Begin typing your search above and press return to search.

ఈ ‘‘పాల’’ లెక్కలో లాజిక్ మిస్ బాబుగారు

By:  Tupaki Desk   |   30 May 2016 4:44 AM GMT
ఈ ‘‘పాల’’ లెక్కలో లాజిక్ మిస్ బాబుగారు
X
అధినేత మనసును దోచుకోవటానికి పలువురు నేతలు పెద్ద ఎత్తున పని చేస్తుంటారు. ఇలాంటి వారి మాటల్లో విషయం కంటే బడాయే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించటంలో ఏ మాత్రం పొరపాటు చేసినా అభాసుపాలు కావాల్సిందే. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ సుదీర్ఘ కాలంగా రాజకీయాల్ని నిర్వహిస్తున్న బాబు లాంటి వాళ్లు కొందరి మాటలకు బుట్టలో పడిపోవటం ఏ మాత్రం బాగోదు.

తిరుపతిలో నిర్వహించిన మహానాడులో భాగంగా మూడో రోజు బాబు ఓ పిల్లాడ్ని చూపిస్తే అబ్బురపడిపోయారు. పనిలో పనిగా.. పార్టీ నేతలకు చిన్నపాటి క్లాస్ పీకారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఐదోతరగతి చదువుతున్న హేమంత్ సాయి అనే కుర్రాడు ప్రతిరోజూ తన ఫ్రెండ్స్ తో కలిసి పాలపాకెట్లు వేశాడని.. అలా సంపాదించిన రూ.50వేల మొత్తాన్ని పార్టీ అధినేత చంద్రబాబు చేతికి విరాళంగా ఇవ్వటంపై బాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయసులో మరీ ఇంత పెద్ద మనసా అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఐదో తరగతి చదువుతున్న చిన్న పిల్లాడు రోజూ స్నేహితులతో కలిసి పాల ప్యాకెట్లు అమ్మటం ద్వారా రూ.50వేల మొత్తాన్ని సంపాదించినట్లుగా చెబుతున్న విషయంలోని లాజిక్ వెతికే ప్రయత్నం చేస్తే.. బాబు అభాసుపాలు కావటం తప్పదన్న భావన కలుగుతోంది.

ఎందుకంటే.. పాలపాకెట్లు వేయటం ద్వారా రూ.50వేల మొత్తాన్ని సంపాదించాలంటే.. కనీసం లక్ష పాకెట్లను అమ్మాల్సి ఉంటుందని చెబుతున్నారు. హేమంత్ తన స్నేహితులు పది మంది చొప్పున రోజుకు 20 పాకెట్లు చొప్పున పాల పాకెట్లు ఇళ్లకు వేస్తున్నారనుకుంటే.. రోజు వారీ సంపాదన 10 రూపాయిల చొప్పున 100 రూపాయిలు. అంటే నెలకు రూ.3వేలు. లేదంటే ఆరు వేలు వేసుకుందాం. ఈ లెక్కన రూ.50వేల సంపాదన కోసం ఈ పదిమంది స్నేహితులు ఎనిమిది నెలలు కష్టపడి ఉండాలి. అప్పటికి మరో రూ.2వేలు తగ్గుతుంది కూడా.

ఒకవేళ.. నిజంగానే పది మంది పిల్లలు (సుమారుగా అనుకుందాం. ఒకవేళ పది మంది కాకుండే నెలల లెక్క మరింత పెరిగే ఛాన్స్ ఉంది) కానీ ఇలాంటి పని చేసి ఉంటే గ్రేట్ అనే చెప్పాలి. మరి.. అంత గ్రేట్ లాంటి విషయానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతుల్ని ఒక్క పిల్లాడికే కట్టబెట్టటం ఏమిటి? ఆ పిల్లలందరిని వేదిక మీదకు ఎక్కించి.. వారు ఎందుకిలా చేశారు? టీడీపీ అంటే వారికి ఎందుకంత అభిమానం? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పిస్తే ఎంత స్ఫూర్తిగా ఉంటుంది? కానీ.. ఇలాంటివేమీ లేకుండా.. వేదిక మీదకు వచ్చి ఒక పిల్లాడు పాలపాకెట్లు అమ్మి రూ.50వేలు సంపాదించానంటే.. పాలు అమ్మే వ్యాపారం ఉన్న చంద్రబాబుకు లెక్క తట్టకపోవటం ఏమిటి చెప్మా..? ఏమైనా చిన్నారి పాలపాకెట్ల లెక్కలో లాజిక్ మిస్ అయ్యిందన్న మాట టీడీపీ తమ్ముళ్లు గుసగుసలాడుకోవటం కనిపించటం గమనార్హం