Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ డిమాండ్ల‌కు బాబు ఓకే చెప్పేశారు!

By:  Tupaki Desk   |   7 Jan 2017 5:07 AM GMT
ప‌వ‌న్ డిమాండ్ల‌కు బాబు ఓకే చెప్పేశారు!
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్ర‌జ‌ల త‌ర‌ఫున వినిపించిన గ‌ళానికి ఫ‌లితం ద‌క్కిన‌ట్లే ఉంది. ఉద్దానం కిడ్నీరోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పింఛన్లు మంజూరు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఆ ప్రాంతంలో కిడ్నీ మహమ్మారి బారినపడిన గ్రామాలన్నీంటినీ మానవతా సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని ప్రకటించారు. వ్యాధి తీవ్రతనుబట్టి వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయలు బాధితులకు నెలవారీ పింఛన్ అందించి ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో శుక్రవారం జరిగిన జన్మభూమి-మావూరు గ్రామసభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ ఈ నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు. ఉద్దానం కిడ్నీరోగులకు ఆర్థిక భరోసా - ఆరోగ్య భద్రత కల్పించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన డిమాండ్‌ కు స్పందనగా కిడ్నీరోగులకు ముఖ్యమంత్రి పింఛన్ పథకం ప్రకటించడం గమనార్హం.

శ్రీ‌కాకుళం జిల్లాను పీడిస్తున్న కిడ్నీవ్యాధి పట్ల కేంద్రప్రభుత్వం పలుమార్లు కమిటీలు నియమించి రీసెర్చ్ చేయించిన నివేదికలు ఇంకా పూర్తిగా రాలేదని చంద్ర‌బాబు తెలిపారు. కేవలం మంచినీటి వల్ల వచ్చే రోగంగా పరిగణనలోకి కొన్ని సర్వేలు తీసుకున్నప్పటికీ, వాటికంటే బలమైన కారణాల కోసం ప్రపంచదేశాల నుంచి నిపుణుల బృందాలను రప్పించి ఉద్దానం కిడ్నీ రోగాల మూలాలను పట్టుకుంటామన్నారు. అంతకుముందే ఎన్టీఆర్ ట్రస్టు నుంచి ఉద్దానంలోని గ్రామాల ప్రజలకు ప్రతి ఇంటికి రెండు రూపాయల ధరకు 20 లీటర్ల మినరల్ వాటర్‌ ను ఈ నెల 26వ తేదీనుంచి సరఫరా చేస్తామన్నారు. కుప్పం తరహాలో ఉద్దానంలో కూడా మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని అధికారులను చంద్ర‌బాబు ఆదేశించారు. ఇప్పటికే మూడు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని - పలాస - సోంపేట ప్రాంతాల్లో మరో రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉద్దానం నుంచి కెజీహెచ్ వరకూ వెళ్ళాల్సిన రోగులకు ఉచిత రవాణాసౌకర్యం కల్పించేలా ఉచిత బస్సుపాస్‌ లు ఇస్తామన్నారు. మొబైల్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో పరిశ్రమలు - మంచినీటి - సాగునీటి ప్రాజెక్టులు రాకుండా కొంతమంది అడ్డుపడుతున్నారని, వారిని ఇకపై క్షమించేదిలేదంటూ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే వంశధార ప్రాజెక్టు పనులకు రూ. 421 కోట్లు మంజూరు చేశామని, మూడు దశలుగా ప్రాజెక్టు పనులు పూర్తికావస్తుందని, జూన్ నాటికి వంశధార శ్రీకాకుళం రైతాంగానికి ఇస్తామని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/