్నారు. గ‌తంలో ఇచ్చిన హామీని మ‌రోసారి అమ‌లు చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌బోతున్నారు. పాలిట్ బ్యూరో స‌మావేశంలో నిరుద్యోగ భృతిపై చంద్ర‌బాబు మాట్లాడిన‌పుడు ఇది పాత హామీ అని ఒక్క‌రు కూడా మాట్లాడ‌లేదు. కొత్త‌గా ఇచ్చే హామీలాగా దీని గురించి చ‌ర్చించారు.ఇప్ప‌టికి అయినా స‌రే నిరుద్యోగభృతిసంగ‌తి అలా ఉంచి, ఖాళీ అయిన ఉద్యోగాల గురించి చ‌ర్చించి, నిర్ణ‌యం తీసుకుంటే బాగుండేది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/