Begin typing your search above and press return to search.

ఆరు రోజులు బాబు కనిపించరన్న మాట

By:  Tupaki Desk   |   2 Aug 2015 10:30 AM GMT
ఆరు రోజులు బాబు కనిపించరన్న మాట
X
ఏడాదికి ఒకసారి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలకు వెళ్లటం.. కలిసి తిరిగి రావటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీకి మామూలే. ఈ ఏడాది టర్కీ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 7 వరకు ఆయన విదేశీ పర్యటనలో ఉండనున్నారు.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆరు రోజుల పాటు అధికారిక కార్యక్రమాలకు అందుబాటులో ఉండకుండా పోవటం చిన్న విషయం కాదు. విదేశీ పర్యటనలకు బాబు వెళ్లటం కొత్త కాకున్నా.. ఫ్యామిలీతో వెళ్లే ట్రిప్పుల సందర్భంగా బాబు పూర్తిస్థాయి ఫ్యామిలీ పర్సన్ అయిపోతారు.

బాబు ఎక్కడున్నా మీడియాకు అందుబాటులో ఉంటూ.. వారితో వీలైనన్ని ఎక్కువసార్లు కనిపించే బాబు.. ఫ్యామిలీ టూర్ విషయంలో మాత్రం తన వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. తన మాట అన్నది వినిపించకుండా ఆయన ఫ్యామిలీకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక.. టర్కీ టూర్ విషయానికి వస్తే.. ఆయన కుమారుడు.. చంద్రబాబు కంటే ఒక రోజు ముందే బయలుదేరి వెళ్లిపోయారు.

ఇక.. చంద్రబాబు మాత్రం ఆదివారం ఉదయం.. ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని ఉదయాన్నే సందర్శించుకొని.. అటు నుంచి విమానాశ్రయానికి వెళ్లిపోయారు. రానున్న ఆరు రోజుల పాటు బాబు మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపించదన్న మాట. నిత్యం.. బాబుకు సంబంధించి వార్తలతో నిండి ఉండే మీడియాలో.. బాబు లేక వెలవెలపోతాయన్న మాట.