Begin typing your search above and press return to search.

అన్నగారికి వెన్నుపోటు : పాతికేళ్ళ పాత కధ...కొత్తగా బాబు చెప్పిన కధ

By:  Tupaki Desk   |   14 Oct 2022 3:36 PM GMT
అన్నగారికి వెన్నుపోటు : పాతికేళ్ళ పాత కధ...కొత్తగా బాబు చెప్పిన కధ
X
ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడవలేదు. ఆయన మా ఆరాధ్య దైవం. ఆనాడు అందరం కలసి ఎన్టీయార్ వద్దకు వెళ్ళి తీరు మార్చుకోవాలని కోరామని అహా ఓటీటీలో ప్రసారం అయిన రియాల్టీ షోలో అన్ స్టాపబుల్ లో చంద్రబాబు చెప్పారు. ఎన్టీయార్ మా మాట వినలేదు, గత్యంతరం లేకనే పార్టీని చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది అని చంద్రబాబు చెప్పారు.

ఇది 1995 ఆగస్టులో జరిగింది. అయితే ఈ వెన్నుపోటులో వాస్తవాలు ఇవీ అని చంద్రబాబు ఇపుడు అంటే ఇరవై ఏడేళ్ల తరువాత చెబుతున్న మాటలను చూస్తే అసలు ఎన్టీయార్ దే తప్పు అని అంతా అనుకుంటారు. నిజానికి చంద్రబాబు చెప్పినది వాస్తవమా. లేక ఆనాడు తనను అల్లుడు వెన్నుపోటు పొడిచారు అని ఇప్పటికీ యూ ట్యూబ్ లో పాత ఇంటర్వ్యూలలో ఎన్టీయార్ స్వయాన చెప్పిన మాటలు సత్యమా అంటే జనాలకు ఏది నచ్చితే అది తీసుకుంటారు. ఎందుకంటే ఇది పాత కధ. ఎన్టీయార్ వెన్నుపోటు గురించి ఇప్పటి తరానికి అవసరం కూడా లేదు.

కానీ ఆనాడు పత్రికలలో వచ్చిన కధనాలు ఆనాటి సమాచారం, అప్పటికి యువకులుగా ఉంటూ ఇపుడు నడివయసులో పడిన వారు చెప్పిన సమాచారం ఇవన్నీ కనుక చూస్తే ఎన్టీయార్ కి తీరని అన్యాయం జరిగింది అనే అంతా ముక్తకంఠంతో అంటారు. దానికి ప్రధాన కారణం ఎన్టీయార్ వయసులో కురువృద్ధుడు. ఆయన అప్పటికే అనారోగ్యం పాలు అయిన ఉన్న వారు. ఇక ఎన్టీయార్ విషయంలో తీరు మార్చుకోమని చెప్పడం వరకూ ఓకే అనుకున్నా ఆయన తీరు మారకపోయినా, పార్టీలో పద్ధతులు నచ్చకపోయినా ఎవరైనా చేయాల్సింది ఏంటి అంటే తామే రాజీనామా చేసి బయటకు వచ్చేయడం.

కానీ అలా జరగలేదు సరికదా ఎన్టీయార్ నే పార్టీ నుంచి బయటకు పంపించారు. దానికి మెజారిటీ నిర్ణయం అని చెప్పుకున్నారు కానీ నిజానికి ఎన్టీయార్ కుటుంబంలో జరిగిన వివాదాల వల్ల పార్టీలో నాయకత్వం మార్పు జరిగింది. అది కూడా కుటుంబ సభ్యులు ఎన్నుకున్న మీదట పార్టీ వారు దాన్ని అనివార్యంగా ఆమోదించాల్సి వచ్చింది అని నాటి కధనాలు చూస్తే తెలుస్తుంది.

ఇక ఆనాటి వెన్నుపోటు ఉదంతం తీసుకుంటే దానికి బీజాలు 1994 ఎన్నికల కంటే ముందే పడ్డాయని దివంగత ఎన్టీయార్ ఇచ్చిన అనేక ఇంటర్వ్యూల బట్టే అర్ధమవుతుంది. 1993 సెంప్టెంబర్ లో లక్షీపార్వతిని ఎన్టీయార్ వివాహం చేసుకున్నారు. అది కుటుంబానికి నచ్చలేదు అని నాటి పత్రికలు రాశాయి.

ఇక ఎన్టీయార్ కి ఈ పెళ్ళి తరువాత చంద్రబాబు బాగా దూరం అయ్యారని కూడా పత్రికా కధనాలు నాడు వచ్చాయి. అంటే పూర్వం అంతలా సాన్నిహిత్యం అయితే ఆయనకు లేదు అని రాశాయి. అదే టైమ్ లో టీడీపీకి తక్కువ సీట్లు వస్తే పార్టీని చీల్చి కాంగ్రెస్ తో చేతులు కలపాలని చంద్రబాబు 1994 ఎన్నికలకు ముందే పధక రచన చేశారని కూడా నాడు పదవీచ్యుతుడైన ఎన్టీయార్ బాబు గురించి చెప్పిన మాటలు చేసిన ఆరోపణలు.

ఇక 1994లో ఎంటీయార్ రాష్ట్ర పర్యటనలు చేశారు. ఆయనకు జనాలు బ్రహ్మ రధం పట్టారు. అయితే ద్వితీయ వివాహం మూలంగా చెడ్డ పేరు వచ్చి ఎన్టీయార్ ఆ ఎన్నికల్లో ఓడిపోతారని చంద్రబాబు భావించారని ఎన్టీయార్ పాత ఇంటర్యూలలోనూ చెప్పారు. తాజాగా లక్ష్మీ పార్వతీ అదే చెప్పింది. కానీ చిత్రంగా ఎన్టీయార్ కి మొత్తం ఉమ్మడి ఏపీలో 294 సీట్లలో 226 దాకా వచ్చాయి. ఇక పొత్తులతో మిత్రులుగా ఉన్న వామపక్షాలకు మరో పాతికకు పైగా సీట్లు వచ్చాయి. ఇలా అసెంబ్లీ మొత్తం టీడీపీ కమ్మేసిన అరుదైన సందర్భం అది.

అయితే భారీ మెజారిటీ రావడంతో పార్టీలో ఎంటీయార్ కి తిరుగులేకుండా పోయింది. అయితే చంద్రబాబుకు ఎన్టీయార్ రెవిన్యూ ఆర్ధిక మంత్రిత్వ శాఖలు ఇచ్చారు. ఆ తరువాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులుగా ఉన్న వారిని బాబు వర్గీయులుగా టికెట్ దక్కించుకోలేని వారు ఓడించారని నాడు పత్రికలలో వార్తలు వచ్చాయి. అలా చేసిన వారి మీద ఎన్టీయార్ వేటు వేశారు.

అపుడు అసలైన వివాదం ఏర్పడింది అని చెబుతారు. ఆ తరువాత చంద్రబాబు ఎన్టీయార్ ని దించడానికి వెన్నుపోటు రాజకీయానికి విశాఖను వేదికగా చేసుకున్నారని కూడా నాటి పత్రికా వార్తల సమాచారం. ప్రజల ముంగిట పాలన కార్యక్రమాన్ని ఎన్టీయార్ విశాఖలో ప్రారంభించినపుడు ఆయనతో పాటే వచ్చిన బాబు విశాఖలోని ఒక మీడియా అధిపతి హొటెల్ లో ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపి వెన్నుపోటు వ్యూహాన్ని రచించారు అని స్వయంగా ఎన్టీయారే చెప్పారు.

అంతే కాదు నాడు శ్రీకాకుళం జిల్లాకు ఎన్టీయార్ చాలా మంది నాయకులు ఆయన వెంట వెళ్లకుండా బాబు వత్తిడి చేశారని, కానీ వారు హాజరయ్యారని ఎన్టీయార్ చెప్పడం జరిగింది. ఇలా విశాఖలో మొదలైన వెన్నుపోటు ఎపిసోడ్ ని ఎన్టీయార్ పసిగట్టి విశాఖ టూర్ తరువాత హైదరాబాద్ చేరుకున్నాక 1995 ఆగస్ట్ 25న పార్టీ నుంచి చంద్రబాబు అశోక్ తదితరులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కి లెటర్ పంపారు.

అయితే దాని మీద స్పీకర్ ఎలాటి చర్యలు తీసుకోలేదు కానీ త్వరితగతిన జరిగిన పరిణామాల మధ్య ఎన్టీయార్ మరో మూడు నాలుగు రోజులకే మాజీ అయిపోయారు. ఈ విషయంలో బాబుకు ఎన్టీయార్ ఫ్యామిలీ మొత్తం అండగా నిలిచింది. ఇదంతా ఎన్టీయార్ స్వయంగా చెప్పినది యూ ట్యూబ్ లో ఇప్పటికీ కనిపిస్తుంది. పాతికేళ్ళ నాటి వెన్నుపోటు అది అని బాధితుడు ఎన్టీయార్ చెప్పినది అలా ఉంటే తెర వెనక కధ ఇదీ అని ఇన్నేళ్ళ తరువాత కొత్తగా చంద్రబాబు చెప్పారు. ఈ రెండింటిలో ఏది వాస్తవం అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవడం బెటర్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.