Begin typing your search above and press return to search.

చంద్రబాబు చెప్పకనే చెప్పారా ?

By:  Tupaki Desk   |   17 Jan 2018 6:57 PM GMT
చంద్రబాబు చెప్పకనే చెప్పారా ?
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడి రాజకీయాలు చాలా డిఫరెంటుగా ఉంటాయి, ఏ పని కోసం ఎవరిని పట్టాలో - ఎటు నుంచి నరుక్కురావాలో ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదంటారు. ఇప్పుడు ఉభయ రాష్ర్టాల గవర్నరు విషయంలోనూ ఆయన రాజకీయం చేస్తున్నారని... పేరుకు ఏపీ బీజేపీ నేతలు గవర్నరును మార్చాలని పట్టుపడుతున్నా, అదంతా చంద్రబాబు డైరక్షన్లో జరుగుతున్నదేనన్న వాదన ఒకటుంది. తాజాగా చంద్రబాబు దాన్ని కాదనడంతో అది అవునని తేలింది. గవర్నరు మార్పుపై తానేమీ మాట్లాడబోనని.. అది బీజేపీకి సంబంధించిన అంశమని ఆయన అన్నారు. దీంతో అంత కీలకమైన పదవి విషయంలో చంద్రబాబు తనకేమీ సంబంధం లేదనడమే అసలు సంగతిని చెప్పేస్తోందని అంటున్నారు.

ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన చంద్రబాబు.. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గవర్నర్ మార్పుపై తాను స్పందించబోనని - బీజేపీ ఎంపీ హరిబాబు రాసిన లేఖ వాళ్ల పార్టీకి సంబంధించిన అంశమని అన్నారు. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు అరుణ్ జైట్లీని ఆహ్వానించానని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ - రెవెన్యూ లోటు భర్తీ అంశాలపై చర్చించానని చెప్పారు. ఈఏపీ ద్వారా కాకుండా నాబార్డు - హడ్కో ద్వారా నిధులు ఇవ్వాలని కోరామని అన్నారు. రెవెన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్‌ కి ఇంకా నిధులు రావాల్సి ఉన్నాయని చెప్పారు.

కాగా ఏపీ బీజేపీలో విశాఖ ఎంపీ హరిబాబుకు చంద్రబాబు మనిషన్న ముద్ర ఉంది. వెంకయ్యనాయుడు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఆయన, హరిబాబు.. చంద్రబాబుకు అండగా ఉండేవారు. కన్నా లక్ష్మీనారాయణ - సోము వీర్రాజు - పురంధేశ్వరి వంటి బీజేపీ నేతలు నిత్యం చంద్రబాబును విమర్శిస్తున్నా హరిబాబు మాత్రం ఎన్నడూ చంద్రబాబును పల్లెత్తి మాటన్నది లేదు. అంతేకాదు.. చంద్రబాబు ప్రభుత్వం తప్పులను కేంద్రం వరకు వెళ్లకుండా చూడడంలో.. కేంద్రం వద్ద చంద్రబాబు తరఫున లాబీయింగ్ చేయడంలోనూ హరిబాబు కీలకమని ఆ పార్టీ నేతలే విమర్శిస్తుంటారు. ఇప్పుడు యాంటీ నరసింహన్ క్యాంపెయిన్‌ ను హరిబాబు - విష్ణుకుమార్ రాజులు ఎత్తుకోవడం వెనుక చంద్రబాబు ఉన్నారనే ఆరోపణలున్నాయి.