Begin typing your search above and press return to search.

రాజీనామాపై దొంగ మాటలు!

By:  Tupaki Desk   |   10 April 2017 5:32 AM GMT
రాజీనామాపై దొంగ మాటలు!
X
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులివ్వడమన్నది పరువు తీస్తున్నా కూడా సర్కారు దీనిపై పిల్లి మొగ్గలు వేయడం మానుకోవడం లేదు. ఈ వ్యవహారంపై వస్తున్న విమర్శలకు అధికారిక వివరణ ఇచ్చే ప్రయత్నాలు జరగకపోవడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఆ నలుగురు రాజీనామా లేఖను స్పీకర్‌ కు పంపారని లీకులిస్తున్నా దానిపై అధికారికంగా ఏమీ చెప్పుకోలేకపోతున్నారు. పైగా స్పీకర్ గానీ ఇప్పటివరకూ ధృవీకరించకపోవడంతో ఈ అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

తెలంగాణలో తెలుగుదేశం టికెట్‌ పై ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్‌ కు టీఆర్‌ ఎస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చింది. అయితే ఆయన ప్రమాణస్వీకారానికి ముందు మీడియాను పిలిచి తాను తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాసిన లేఖను స్పీకర్‌ కు పంపుతున్నట్లు చెప్పి మీడియాకు విడుదల చేశారు. తలసాని రాసిన లేఖ అందిందని స్పీకర్ కార్యాలయం కూడా ప్రకటించింది. తలసాని రాజీనామా లేఖ ఇప్పటికీ స్పీకర్ పరిశీలనలోనే ఉంది. అయితే ఏపిలో కూడా అలాంటి సంప్రదాయం పాటించారా, లేదా? అన్నది గోప్యంగానే ఉంది.

వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన భూమా అఖిలప్రియ - అమర్‌ నాథ్‌ రెడ్డి - సుజయకృష్ణ రంగారావు - ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవులిచ్చి ఇప్పటికి వారం రోజులయింది. వారంతా బాధ్యతలు కూడా స్వీకరించారు. వారు మంత్రులుగా ప్రమాణం చేసే ముందు వైసీపీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారా, లేదా? అన్న విషయం ఇప్పటికీ రహస్యంగానే ఉంచడం, వారంతా రాజీనామాలిచ్చారని కేవలం లీకుల ద్వారా ప్రచారం చేయడం విస్మయం కలిగిస్తోంది. ప్రమాణానికి ముందే ఆ నలుగురు స్పీకర్‌ కు రాజీనామాలు పంపారని లీకు వార్తలొచ్చాయి. శనివారం విశాఖలో నిర్వహించిన మీడియా భేటీలో ఫిరాయింపుల అంశం ప్రస్తావనకు రాగా, అవన్నీ స్పీకర్ పరిధిలో ఉన్నాయని, ఆయనే చర్యలు తీసుకోవలసి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఫిరాయింపుదార్లకు పదవులివ్వడంపై వస్తున్న ఆరోపణలపై స్పందించని బాబు ఎట్టకేలకు మొహమాటాలకు తెరదించి వైఎస్ జగన్‌ పై ఎదురుదాడి ప్రారంభించారు. కాగా, ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారా, లేదా? అన్న అంశంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు దీనిపై అస్పష్ట సమాధానాలే చెబుతున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/