Begin typing your search above and press return to search.

మాట్లాడాలి.. కానీ అహంకారం వ‌ద్దు బాబు!

By:  Tupaki Desk   |   26 Oct 2018 8:22 AM GMT
మాట్లాడాలి.. కానీ అహంకారం వ‌ద్దు బాబు!
X
ఎంత ప్ర‌త్య‌ర్థి అయినా కావొచ్చు. కానీ.. దుర్మార్గంగా.. కుట్ర‌పూరితంగా క‌త్తి దూసిన తీరును ఎవ‌రైనా ఖండించాలి. ఒక‌వేళ ఖండించ‌టం ఇష్టం లేకుంటే మౌనంగా ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా సిగ్గుమాలిన మాట‌ల‌తో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే స‌మాజం క్ష‌మించ‌దు.

బాధితుడ్ని ఓదార్చ‌టం మానేసి.. బాధితుడికి మ‌రింత నొప్పి క‌లిగేలా మాట్లాడ‌టం.. అధికారం చేతిలో ఉంది క‌దా అని విరుచుకుప‌డ‌టాన్ని తెలుగు ప్ర‌జ‌లు మ‌రీ ముఖ్యంగా ఏపీ ప్ర‌జ‌లు అస్స‌లు స‌హించ‌ర‌న్న విష‌యాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌ర్చిపోయార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 2004కు ముందు సైతం ఇదే అహంకారంతో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై విరుచుకుప‌డే త‌త్త్వం ఉన్న బాబుకు ఏపీ ప్ర‌జ‌లు త‌గిన శాస్తి చేసిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ప‌దేళ్ల విరామం త‌ర్వాత అధికారం చేతిలోకి వ‌చ్చి.. ప‌వ‌ర్లోకి రావ‌టానికి సాయం చేసిన వ్య‌క్తి మీద విరుచుకుప‌డే అల‌వాటున్న బాబుకు.. ప్ర‌త్య‌ర్థి అయిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విషం చిమ్మ‌టం ఒక లెక్కా? రాజ‌కీయంగా స‌వాల‌క్ష ఉండొచ్చు.. కానీ వ్య‌క్తిగ‌తంగా దాడుల‌కు దిగిన వైనాన్ని.. హ‌త్యకు దిగ‌టాన్ని ఎంత‌మాత్రం ఉపేక్షించ‌కూడ‌దు. కానీ.. ఆ విష‌యాన్ని వ‌దిలేసి.. ఏపీ ముఖ్య‌మంత్రి మొద‌లు మంత్రుల వ‌ర‌కూ నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం.. అదేమంటే.. జ‌గ‌న్ మీద‌నే నింద‌లు వేసే ధోర‌ణి చూసిన‌ప్పుడు బాబుకున్న సీనియార్టీ ఇదేనా? అన్న డౌట్ రాక మాన‌దు.

తెలుగు ప్ర‌జ‌లు దేనినైనా క్ష‌మిస్తారు కానీ అహంకారాన్ని.. అధికార మ‌దాన్ని ఏ మాత్రం ఒప్పుకోర‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. బాబు అండ్ కో ఈ విష‌యాన్ని మ‌ర్చిపోతే.. ఒక్క‌సారి చ‌రిత్ర‌ను తిప్పి చూస్తే.. చాలానే ఉదాహ‌ర‌ణ‌లు క‌ళ్ల ముందు క‌నిపిస్తాయి. జ‌గ‌న్ పై దాడిని ఖండించ‌కున్నా.. ఓదార్చ‌కున్నా ఫ‌ర్లేదు. కానీ.. ఆయ‌న్ను ఆడిపోసుకునేలా మాట్లాడ‌టం ఏ మాత్రం మంచిది కాద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.