Begin typing your search above and press return to search.

టీడీపీలో ‘సీమ’ టపాకాయ్

By:  Tupaki Desk   |   13 Nov 2017 12:40 PM GMT
టీడీపీలో ‘సీమ’ టపాకాయ్
X
ఏపీ సీఎం చంద్రబాబుపై పార్టీకి చెందిన కోస్తాంధ్ర నేతలు గుర్రుమంటున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్నారు. పైకి వెల్లగక్కలేకపోతున్నా పదవుల విషయంలో ఆయన అన్యాయం చేస్తున్నారంటూ రుసరుసలాడుతున్నారు. రాయలసీమకు, అందులోనూ ఒకే జిల్లాకు రెండు పదవులు కేటాయించడంపై కోస్తా - ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు అసంతృప్తి చెందుతున్నారు.
    
శాసనసభ చీఫ్ విప్‌ గా అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని - శాసనమండలి చీఫ్ విప్‌ గా అదే జిల్లా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ ను నియమించడంతో కోస్తాంధ్ర నేతలు దీనిపై చర్చించుకుంటున్నారు. ఒకే జిల్లాకు రెండు పదవుల ఇవ్వడమే కాకుండా ఆ రెండూ అగ్ర కులాలవారికే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
    
చంద్రబాబు క్యాబినెట్లో ఆయన - మంత్రులు లోకేష్ - అమర్‌ నాథ్‌ రెడ్డి - ఆదినారాయణరెడ్డి - కేఈ కృష్ణమూర్తి - అఖిలప్రియ - పరిటాల సునీత - కాల్వ శ్రీనివాసులు రాయలసీమకు చెందినవారే. అనంతపురం జిల్లా ఎమ్మెల్యే యామినీబాల - కడప జిల్లా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌ రెడ్డి అసెంబ్లీలో విప్‌ లుగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు అనంతపురం జిల్లాకే మండలి - శాసనసభ చీఫ్ విప్ పదవులు ఇస్తుండడంతో కోస్తా ఎమ్మెల్యేలు రగులుతున్నారు.
    
మరోవైపు మండలి చైర్మన్‌ గా కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎన్‌ ఎండీ ఫరూఖ్‌ ను ఖరారు చేశారు. ఆయనదీ రాయలసీమే. ఇలా అన్ని కీలక పదవులూ రాయలసీమకే దక్కితే ఇక తమ ప్రాంతం మాటేమిటని కోస్తా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.