Begin typing your search above and press return to search.

సుజనాను సైడ్‌ లైన్ చేసిన చంద్రబాబు!

By:  Tupaki Desk   |   12 Feb 2018 4:06 AM GMT
సుజనాను సైడ్‌ లైన్ చేసిన చంద్రబాబు!
X
తాజా పరిణామాల్లో తెలుగుదేశానికి చెందిన కేంద్రం మంత్రిని చంద్రబాబునాయుడు సైడ్ లైన్ చేశారా? భారతీయ జనతా పార్టీ మీద దాడి చేయడంలో ఆయన తీవ్రత పెంచడం కంటె - మెతక ధోరణితో మొదటికి మోసం తెస్తున్నాడనే భావనకు చంద్రబాబునాయుడు వచ్చారా? లేదా, ఇతర ఎంపీలతో దాడిని తీవ్రం చేయించి.. ఆ తర్వాత.. పరిస్థితులు బెడిసికొట్టే పరిస్థితి వస్తే గనుక.. అప్పుడు కేంద్రంతో మెత్తగా మాట్లాడి బంధం చెడకుండా చూసుకోవడానికి సుజనాను ప్రస్తుతం వెనకగడిలోకి తీసుకువచ్చారా? ఏపీ మరియు కేంద్రం మధ్య జరుగుతున్న పోరాటాన్ని గమనిస్తున్న వారికి తాజాగా ఇలాంటి సందేహాలు అనేకం కలుగుతున్నాయి.

సుజనాచౌదరి కేంద్రమంత్రి హోదాలో.. మోడీ కేబినెట్ లో భాగస్వామి. పైగా తెలుగుదేశంకు పార్లమెంటరీ పార్టీ నాయకుడు. కేంద్రంలో ఒకవైపు ఎంపీలు బీభత్సంగా పోరాటం సాగిస్తూ ఉండగానే... సుజనాచౌదరి మరోవైపు తెదేపా తరఫు మంతనాలు నడుపుతూ వచ్చారు. స్వయంగా మంత్రి గనుక ఆయన పోరాటంలో పెద్దగా పాల్గొనలేదు. మంత్రిగా ఉండి పోరాటంలో పాల్గొన్నంత మాత్రాన ఏమైపోతుందో మనకు తెలియదు. ఇప్పుడు రాష్ట్రానికి జరిగిన, జరుగుతున్న నష్టం కంటె పెద్ద నష్టం జరుగుతుందో ఏమో అంచనా వేయలేం. కానీ ఆయన మాత్రం పోరుబాటకంటె.. మంతనాల బాటనే ఆశ్రయించారు.

తాజాగా తొలివిడత బడ్జెట్ సమావేశాలు జరిగినంత కాలమూ.. ఎంత పోరాడినా ఏమాత్రం పట్టించుకోకుండా.. మీనమేషాలు లెక్కించిన... కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్కటిగా నిధులు విడుదల చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంకా కసరత్తుల పేరిట కొంత మాయ జరుగుతోంది. ఇప్పటికే చాలా ఇచ్చేశాం.. ఏపీ చెబుతున్న లెక్కల్లో తేడాలున్నాయి లాంటి కబుర్లు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. తాము విదిల్చబోతున్నది అతి తక్కువ మొత్తమే అయినప్పటికీ.. అలా తక్కువ ఇవ్వడానికి కారణం చంద్రబాబే తప్ప.. కేంద్రం కాదని ప్రజలు అనుకోవాలనేది భాజపా ఆలోచనగా చెప్పుకుంటున్నారు.

మరి అలాంటప్పుడు మితవాద సైనికుడి లాగా.. సుజనా చౌదరి పోరాటం ఉన్నదని.. ఆయననే తెర ముందు పెట్టుకుని.. తెదేపా తరఫు ప్రతి ప్రెస్ మీట్ కు ఆయనతో మాట్లాడిస్తే గనుక.. తమ పార్టీకే చేటు జరుగుతుందని వారు భావించినట్లున్నారు. అందుకే సుజనాను సైడ్ లైన్ చేసి.. కాస్త ఆవేశంగా మాట్లాడగల గల్లా జయదేవ్ - రామ్మోహన్ నాయుడు లను తెర ముందుకు తెచ్చినట్లుంది.