Begin typing your search above and press return to search.

ప్రత్యర్థికి పదవి కట్టబెట్టిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   15 March 2016 7:40 AM GMT
ప్రత్యర్థికి పదవి కట్టబెట్టిన చంద్రబాబు
X
విపక్షాలు విమర్శలు చేయటం.. అధికారపక్షం దాన్ని తిప్పి కొట్టటం.. లాంటివి తరచూ రాజకీయాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ.. విపక్షంలోనూ సమర్థులైన నాయకులు కొందరు ఉంటారు. అలాంటి వారిని గుర్తించి.. కొన్ని కీలకబాధ్యతలు అప్పగిస్తే.. పాలన మరింత బాగా నడుస్తుంది. కానీ.. అంత పెద్ద మనసు దాదాపు ఎవరికి ఉండదు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో అలాంటివి కలలో కూడా ఊహించలేం. అందులోకి సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో జరిగిన రచ్చ చూసిన తర్వాత.. విపక్షానికి చెందిన ఒక నాయకుడికి అధికారపక్షం పదవులు అప్పజెప్పటం కలలోకూడా సాధ్యం కాదని చెబుతారు.

కానీ.. ఇలాంటి అరుదైన ఘటన అసెంబ్లీలో కాకుండా.. అసెంబ్లీ లాబీల్లో జరిగిన ఒక కార్యక్రమంలో చోటు చేసుకుంది. ఇలాంటి ఆసక్తికర నిర్ణయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమయ్యారు. విపక్షానికి చెందిన ఎమ్మెల్సీ సూర్యారావు పీడీఎప్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన కామన్వెల్త్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు.. సూర్యారావు మాట్లాడారు.

కాస్త భారీ ప్రసంగం చేసిన ఆయన.. ఎన్నికల వరకే విభేదాలని.. ఎన్నికల తర్వాత అందరూ కలిసి ఉండాలంటూ గాంధీ అన్నారని.. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. ఇన్ని కష్టాల మధ్య చంద్రబాబు ఎలా పాలన చేస్తున్నారో అర్థం కావటం లేదంటూ సూర్యారావు వ్యాఖ్యానించారు. పెళ్లిళ్లు.. తిరుపతి హుండీలకు.. చర్చిలకు కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తున్న వారు.. ఆ డబ్బుతో పేదల ఆరోగ్యానికి కానీ.. సంక్షేమానికి కానీ ఖర్చు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సూర్యారావు సుదీర్ఘ ప్రసంగం మండలి ఛైర్మన్ చక్రపాణి కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించింది. అయితే.. ఆయన ప్రసంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తిగా వినటమే కాదు.. ఆయన్ను.. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని జిల్లా కేంద్ర ఆసుపత్రి సలహా మండలి ఛైర్మన్ గా నియమిస్తున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. సమర్థుడైన వ్యక్తి.. విపక్ష నేతగా ఉన్నప్పటికీ అలాంటి వ్యక్తికి పదవిని ఇవ్వటం ఇప్పుడున్న దూకుడు రాజకీయాల్లో అరుదైన అంశంగా చెప్పక తప్పదు.